తెలంగాణ

Telangana: ఆర్డినరీ బస్సుకు ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు.. మహాలక్ష్మి పథకంతో మగాళ్ల జేబులకు చిల్లులు!..

రచన: Venu6 నిమిషాల పఠనం

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం అభినందనీయమేనని చాలా మంది పురుష ప్రయాణికులు చెబుతున్నారు. కానీ ఈ పథకం అమలు కారణంగా సాధారణ బస్సుల్లో రద్దీ పెరిగి, దాన్ని తగ్గించడానికి పల్లెవెలుగు బస్సులను ఎక్స్‌ప్రెస్‌గా చూపిస్తూ అదనపు ఛార్జీలు వేస్తున్నారు..

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం ఎంతో మంది మహిళలకు ఉపయోగపడుతోంది. అదే సమయంలో పురుష ప్రయాణికుల నుంచి పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని రూట్లలో పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు అమర్చి, ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి.

కరీంనగర్ నుంచి మంచిర్యాల, చొప్పదండి, ధర్మారం, వెల్గటూర్, రాయపట్నం వైపు వెళ్లే బస్సుల్లో ప్రతిరోజూ భారీ రద్దీ కనిపిస్తోంది. ఈ రూట్లలో నడిచే కొన్ని సాధారణ పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు అమర్చి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు మాత్రం ఆర్డినరీ సేవలాగే ఉంటే... టికెట్ మాత్రం ఎక్స్‌ప్రెస్ రేటుతో ఎందుకు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రయాణికుల సమాచారం ప్రకారం... వెల్గటూర్ వరకు సాధారణ బస్సులో దాదాపు అరవై రూపాయల ఛార్జీ ఉంటే, అదే దూరానికి ఎక్స్‌ప్రెస్ బోర్డు ఉన్న బస్సులో వంద రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటున్నారు. సేవలో మార్పు లేకపోయినా... ఛార్జీల్లో ఇంత తేడా ఎందుకు? అనే ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదని స్థానికులు చెబుతున్నారు.

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం అభినందనీయమేనని చాలా మంది పురుష ప్రయాణికులు చెబుతున్నారు. కానీ ఆ పథకం అమలు కారణంగా సాధారణ బస్సుల్లో రద్దీ పెరిగి, దాన్ని తగ్గించడానికి పల్లెవెలుగు బస్సులను ఎక్స్‌ప్రెస్‌గా చూపిస్తూ అదనపు ఛార్జీలు వేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిలో చివరికి భారమంతా పురుష ప్రయాణికులపైనే పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు అధిక ఛార్జీలు చెల్లించినా సీటు దొరకడం లేదు. చాలామంది నిల్చునే ప్రయాణం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రయాణించే దృశ్యాలు నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి రద్దీ కారణంగా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులు ప్రవేశపెట్టామని ఆర్టీసీ చెబుతోంది. కరీంనగర్ నుంచి రాయపట్నం, ధర్మపురి వైపు కొత్త సర్వీసులు ప్రారంభించగా, నగరంలో మెట్రో ఎక్స్‌ప్రెస్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ గ్రామీణ రూట్లలో రద్దీ మాత్రం తగ్గలేదని వాస్తవ పరిస్థితులు సూచిస్తున్నాయి.

ఇక దూరానికి తగ్గట్టుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారా? లేక ఆదాయం పెంచుకోవడానికి పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు అమర్చి అదనపు వసూళ్లు చేస్తున్నారా? అనే ప్రశ్న పై తెలంగాణ ఆర్టీసీ స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతూనే... పురుష ప్రయాణికులపై అనవసర ఆర్థిక భారం పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రజలు సూచిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు సర్వీసులతో పాటు, బస్సుల సంఖ్యను పెంచడం, పీక్ అవర్స్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం, ఫుట్‌బోర్డు ప్రయాణాలను పూర్తిగా నివారించడం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే.. ఈ ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, అదనపు బస్సులు కేటాయించడం, ఛార్జీల విధానం, ప్రయాణికుల భద్రతపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని లేకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఈ అంశం పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

#Telangana#Karimnagar#Mahalakshmi scheme#Express fares#ordinary buses#Male passengers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి