తెలంగాణ

22A జాబితాలో అత్యధిక భూములు చేర్చింది బీఆర్‌ఎస్సే.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణలో వివాదాస్పదంగా మారిన 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22A పరిధిలోకి అత్యధికంగా భూములను చేర్చి సాధారణ రైతులు, భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు.

 తెలంగాణలో వివాదాస్పదంగా మారిన 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22A పరిధిలోకి అత్యధికంగా భూములను చేర్చి సాధారణ రైతులు, భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నాయకులు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

 తమ పాలనలో జరిగిన భూ భాగోతాలు, అక్రమ కేటాయింపులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే కేటీఆర్ తొందరపడుతున్నారని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ నాయకులు వేలాది ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను నిషేధిత జాబితాలో చేర్చి, ఆపై తమ అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ప్రతి ఒక్క భూ వ్యవహారాన్ని ఆధారాలతో సహా త్వరలోనే ప్రజాక్షేత్రంలో బయటపెడతామని, కేటీఆర్ అంత తొందరపడాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.

 ప్రస్తుతం 22A జాబితాలో ఉన్న భూములను పరిశీలిస్తే అందులో అత్యధికంగా అటవీ భూములు, ప్రభుత్వ యజమాన్యంలో ఉన్న భూములే ఉన్నాయని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. కేవలం వివిధ న్యాయస్థానాల్లో వివాదాలు, కేసులు నడుస్తున్న ప్రైవేటు భూములను మాత్రమే చట్ట నిబంధనల ప్రకారం 22A జాబితాలోకి చేర్చడం జరిగిందని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద రైతులకు, బాధితులకు న్యాయం చేసే దిశగా 22A జాబితాను సమగ్రంగా సమీక్షిస్తోందని పేర్కొన్నారు.

 మరోవైపు, ఇటీవల అసెంబ్లీ ప్రాంగణం వద్ద చోటుచేసుకున్న నిరసన ఘర్షణ, మహిళ పట్ల జరిగిన అవాంఛనీయ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, బాధ్యులపై నిష్పాక్షికంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

 

#AadiSrinivas#KTR#HarishRao#TelanganaPolitics#22ALands#BRSvsCongress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి