Elnino: ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్ నినో కారణంగా చాలా దారుణమైన పరిస్థితులు చూడబోతున్నామన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కరువు మనల్ని కబలిస్తోందన్నారు. కరువుపై 6 నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. తెలంగాణలోనే కాదు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులోనూ కరువు ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో కరువు పరిస్థితి ఉందన్నారు.
తాగేందుకు చుక్క నీరు కూడా దొరకదు
తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి రాబోతోందని హెచ్చరించిన సీఎం రేవంత్.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అసవరం ఉందని స్పష్టం చేశారు. సాగునీరు సంగతి దేవుడెరుగు.. తాగునీరే దొరకని పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ కరువును ఎదుర్కోలేమని తేల్చి చెప్పారు. కరోనా ఎంతటి విపత్తో.. ఇప్పుడు ఎల్ నినో కూడా అంతే విపత్తు అని హెచ్చరించారు.
హైదరాబాద్ ప్రజాభవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. ఎల్ నినో ప్రభావం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, సర్ తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా కరువును ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపైనే ఫోకస్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే రోజుల్లో ఎల్ నినో కారణంగా ఎదుర్కోబోయే దారుణ పరిస్థితులను ప్రజలకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్.
జూలై నాటికి తీవ్రరూపం.. ఇంటి నుంచి బయటకు రాలేరు
''కరువు ప్రారంభంలో చిన్నగా అనిపించినా.. జూలై నాటికి తీవ్రరూపం దాల్చుతుందన్నారు. ఇప్పటి నుంచే ప్రజలు అప్రమత్తం కావాలని నీటిని, విద్యుత్ ను అత్యంత పొదుపుగా వాడుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ''100కు పైగా దేశాల్లో ఎల్ నినో ప్రభావం ఉంది. రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రకృతి విపత్తులను మనం నిలువరించలేము. భూకంపం, వరదల సమయంలో తక్షణమే సమస్య వస్తుంది, కొంత కాలానికి తగ్గుతూ పోతుంది. కానీ, ఇక్కడ సమస్య చిన్నగా మొదలై పెద్దగా మారి ఒక భూతంగా జూన్ ఎండాకాలం వచ్చేసరికి ఊహించలేనంత ఎండవేడికి ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి, తాగేందుకు చుక్క నీరు దొరకని పరిస్థితి రాబోతోంది.
ప్రజల భాగస్వామ్యం లేకుండా కరువును ఎదుర్కోవడం అసాధ్యం
దీన్ని ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళిక, అప్రమత్తత అవసరం. ప్రజలను భాగస్వాములను చేయకుండా, ప్రజలను అప్రమత్తం చేయకుండా, ప్రజలకు అవగాహన కల్పించకుండా ఈ కరువును ఎదుర్కోవడం అసాధ్యం. అందుకే ప్రభుత్వం పదే పదే ఆ అంశాన్ని సభలో చర్చకు పెట్టింది. భట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశాము. మహారాష్ట్ర లాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలోనూ నీటి ఎద్దడి ఉంది'' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఒక్క లైటు కూడా వెలగొద్దు.. ఏసీ వాడొద్దు
''ప్రకృతి విపత్తులు మనం వద్దనుకుంటే ఆగేవి కావు. ప్రభుత్వ ఆఫీసుల్లో పొదుపు మంత్రం పాటించాలి. డే టైమ్ ఒక్క లైట్ కూడా వెలగొద్దు. అవసరం లేకుంటే ఏసీని వాడొద్దు. విద్యుత్ వాడకం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సోలార్ ను ప్రోత్సహించాలి. ప్రతి ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవాలి'' అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
8 నెలలు గడ్డుకాలమే..పంటలకు నీళ్లు ఇవ్వడం అసాధ్యం
‘మరో 8 నెలలు ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఎండల తీవ్రతకు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. 3 నెలల క్రితం ఎల్నినో ప్రభావం పెద్దగా లేదు. ఏదోలా వానాకాలం పంటల నుంచి బయటపడ్డాం. ఈ ఏడాది 20వేల మెగావాట్లకు పైగా విద్యుత్ వినియోగం జరిగింది. వచ్చే 4నెలలు సాగుకు చుక్కనీరు కూడా దొరకదు. తాగడానికి నీళ్లు లేవు.. ఇక వ్యవసాయానికి నీళ్లు ఎలా ఇస్తాం? తాగునీటి అవసరాలు తీర్చుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు'.
ఇది క్యాన్సర్ లాంటి నిజం
ఇది క్యాన్సర్ లాంటి నిజం.. ముందే ప్రజలకు చెప్పడం మంచిది. సాగు నీరే లేనప్పుడు వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వడం అసాధ్యం. రిజర్వాయర్లలో 20శాతం కూడా నీటి నిల్వలు లేవు. కృష్ణా జలాల్లో 200 టీఎంసీలు కూడా లేవు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. 8 నుంచి 10 నెలలపాటు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం'' అని సీఎం రేవంత్ హెచ్చరించారు.


