South Cinema: తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ స్టార్ హీరోల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తారని అనుకోవడం పొరపాటే. కంటెంట్ ఆసక్తికరంగా ఉంటే, కొత్తదనం కనిపిస్తే చిన్న సినిమాలపైనా, తమిళ, మయాళ, కన్నడ డబ్బింగ్ సినిమాలపైనా ప్రేక్షకులు ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ‘సీన్’, ‘మహాశక్తి’ సినిమాల విషయంలోనూ ఇదే తరహా చర్చ కనిపిస్తోంది.
స్టార్ హీరో ఉన్నా.. తెలుగులో ఆశించిన హడావుడి లేదా?
నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సూర్య ‘సీన్’ సినిమాపై తమిళంలో మంచి అంచనాలు ఉన్నాయి. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించడం, సూర్య హీరోగా నటించడం, నజ్రియా, నస్లేన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అయితే తమిళంలో కనిపిస్తున్న క్రేజ్‌తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అంతగా ఊపందుకోలేదు. ఈ ఏడాది సూర్య నటించిన రెండు సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ దక్కింది. కానీ, అది లేటెస్ట్ సినిమా ‘సీన్’ విషయంలో కనిపించడం లేదు. దీనికి, కారణం ఈ సినిమాను ఇక్కడ అస్లౌ ప్రమోట్ చేయకపోవడమే.
"మహాశక్తి"కి కూడా అదే పరిస్థితి!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మహాశక్తి’ కూడా నవంబర్ 6న తెలుగులో విడుదలవుతోంది. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్ 2’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించారు. రెజీనా కసాండ్రా ప్రతినాయకురాలిగా నటించగా, యోగిబాబు, దునియా విజయ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండటం విశేషం. అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల్లో సినిమాపై ప్రీ రిలీజ్ బజ్ ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి, ‘మూకుత్తి అమ్మన్ 1’ కి అప్పట్లో తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. కానీ, ‘మూకుత్తి అమ్మన్ 2’ కి మాత్రం అది కనిపించడం లేదు.
ఎంత పెద్ద స్టార్ ఉన్నా, స్టార్ హీరోయిన్ ఉన్నా..అంతకముందు మంచి హిట్స్ ఉన్నా..కావాల్సింది కొత్త సినిమాకి ప్రమోషన్స్. దీనితోనే జనాలలో ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఆ ఆసక్తిని కలిగించడంలో మేకర్స్ కొన్ని పొరపాట్లను చేస్తున్నారు. అనవసరంగా, సినిమా మేకింగ్ కోసం బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు కానీ, ప్రమోషన్స్ విషయంలో లైట్ తీసుకుంటున్నారు. గత సినిమా సక్సెస్‌తో ఈ సినిమాపై బజ్ వస్తుందని రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఈ రెండు కారణాలే ఇప్పుడు సూర్య సీన్, నయన్ మహాశక్తి సినిమాల విషయంలో కనిపిస్తుందనిపిస్తోంది.


