TG : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇవ్వడం సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో లేదని.. హైకమాండ్ నిర్ణయమే కీలకమని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ వైఖరిపై జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. మంత్రి పదవి కోసం తాను సీఎం రేవంత్‌రెడ్డితో రాజీపడ్డానని కొందరు ప్రచారం చేస్తున్నారని, అయితే తనకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే హైకమాండ్ మాట ఇచ్చిందని పేర్కొన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
సీఎంను కలిస్తే కాంప్రమైజ్ అంటారా?
నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడంలో తప్పేముందని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. నిధులు, అభివృద్ధి పనుల కోసం సీఎం, డిప్యూటీ సీఎంను కలవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. సీఎంను కలిస్తే రాజీపడ్డానని.. కలవకపోతే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో మంచి జరిగితే మంచి అని, తప్పు జరిగితే తప్పు అని చెప్పడం తన నైజమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం నార్మల్ అని అన్నారు.
ఇదే సమయంలో కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి తన అభిప్రాయం చెప్పడంలో తప్పేమీ లేదని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షలు చిన్న మొత్తం కాదని స్పష్టం చేశారు.







