Spirituality

Spirituality: వినాయక చవితి వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

రచన: Venu4 నిమిషాల పఠనం

చంచలమైన మనస్సుకు, అదుపులేని కోరికలకు ప్రతీకగా భావించే మూషికంపై గణపతి అధిష్ఠించడం.. మన కోరికలపై మనస్సుకు ఆధిపత్యం ఉండాలి అనే భావాన్ని తెలియజేస్తుంది.

వినాయక చవితి అంటే కేవలం గణపయ్యను ఇంటికి తీసుకొచ్చి పూజించే పండుగ మాత్రమే కాదు.. మనిషి జీవితానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందించే పవిత్రమైన రోజని మన వేదాలు చెబుతాయి.. పురాణాల్లో గణపతిని విఘ్నేశ్వరుడిగా, జ్ఞానానికి అధిపతిగా, బుద్ధికి ప్రతీకగా వర్ణించారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించే సంప్రదాయం వెనుక కూడా ఇదే అంతరార్థం ఉంది. ఇక గణపతి రూపంలోనే ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయని పేర్కొంటారు..

ఆయన పెద్ద చెవులు.. మంచి మాటలను శ్రద్ధగా వినాలని చెబుతాయి. చిన్న కళ్ళు.. లక్ష్యంపై ఏకాగ్రతతో దృష్టి పెట్టాలని సూచిస్తాయి. ఏనుగు తొండం.. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ, అవసరమైనప్పుడు బలాన్ని.. సున్నితత్వాన్ని ప్రదర్శించే వివేకాన్ని గుర్తుచేస్తుంది. అలాగే ఏకదంతుడైన గణపతి.. జీవితంలోని ద్వంద్వాలను దాటి సత్యాన్ని గ్రహించమనే సందేశాన్ని ఇస్తాడు. ఆయన పెద్ద ఉదరం.. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను సహనంతో జీర్ణించుకోవాలని సూచిస్తుంది.

ఇక గణపతి వాహనమైన మూషికం కూడా ఒక గొప్ప తాత్త్విక సందేశమే. చంచలమైన మనస్సుకు, అదుపులేని కోరికలకు ప్రతీకగా భావించే మూషికంపై గణపతి అధిష్ఠించడం.. మన కోరికలపై మనస్సుకు ఆధిపత్యం ఉండాలి అనే భావాన్ని తెలియజేస్తుంది. వీటితో పాటు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి.. పూజించి.. చివరికి నిమజ్జనం చేయడం వెనుక మరింత లోతైన సందేశం ఉంది.

మట్టితో ఏర్పడిన రూపం.. పూజతో పవిత్రమై.. చివరికి అదే ప్రకృతిలో కలిసిపోతుంది. ఇది మనిషి శరీరం కూడా ప్రకృతి నుంచే వచ్చి.. చివరకు ప్రకృతిలోనే లీనమవుతుందనే సత్యాన్ని గుర్తుచేస్తుంది.. ఇక బయట గణపతిని ప్రతిష్ఠించడం మాత్రమే కాదు.. మన హృదయంలో జ్ఞానాన్ని ప్రతిష్ఠించాలి. అహంకారాన్ని తొలగించాలి. మనస్సును అదుపులో పెట్టాలి. ధర్మమార్గంలో నడవాలి. అప్పుడు మన జీవితంలోని విఘ్నాలను తొలగించే గణపతి అనుగ్రహం.. మనలోనే ఒక శక్తిగా మేల్కొంటుందని పురాణాలు చెబుతాయి..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#spiritual#Ganesha Festival#secret#Vinayaka Chavithi#pooja
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి