స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Hyderabad: హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ NOCలు.. తెలంగాణలో ఇంటర్ కాలేజీల కుంభకోణం!..

రచన: Venu7 నిమిషాల పఠనం

నిబంధనల ప్రకారం ఐదు అంతస్తుల లోపు భవనాలకు అవసరమైన ఫైర్ ఎన్‌వోసీలను హైడ్రా జారీ చేస్తుంది. అయితే పలువురు కాలేజీ యాజమాన్యాలు హైడ్రాకు దరఖాస్తు చేయకుండానే నకిలీ ఎన్‌వోసీలను తయారు చేసి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు విచారణలో తేలింది.

తెలంగాణలో ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్‌వోసీ వ్యవహారం రోజురోజుకూ మరింత సంచలనంగా మారుతోంది. విద్యార్థుల భద్రతకు అత్యంత కీలకమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి ప్రభుత్వ వ్యవస్థలను మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుండగా, మరిన్ని కాలేజీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హైడ్రా అధికారులు తాజాగా మరో 48 కాలేజీల వివరాలను పోలీసులకు అందజేశారు. ఇప్పటికే పరిశీలించిన కాలేజీల్లో దాదాపు 56 కళాశాలలు నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించినట్లు గుర్తించారు. మరో 176 కాలేజీల పత్రాలను కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణలో అన్ని నకిలీ సర్టిఫికెట్లు ఒకే తరహాలో తయారైనట్లు గుర్తించడం దర్యాప్తుకు కీలకంగా మారింది.

నిబంధనల ప్రకారం ఐదు అంతస్తుల లోపు భవనాలకు అవసరమైన ఫైర్ ఎన్‌వోసీలను హైడ్రా జారీ చేస్తుంది. అయితే పలువురు కాలేజీ యాజమాన్యాలు హైడ్రాకు దరఖాస్తు చేయకుండానే నకిలీ ఎన్‌వోసీలను తయారు చేసి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు విచారణలో తేలింది. దీనివల్ల భద్రతా ప్రమాణాలు పాటించని భవనాలు కూడా అధికారిక అనుమతులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఫైర్ సర్వీసెస్ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అధికారిక సీల్స్, సంతకాలను ఉపయోగించి ఒరిజినల్ పత్రాల్లా కనిపించేలా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు వెల్లడైంది.

ఈ నకిలీ పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన సమయంలో స్క్రూటినీలో కొన్ని సాంకేతిక లోపాలు కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. వెంటనే హైడ్రా అధికారులతో ధృవీకరించగా అవన్నీ ఫోర్జరీ చేసిన పత్రాలేనని నిర్ధారణ అయింది. దీంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో ఇప్పటికే పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఫోర్జరీ, మోసం, ప్రభుత్వ ముద్రల దుర్వినియోగం వంటి సెక్షన్ల కింద విచారణ కొనసాగుతోంది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీల అనుమతులను రద్దు చేయాలని హైడ్రా అధికారులు విద్యాశాఖకు సిఫారసు చేసినట్లు సమాచారం.

ఈ అక్రమాలు కేవలం కొద్ది కాలేజీలకే పరిమితం కాలేదని అధికారులు భావిస్తున్నారు. నకిలీ ఫైర్ ఎన్‌వోసీల తయారీ వెనుక ఒక ముఠా లేదా మధ్యవర్తుల నెట్‌వర్క్ పనిచేసి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కో కాలేజీ నుంచి ఈ నకిలీ అనుమతుల కోసం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కూడా సమాచారం బయటకు వస్తోంది.

ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కాలేజీల్లో బాబుల్ రెడ్డి జూనియర్ కాలేజ్, న్యూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, అలీ శాంతినికేతన్, శ్రీ అక్షర, అచీవర్, హిదాయా, జునైద్, ఫిడ్జీ, శ్రీ వాణి, శ్రీనివాస, లైఫ్ లైన్, విశ్వభారతి, వికాస్, శ్రీ తపస్య, జ్ఞాన దీపిక, భార్గవ, విజ్ఞాన భారతి, శ్రీ అభ్యాస, శ్రీ నారాయణ కామర్స్, కెరీర్ పాయింట్ తదితర అనేక కాలేజీల పేర్లు విచారణలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

ఈ కేసులో ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదారు సంవత్సరాలుగా ఈ దందా కొనసాగుతున్నప్పటికీ ఇంతవరకు ఎందుకు బయటపడలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొందరు అధికారులకు భారీ మొత్తంలో లంచాలు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి స్థాయి వ్యక్తి మధ్యవర్తులతో కుమ్మక్కై నకిలీ ఎన్‌వోసీలను చెలామణి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

గతంలో తనిఖీలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే అనుబంధ గుర్తింపులు లభించాయా అనే కోణంలో సైతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం విద్యార్థుల భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశం కావడంతో ప్రభుత్వం కూడా దీనిని సీరియస్‌గా తీసుకుంది. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా వేలాది మంది విద్యార్థులు చదువుతున్న భవనాలకు అనుమతులు లభించడం ఆందోళన కలిగిస్తోంది.

అందుకే ఈ కేసులో బాధ్యులెవ్వరైనా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరో 176 కాలేజీల పత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత ఈ కుంభకోణంలో ఇంకా ఎంతమంది ఉన్నారనే సమాచారం పై క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కేసులో కాలేజీ యాజమాన్యాలతో పాటు మధ్యవర్తులు, సంబంధిత అధికారులు కూడా విచారణ పరిధిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ నకిలీ ఫైర్ ఎన్‌వోసీ కుంభకోణంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..

#Telangana#Hyderabad#HYDRAA#Fake fire NOCs#Intermediate colleges#scam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి