ఏపీ

AP: పట్టాలు తప్పిన గూడ్స్.. 8 బోగీలు పడిపోయి నిలిచిన రైళ్ల రాకపోకలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం ఉదయం ఒక రైలు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం-విజయవాడ ప్రధాన రైల్వే మార్గంలో ఉన్న కొవ్వూరు, పశివేదల మధ్య నడుస్తున్న ఒక గూడ్స్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం ఉదయం ఒక రైలు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం-విజయవాడ ప్రధాన రైల్వే మార్గంలో ఉన్న కొవ్వూరు, పశివేదల మధ్య నడుస్తున్న ఒక గూడ్స్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రసాయనిక ఎరువుల (ఫెర్టిలైజర్స్) లోడుతో ఒడిశా నుంచి మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తున్న ఈ సరుకు రవాణా రైలుకు చెందిన 8 బోగీలు ఒక్కసారిగా ట్రాక్ తప్పి పక్కకు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

 ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అయితే తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే ఈ అత్యంత కీలకమైన విశాఖపట్నం-విజయవాడ మార్గంలో మార్గమధ్యంలోనే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది.

 ఈ ప్రమాదం కారణంగా సామర్లకోట రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం నుంచి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు హౌరా నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. దీనికి తోడు వరుసగా రెండో శనివారం, ఆదివారం, ఆపై సోమవారం వినాయక చవితి పండుగ సెలవులు రావడంతో సొంత ఊళ్లకు బయలుదేరిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన తరుణంలో ఈ ప్రమాదం జరగడంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంది.

 సహాయక చర్యలు పూర్తయి ట్రాక్ పునరుద్ధరణ జరిగే వరకు పలు రైళ్లను పక్కదారి పటించడం లేదా ఆలస్యంగా నడిపించడం జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. పండుగ పూట రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధ్యమైనంత త్వరగా రైలు మార్గాన్ని సురక్షితంగా పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ హామీ ఇచ్చింది.

 

#Kovvur#GoodsTrainDerail#EastGodavari#VisakhapatnamVijayawadaTrack#APNews#IndianRailways#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి