కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అబుధాబి బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ అయిన 50 నిమిషాలకే మొదటి ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్ ప్రమాదకర స్థాయికి పడిపోవడాన్ని పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఆ ఇంజిన్‌ను నిలిపివేసి, ఒకే ఇంజిన్‌పై విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి కొచ్చిలోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఇక 45 నిమిషాల పాటు ఒకఇంజిన్‌పైనే ప్రయాణించి ప్రయాణికులను సురక్షితంగా దించిన పైలట్ల సమయస్ఫూర్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై విమానయాన సంస్థ అంతర్గత విచారణకు ఆదేశించగా, డీజీసీఏ (DGCA) కూడా అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు, భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలోని అమృత్‌సర్ విమానాశ్రయం వద్ద డ్రోన్ల సంచారం కలకలం రేపింది.
ఎయిర్‌పోర్టు ప్రహరీ గోడ వెలుపల అనుమానాస్పద డ్రోన్లు ఎగురుతున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గుర్తించడంతో అధికారులు వెంటనే స్పందించారు. ముందుజాగ్రత్త చర్యగా ఏడు విమానాలను వేరే మార్గాలకు దారిమళ్లించి, కొన్ని గంటల పాటు విమానాశ్రయ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు.
సాంకేతిక లోపాలు, భద్రతా ముప్పులు ఎలాంటివైనా విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ప్రతి క్షణం ఎంతో కీలకం.. అందుకే ప్రయాణికుల భద్రత విషయంలో అధికారులు, విమానయాన సంస్థలు ఎలాంటి చిన్నపాటి నిర్లక్ష్యానికీ తావివ్వకుండా.. ప్రతి అంశాన్ని అత్యంత అప్రమత్తంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి..












