తెలంగాణ

అసెంబ్లీలో స్పీకర్ కంటతడి..  సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభ కొనసాగుతుండగానే ఛైర్‌లో ఉన్న స్పీకర్ కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ వెలుపల స్పీకర్‌ను ఉద్దేశించి తీవ్ర అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సభలో తీవ్ర దుమారం రేగింది.

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభ కొనసాగుతుండగానే ఛైర్‌లో ఉన్న స్పీకర్ కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ వెలుపల స్పీకర్‌ను ఉద్దేశించి తీవ్ర అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సభలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నేతలు సభలో చర్చలు జరుపుతున్న తరుణంలోనే స్పీకర్ కన్నీళ్లు పెట్టుకోవడంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, స్పీకర్ స్థానాన్ని, ఆయనను ఉద్దేశించి అనుచిత భాషను ఉపయోగించడం చట్టసభల గౌరవ ప్రతిష్టలను దిగజార్చడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతికి జరిగిన ఈ అవమానం కేవలం ఒక వ్యక్తికి జరిగింది కాదని, మొత్తం సభ్య సమాజానికి జరిగిన అవమానమన్నారు. చట్టసభల మనుగడకే ప్రమాదకరంగా మారిన ఇలాంటి భాషను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసిన సీఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని సభ వేదికగా డిమాండ్ చేశారు.

ఈ చర్చలో పాల్గొన్న పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా తీవ్ర భావోద్వేగానికి గురై ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ తల్లిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు అత్యంత దారుణంగా మాట్లాడటం అమానుషమని మండిపడ్డారు. దళిత, బీసీ, అణగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉండటాన్ని కొందరు ఆధిపత్య నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. తాతా మధును వెంటనే శాసనమండలి నుంచి సస్పెండ్ చేసి సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.

సభలో ఇతర పార్టీల నేతలు కూడా స్పీకర్‌కు మద్దతుగా నిలిచారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సభాపతి వ్యవస్థను దిగజార్చేలా మాట్లాడిన సదరు సభ్యుడిపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం నుంచి నిరసనలతో హోరెత్తిన అసెంబ్లీ, స్పీకర్ కంటతడి పెట్టడం, ఎమ్మెల్సీ సభ్యత్వ రద్దు డిమాండ్ల మధ్య రాజకీయ వేడిని రగిల్చింది.

#TGAssembly#SpeakerGaddamPrasad#RevanthReddy#Seethakka#TelanganaPolitics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి