క్రైమ్

Karimnagar: ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువతిని నమ్మించి ఆమె నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. ఆమె బంధువులకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు రూ.8.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులే టార్గెట్‌గా.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో బోటనీ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుంటూ.. డేటా ఎంట్రీ ఆపరేటర్, టికెట్ బుకింగ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించినట్లు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా దుడపాక తిరుపతి.. ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువతిని నమ్మించి ఆమె నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. ఆమె బంధువులకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు రూ.8.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా నిందితుడు పక్కా ప్రణాళికతో మరింత మందిని తన వలలోకి లాగినట్లు దర్యాప్తులో తేలింది...

ఇలా ఇప్పటివరకు సుమారు 21 మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.44 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.. మరోవైపు అభ్యర్థులకు తనపై మరింత నమ్మకం కలిగించేందుకు నిందితుడు నకిలీ పరీక్షలతో పాటు ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను కూడా సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రశ్నాపత్రాలు, OMR షీట్లు, సర్వీస్ రిజిస్టర్లు, నియామక ఉత్తర్వులు వంటి నకిలీ పత్రాలను తయారు చేసి.. ఉద్యోగ ప్రక్రియ జరుగుతోందన్న భ్రమ కల్పించినట్లు తెలిపారు.

శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దుడపాక తిరుపతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నకిలీ నియామక పత్రాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇతను చేస్తున్న మోసం వెనుక మరో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.. ప్రస్తుతం ఈ కేటుగాళ్లు పరారీలో ఉండటంతో.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, నియామక పత్రాలను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారిక వర్గాల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు. మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించకుండా.. అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు.

#Karimnagar#police#arrest#professor#scams#fraud#jobs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి