TG: తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూ, ఆయన నడుపుతున్న పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన అంబర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయాలపై సంచలన విషయాలు మాట్లాడారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి కేవలం కొద్దిరోజులు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కరెంట్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని నిపుణులు ముందే చెప్పినా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేసి, తమను తిట్టడమే పనిగా కాంగ్రెస్ నేతలు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ తీరుతో మోసపోయిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీస్తూ యువత సీజేపీ పేరుతో రోడ్లపైకి వచ్చి పోరాడుతోందని గుర్తుచేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎంపీలు ఏమాత్రం పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ రాజకీయాలపైనా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ హయాంలో ఏం జరిగిందో ప్రజలంతా చూశారని, అటు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదని తేల్చిచెప్పారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి పార్టీలే రానున్న రోజుల్లో చక్రం తిప్పబోతున్నాయని, ఆ మార్పులో కేసీఆర్ అత్యంత కీలక పాత్ర పోషించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.


