TG: పక్కనున్న కర్ణాటకలో చూస్తే వానలు 30 నుంచి 35 శాతం తక్కువగా పడ్డాయి. ఆంధ్రాలో కూడా 25 నుంచి 33 శాతం లోటు వర్షపాతమే నమోదైంది. కానీ మన తెలంగాణ పరిస్థితి చూస్తే.. ఆ రెండు రాష్ట్రాల కంటే చాలా మెరుగ్గా వానలు కురిశాయి. ఇక్కడ లోటు కేవలం 17 నుంచి 24 శాతమే. అంటే లెక్క ప్రకారం చూసుకున్నా పక్క రాష్ట్రాల్లోనే కరువు విలయతాండవం చేయాలి, అక్కడే రైతులు గగ్గోలు పెట్టాలి. కానీ అక్కడేమో రిజర్వాయర్లు కళకళలాడుతూ జల పండుగలు చేసుకుంటుంటే.. మన దగ్గరేమో నెర్రెలు బారిన భూములు, ఎండిపోయిన పంటలు కనిపిస్తున్నాయి. అసలు పక్క రాష్ట్రాలకు రాని కరువు.. తెలంగాణ నెత్తినే ఎందుకు పడింది.
ఇక్కడే అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇది ఆకాశం ముఖం చాటేస్తే వచ్చిన కరువు కానే కాదని.. చేతులారా చేసుకున్న తప్పిదాల వల్ల మన నెత్తిన పడ్డ కృత్రిమ కరువు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదుల ద్వారా సముద్రం వైపు పోతున్న నీటిని ఒడిసిపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయ్యిందని చెబుతున్నారు. ఏకంగా 1000 టీఎంసీల అమూల్యమైన నీటిని దిగువకు వదిలేసి.. ఇప్పుడు పొలాలకు పారించడానికి గుక్కెడు నీళ్లు లేక రైతులు అల్లాడుతుంటే చూస్తూ కూర్చున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీటిని దాచుకుని, కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపాల్సిన టైమ్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కర్ణాటక, ఏపీల్లో వానలు పెద్దగా పడకపోయినా.. వచ్చిన కొద్దిపాటి వరద నీటిని కూడా అక్కడి ప్రభుత్వాలు చాలా తెలివిగా రిజర్వాయర్లలో ఒడిసిపట్టాయని చెబుతున్నారు. చుక్క నీటిని కూడా వేస్ట్ చేయకుండా దాచుకుని పంటలను బతికించుకుంటున్నాయని అంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం పక్కా ప్లానింగ్ లేక వేలాది క్యూసెక్కుల నీరు కళ్లముందే సముద్రం పాలైపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. చివరకు వేల ఎకరాల్లో పంటలు కళ్లముందే ఎండి మాడిపోతుంటే రైతులు గుండెలు బాదుకుంటున్నారు. తక్కువ వానలు పడ్డ పక్క రాష్ట్రాల్లో లేని కరువు.. ఎక్కువ వానలు పడ్డ తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందంటే.. అది కేవలం నీళ్ల నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యమే తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోందని విశ్లేషకులు, విపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.


