తెలంగాణ

మావోయిస్టుల మరణాలకు గుర్తింపు ఎక్కడ.. సంస్మరణ దినోత్సవాలు ఇంకెప్పుడు?

రచన: Mahesh••7 నిమిషాల పఠనం

సమాజ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకుంటూ ఏటా సంస్మరణ వేడుకలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. అక్టోబర్ 21న మొదలైన ఈ కార్యక్రమాలు అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు పది రోజుల పాటు కొనసాగుతాయి.

సమాజ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకుంటూ ఏటా సంస్మరణ వేడుకలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. అక్టోబర్ 21న మొదలైన ఈ కార్యక్రమాలు అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు పది రోజుల పాటు కొనసాగుతాయి. విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం, ఉద్యోగాలు, అవార్డులు ఇచ్చి అండగా నిలుస్తోంది. అయితే సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది.

పోలీసుల త్యాగాలను ఎవరూ కాదనడం లేదు. కానీ అదే సమయంలో పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం అడవి బాట పట్టి ప్రాణాలు వదిలిన మావోయిస్టుల సంగతేంటి? అనే గొంతులు నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజల రక్షణ కోసం పోలీసులు ప్రాణాలిస్తే, అణగారిన ప్రజల హక్కుల కోసం మావోలు బలైపోయారని కొందరు వాదిస్తున్నారు. మార్గాలు వేరైనా ఇరువైపులా నేలకొరిగింది నిరుపేద కుటుంబాల బిడ్డలేనని గుర్తుచేస్తున్నారు. ఉద్యమం దాదాపుగా తుది దశకు చేరిన వేళ, పోలీసు అమరులకు నివాళులు అర్పించినట్లే.. చనిపోయిన మావోయిస్టుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని, వారికి ప్రత్యేకంగా సంస్మరణ దినోత్సవాలు అధికారికంగా ప్రకటించాలనే సరికొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

2025 దెబ్బకు కుదేలైన మావోయిస్టు అగ్ర నాయకత్వం

గత కొన్నేళ్లలో, ముఖ్యంగా 2025లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ దాదాపు కనుమరుగైపోయే స్థాయికి చేరింది. 2021 నవంబర్ 13న మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ మిలింద్ తెల్తుంబ్డే సహా 26 మంది మరణించిన ఘటన తర్వాత, 2025లో కేంద్ర నాయకత్వంపై వరుసగా భారీ దెబ్బలు పడ్డాయి.

అత్యంత కీలకమైన 2025 మే 21న ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మాడ్ ఎన్‌కౌంటర్‌లో సాక్షాత్తు సీపీఐ (మావోయిస్ట్) జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు (బసవరాజు) సహా 26 మంది చనిపోయారు. ఒడిశా సరిహద్దుల్లో జనవరిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి (రామచంద్ర రెడ్డి), ఏప్రిల్‌లో జార్ఖండ్‌లో ప్రయాగ్ మంజి (అనల్ దా) నేలకొరిగారు. జూన్ నెలలో బీజాపూర్‌లో తెంటు లక్ష్మి (సుధాకర్), ఏపీలోని అల్లూరి జిల్లాలో గజర్ల రవి (ఉదయ్) చనిపోయారు.

సెప్టెంబర్ నెల అయితే మరింత ఊచకోతగా మారింది. గరియాబంద్‌లో మోడెం బాలకృష్ణ (మనోజ్), జార్ఖండ్‌లో సహదేవ్ సోరెన్, అబూజ్‌మాడ్‌లో ఒకేరోజు కట్టా రామచంద్ర రెడ్డి (రాజు దాదా), కదరి సత్యనారాయణ రెడ్డి (కోసా దాదా) ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇక నవంబర్ 18న మారేడుమిల్లి దగ్గర అత్యంత పవర్‌ఫుల్ పీఎల్‌జీఏ బెటాలియన్ నం. 1 కమాండర్ మాద్వి హిద్మా, ఆయన భార్య మద్కం రాజే మరణించగా, డిసెంబర్ 25న ఒడిశాలో గణేష్ ఉయికే చనిపోయారు. ఇలా ఒక్క సంవత్సరంలోనే దాదాపు 10 నుంచి 11 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు చనిపోవడం మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద దెబ్బగా మారింది.

వరుస లొంగుబాట్లు..

ఒకవైపు ఎన్‌కౌంటర్లు, మరోవైపు అనారోగ్యం, భద్రతా దళాల తీవ్ర ఒత్తిడితో కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్త, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు (సోను / అభయ్) 2025 అక్టోబర్ 14న గడ్చిరోలిలో 60 మంది కేడర్‌తో లొంగిపోయారు. ఆ తర్వాత బసవరాజు స్థానంలో కీలక బాధ్యతలు తీసుకున్న తిప్పిరి తిరుపతి (దేవుజీ) 2026 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

అలాగే కిషన్‌జీ భార్య పోతుల పద్మావతి (సుజాత), పుల్లూరి ప్రసాద్ రావు (చంద్రన్న), దాదాపు 200 మందితో లొంగిపోయిన తక్కలపల్లి వాసుదేవ రావు (రూపేష్), మల్లా రాజీ రెడ్డి (సంగ్రామ్), హిద్మా తర్వాత కీలక కమాండర్‌గా ఉన్న బర్సా దేవా లాంటి దిగ్గజ లీడర్లు ఆయుధాలు వీడి బయటకు వచ్చేశారు. ఒక్క 2025-2026 నాటికే కేంద్ర కమిటీ మొత్తం కుప్పకూలిపోయింది. దాదాపు 2 వేల మందికి పైగా లొంగిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిసిర్ బేస్రా అరెస్ట్ కాగా, ముప్పాల లక్ష్మణరావు (గణపతి) ఆచూకీ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

గుర్తింపు ఏది.. ఆదుకునే నాథుడెవరు

దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని, తుపాకీ పట్టిన దళాలు ఇప్పుడు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన వందలాది మంది మావోయిస్టుల కుటుంబాలు మాత్రం నేటికీ ఆర్థికంగా, సామాజికంగా అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. పోలీసులు సమాజం కోసం ప్రాణత్యాగం చేశారంటూ గౌరవిస్తున్న ప్రభుత్వం.. అదే సమాజంలోని పీడితుల పక్షాన పోరాడి చనిపోయిన మావోయిస్టుల కుటుంబాలను ఎందుకు కనికరించకూడదన్నది కొందరి సూటి ప్రశ్న. ఉద్యమాలు ముగిసిపోతున్న ఈ రోజుల్లో.. అడవిలో రాలిపోయిన ప్రాణాలను గుర్తించి, వారి కుటుంబాలకు తగిన జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందనే వాదన నెట్టింట తీవ్ర చర్చ రేపుతోంది.

#Maoists#Maoist News#Maoist Martyrs#Maoist Memorial Day#Maoist Martyrs Memorial Day#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి