తెలంగాణ

TG : సింపతీ కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాకులాట.. మరి ప్రజా సమస్యలు..?

రచన: Mahesh7 నిమిషాల పఠనం

TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతోంది. కానీ ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదికగా భావించే అసెంబ్లీలో జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే మాత్రం అసలు అజెండా ఎప్పుడో పక్కకు వెళ్లిపోయిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతోంది. కానీ ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదికగా భావించే అసెంబ్లీలో జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే మాత్రం అసలు అజెండా ఎప్పుడో పక్కకు వెళ్లిపోయిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈసారి అసెంబ్లీ సమావేశాలు మొత్తం ఆరు రోజులే. అందులో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తయ్యాయి. అంటే మిగిలింది కేవలం రెండు రోజులు మాత్రమే. కానీ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే.. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై ఎంత సమయం చర్చకి కేటాయించారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

మూడు రోజులు.. చర్చ కంటే రాజకీయ రచ్చే ఎక్కువ

సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా ఆరోపణలు, ప్రత్యారోపణలే కనిపించాయి. సభా కార్యక్రమాలు సజావుగా సాగడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

అసెంబ్లీలో మూడు రోజుల పాటు పెద్దగా చర్చ జరగకుండా, రాజకీయ వివాదాలకే పరిమితం అయ్యిందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నాలుగో రోజు కూడా 22ఏ అంశంపై కొంత సేపు చర్చ జరిగింది. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పోలిస్తే ఈ ఒక్క అంశంపై జరిగిన ఆ కొద్ది పాటి చర్చ ఎంత వరకు ఉపయోగపడిందన్న ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి మేధావి వర్గం వరకు వినిపిస్తున్నాయి.

ఢిల్లీకి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు.. ఇదంతా ఎందుకు?

అసెంబ్లీ ప్రాంగణంలో తమపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం ఇప్పుడు మరో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. అయితే ఈ వ్యవహారాన్నివాళ్లు సానుభూతి కోసం ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

బీఆర్ఎస్ సానుభూతి రాజకీయాలకు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. స్పీకర్‌ను ఆయన సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అవమానించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతంలో ఫామ్‌హౌస్ వద్ద జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తూ.. దళితులను అవమానించేలా గులాబీ పార్టీ నాయకులు వ్యవహరించారని అధికార పార్టీ విమర్శలు చేస్తోంది.

దీంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో ఇరు పక్షాలు తమ రాజకీయ ఇమేజ్‌ను బిల్డ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయా? అనే చర్చ మొదలైంది.

ఇక కేటీఆర్, హరీశ్‌రావుపై మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేసిన అంశం కూడా రాజకీయంగా హీట్ పెంచుతోంది. దీంతో అసెంబ్లీ చర్చల కంటే బయట జరుగుతున్న కేసులు, ఆరోపణలు, ఫిర్యాదులే ఎక్కువగా హైలైట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

గవర్నర్ దగ్గర రెండు పార్టీల పంచాయతీ..

ఒకవైపు కేటీఆర్, హరీశ్‌రావు వ్యవహారం.. మరోవైపు కేసీఆర్‌ను చంపేందుకు ప్రయత్నించారంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు.. ఇంకోవైపు తమపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఫిర్యాదులు.. ఇలా రెండు ప్రధాన పార్టీలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదులు చేశాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు అసెంబ్లీ నుంచి గవర్నర్ కార్యాలయానికి టర్న్ అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, రైతుల సమస్యలు, విద్య, వైద్యం, ధరలు, నిరుద్యోగం వంటి అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.

ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు ప్రజల తరఫున బలమైన గొంతుకను వినిపించాల్సిన అవసరం కూడా ఉంది.

కానీ ఆరు రోజుల సమావేశాల్లో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తయ్యాయి. ఈ నాలుగు రోజుల్లో రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, పోలీసుల వ్యవహారం, కేసులు, గవర్నర్‌కు ఫిర్యాదులు వంటి అంశాలే ఎక్కువగా తెరపైకి వచ్చాయి.

అసెంబ్లీ ఎవరి కోసం?

ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి నేరుగా అసెంబ్లీకి వెళ్లలేరు. తమ తరఫున మాట్లాడేందుకు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు అత్యంత కీలకం.

కానీ ఈ వేదికపై అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య రాజకీయ రగడే ప్రధాన అంశంగా మారితే.. ప్రజా సమస్యలకు దక్కాల్సిన సమయం తగ్గిపోతుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి వాతావరణమే కనిపిస్తుందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. మిగిలిన రెండు రోజులైనా అధికార, ప్రతిపక్షాలు రాజకీయ రచ్చను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై ఎంత సీరియస్‌గా చర్చిస్తాయో చూడాలి.

#Telangana Politics#Telangana Assembly#BRS#Congress#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి