స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Ranga Reddy District: నారాయణ.. నారాయణ..ఏమిటీ ‘సర్వే’త‘ర్యామి’ లీలలు?

రచన: Venu10 నిమిషాల పఠనం

కొందరు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల అండదండలతోనే కొన్ని నిర్ణయాలు అమలవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ కమిషనర్ కూడా ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే శాఖలో బదిలీల బాగోతం?

కోట్లాది అక్రమాలకు వేదికగా మారిందా?

- వందల కోట్లకు పైగా సంపాదించిన ఏడీ శ్రీనివాసులు, డీడీ నరహరి

- కాస్ట్లీ జిల్లాలో డీఐ కూడా ఏడీగా వ్యవహారం

- అత్యంత విలువైన మండలాల్లో కనిపించని సర్వేయర్స్

- కొరత సృష్టించి వాళ్లు అనుకున్న వాటికి మాత్రమే సర్వే

- కలెక్టర్ వెంటే వికారాబాద్ టు రంగారెడ్డి

- ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ పెండింగ్‌లోనే అధిక ఫైల్స్?

- భువనగిరి డివిజన్‌లో జీతం.. ఉమ్మడి రంగారెడ్డిపై కమాండ్?

- ఇన్‌ఛార్జీగా బాధ్యతలు, బదిలీల్లో కొనసాగిన బాగోతాలపై స్వేచ్ఛ న్యూస్ డిటెయిల్డ్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్

9848070809

కాస్ట్లీ ఏరియాలో సర్వేయర్స్‌కు నో ఛాన్స్!

మార్కెట్‌లో రంగారెడ్డి జిల్లా సర్వేయర్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే ఏసీబీ అధికారులు కొత్తగా ఈ శాఖపై దృష్టి పెట్టడంతో, ఏడీ శ్రీనివాసులు, మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి చెరో 100 కోట్లకు తక్కువ కాకుండా అక్రమంగా సంపాదించారని తేలింది. కోట్లాది రూపాయల క్యాష్ బెడ్స్ కింద దాచిపెట్టారంటేనే అర్థం చేసుకోండి. వందల కోట్ల ఈ అక్రమ సంపాదన వెనకాల జరిగే తతంగం చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి.

అలాంటి ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్‌లో బదీలీల లీలలు కూడా చాలా ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఏ స్థాయిలో మాయ జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నాం. రెవెన్యూ అధికారుల వద్ద ఉండాల్సిన అధికారుల బదిలీలపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూములను కొలిచి, పంచనామ ఇవ్వాల్సింది వీరే. సర్వే నెంబర్స్ తప్పుగా ఉన్నా, పొజిషన్‌లోకి చొచ్చుకొచ్చినా, ఓవర్ ల్యాపింగ్ భూములను రక్షించాలన్నా వీరే కీలక పాత్ర వహిస్తారు. అయితే ఎకరం రూ.200 కోట్లు పలికే ఏరియాల్లో కలెక్టర్ వద్ద పలుకుబడి ఉన్న అధికారులదే ఇష్టారాజ్యంగా నడుస్తోందని విమర్శలు ఉన్నాయి.

బదిలీలు, పోస్టింగ్స్‌లో ఎన్నో లీలలు?

గండిపేట్, శేరిలింగంపల్లి , షాబాద్ మండలాలకు కలిపి ఒకే ఒక్క సర్వేయర్ జగదీష్ ఉన్నారు. ఈమధ్య షాబాద్ ఏరియాలో ఇండస్ట్రియల్ పార్కులు, రేడియల్ రోడ్ భూసేకరణలో వేల కోట్ల వ్యాపారం జరుగుతుండడంతో జగదీష్‌ను షాబాద్ మండలానికి పంపించారు.

పది సంవత్సరాలు సర్వేయర్‌గా ఉంటూ వందల కోట్లు సంపాదించారని ఆరోపణలు ఉన్న ఓ సర్వేయర్‌ను వికారాబాద్ జిల్లా నుండి నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన గతంలో పని చేసిన ఇబ్రహీంపట్నంకు డిప్యూటేషన్ వేయించుకోవడం వెనుక డీఐ హస్తముందని తెలుస్తోంది.

గండిపేట్ మండలంలో సర్వేయర్‌గా చేరిన రెండు నెలల లోపే సతీష్ అనే సర్వేయర్‌ను సస్పెండ్ చేశారు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలిసింది. ముఖ్యంగా తాము సర్వే చేసిన కాగితాలపై సంతకాలు చేయమని ఒత్తిడి తేవడం సతీష్ దానికి నిరాకరించడంతోనే ఆయన మీద వేటు పడినట్టు తెలుస్తోంది.

కందుకూరులో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయినాథ్ అనే సర్వేయర్‌ను బలవంతంగా శేరిలింగంపల్లికి డిప్యూటేషన్‌పై పంపారు. ఆయన ఆ అధికారి చెప్పిన పనులకు నో చెప్పడంతో వెంటనే మళ్లీ కందుకూర్ తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కేశంపేటలో సర్వేయర్‌గా చేస్తున్న సాయిబాబాను ల్యాండ్ సర్వే కమిషనర్‌కు సరెండర్ చేయడం వెనుక కూడా ఏదో పెద్ద తతంగమే జరిగినట్టు తెలుస్తోంది. గతంలో శంకర్ పల్లిలో సర్వేయర్‌గా చేసిన సాయిబాబాను ఇలాంటి కేసులోనే మాట వినకపోవడంతో దూరంగా బదిలీ చేసినట్టు సమాచారం. చివరకు ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా అతను పెట్టుకున్న సెలవులు కూడా అంగీకరించకుండా మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి కలెక్టరేట్‌లో జరుగుతున్న అక్రమాలను బయటపెడతాడనే నేపథ్యంలో ఏడీ సర్వే కార్యాలయంలో సూపరిండెంట్‌గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కమిషనర్ ఆఫీసుకు సరెండర్ చేసినట్టు సమాచారం.

ఈ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఒరిజినల్ పోస్టింగ్ భువనగిరి అయితే అదే పాత నల్గొండ జిల్లాకు చెందిన సూర్యాపేట నుండి ఇద్దరు సర్వేయర్లను రాష్ట్రంలోనే ఖరీదైన మండలాలుగా చెప్పబడుతున్న శంషాబాద్, అబ్దుల్లాపూర్ మెట్‌కు నియమించినట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో అనుభవమున్న సర్వేయర్లను రూరల్ ప్రాంతాలకు బదిలీ చేసి తమకు కావలసిన ఇతర జిల్లాల సర్వేలను తీసుకొని వచ్చి ఖరీదైన మండలాల్లో నియమించుకోవడం వెనుక ఓ వ్యక్తికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నదని తెలుస్తోంది.

యూఎల్‌సీలో పని చేయాల్సిన మాజిద్ అనే ఉద్యోగిని తమకు అనుకూలంగా పని చేస్తున్నారని ఏడీ ఆఫీసుకు తీసుకొని వచ్చి చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ అధికారి బాగోతాలకు భాగస్వామిగా ఉన్న ఓ సర్వేయర్‌ను హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ చేయించి ఆ తర్వాత ప్రణాళికలో భాగంగా రంగారెడ్డి జిల్లాకు డిప్యూటేషన్ వేయించుకున్నట్టు తెలిసింది.

మండల సర్వేలో ఎలాంటి న్యాయం జరగని వాళ్లు ఏడీ సర్వేకు అప్లై చేస్తారు. అయితే ఏడీ కార్యాలయంలో సర్వేలను పూర్తిస్థాయిలో నియమించుకోకుండా కలెక్టరేట్లో ఉండాల్సిన వెంకటేష్ అనే సర్వేయర్ ను గ్రామీణ ప్రాంతానికి డిప్యూటేషన్ వేసినట్టు సమాచారం. జిల్లాలో ఏడీ సర్వేకు అప్లై చేసుకున్న బాధితులకు సర్వే చేయడానికి ఏడీ కార్యాలయంలో ఒక సర్వేయర్ కూడా లేకపోవడం గమనారం.

దేశంలోనే ఖరీదైన జిల్లాగా కోట్లాది రూపాయల ధర పలికే రంగారెడ్డిలో పూర్తిస్థాయి ఏడీ సర్వేయర్‌ను నియమించకుండా భువనగిరిలో జీతం తీసుకుంటూ వికారాబాద్‌లో అక్రమాలకు సహకరించిన వారు ఇప్పుడు అదే ఉన్నతాధికారి అవసరాలకు మళ్లీ వికారాబాద్ నుండి రంగారెడ్డి జిల్లాకు తీసుకురావడం చూస్తుంటే దీని వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తే మరో అవినీతి తిమింగళం పట్టుపడుతుందని అంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం కాపాడుకునే నెపంతో ఇన్స్పెక్టర్ సర్వేయర్‌తో చేస్తున్న అరాచకాలను సర్వేయర్లు భరిస్తున్నారని కలెక్టర్ కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఆయన ఏ స్థాయిలో అరాచకం చేస్తున్నాడో తెలుస్తోంది. మహిళా ఉద్యోగులతో పాటు కిందిస్థాయిని ఉద్యోగులను మానసికంగా వేదిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటి పైనా నిఘా వర్గాలు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది.

మరోవైపు కొందరు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల అండదండలతోనే కొన్ని నిర్ణయాలు అమలవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ కమిషనర్ కూడా ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. కానీ భవిష్యత్తులో సమగ్ర విచారణ జరిగితే రంగారెడ్డి జిల్లా సర్వే శాఖలో భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని శాఖకు చెందిన కొందరు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ వ్యవహారం మరో వివాదంగా మారే అవకాశముందనే చర్చ కూడా జరుగుతోంది.

#Telangana#Ranga Reddy district#Land#Survey Department#scandal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి