TG : తెలంగాణ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రవేశించే సమయంలో పోలీసులతో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించింది. సభకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు సరికాదని ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను తాజాగా మీడియాకు రిలీజ్ చేసింది.
అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజీని ప్రభుత్వం బయటపెట్టడంతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. భద్రతా విధుల్లో ఉన్న సిబ్బందితో బీఆర్‌ఎస్ నేతలు గొడవకు దిగినట్లు పేర్కొంటూ ప్రభుత్వం ఈ ఫుటేజీని మీడియా ముందుకు తీసుకొచ్చింది.
మరోవైపు ఇదే అంశానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శాసనసభలో బయట పెట్టారు. ఇందుకోసం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నుంచి ఆయన అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. సభా ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలపై సభ్యులకు వివరాలు తెలియజేసే క్రమంలో ఈ చిత్రాలను చూపించినట్లు తెలిపారు. అసెంబ్లీకి ప్రజాప్రతినిధులు హాజరయ్యే సమయంలో భద్రతా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని అధికార పక్షం పేర్కొంటోంది. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా వీడియోలు, ఫొటోలు విడుదల కావడం రాజకీయ వేడిని మరింత పెంచింది.











