క్రైమ్

రూ.25కోట్ల ఆస్తి కోసమే జగదీశ్వరరెడ్డి హత్య.. విచారణలో నోరు విప్పిన సాధిక్‌ఖాన్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఏపీలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.

ఏపీలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. సర్పవరం పోలీసులు జరిపిన మూడు రోజుల కస్టడీ విచారణలో భాగంగా పక్కా సాంకేతిక ఆధారాలను ముందంచడంతో, నూకరాజు అల్లుడైన జగదీశ్వరరెడ్డిని తానే పథకం ప్రకారం విషం ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు స్పష్టం చేశాడు.

ఈ దారుణానికి గల ప్రధాన కారణం ఆస్తి కాంక్షేనని పోలీసుల విచారణలో బయటపడింది. నూకరాజు కుటుంబానికి ఉన్న సుమారు రూ. 25 కోట్ల విలువైన స్థిరాస్తులపై కన్నేసిన సాధిక్‌ఖాన్, ఆయన కుమార్తె సౌజన్యను పెళ్లి చేసుకుంటే ఆ సంపదంతా తనకు దక్కుతుందని భావించాడు. ఈ క్రమంలోనే తనకు అడ్డుగా ఉన్న జగదీశ్వరరెడ్డిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రైఫిల్ షూటింగ్ క్రీడ అవసరాల పేరుతో హైదరాబాద్‌లోని కొందరు వ్యాపారుల నుంచి థాలియం, పొటాషియం వంటి ప్రమాదకర రసాయనాలను కొనుగోలు చేసి, కొబ్బరినీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

సర్పవరం పోలీసులు కస్టడీ సమయంలో నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు. గుడారిగుంట ప్రాంతంలోని ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీతో పాటు నూకరాజు నివాసంలో సోదాలు జరిపి కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. విచారణలో తప్పించుకునేందుకు సాధిక్‌ఖాన్ కొన్ని నేరాలను సౌజన్యపై నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, సాంకేతిక ఆధారాల ద్వారా అతడి కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు.

హత్యకు ఉపయోగించిన విషపదార్థాల నమూనాలు, కొనుగోలు రసీదులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కస్టడీ ముగియడంతో సాధిక్‌ఖాన్‌ను కాకినాడ కోర్టులో హాజరుపరచనున్నారు. గతంలో నూకరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం, అంతకుముందే అల్లుడు జగదీశ్వరరెడ్డి మరణించడం ఈ కేసు తీవ్రతకు కారణమైంది.

#SadhikKhan#NookarajuCase#Kakinada#APNews#CrimeNews#SarpevaramPolice#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి