Tollywood: దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మకమైన సినిమా మహాకాళి. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా, మూవీ నుంచి వచ్చిన నటీనటుల ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలను తారా స్థాయిలో ఉంచాయి. తాజాగా, మహాకాళి సినిమా జర్నీ స్టార్ట్ అయింది.
ఈ సినిమాకి సంబందించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ను చిత్రబృందం ప్రారంభించింది. తాజాగా, మహాకాళి సినిమా నుంచి మొదటి పాట 'ఐగిరి నందిని' విడుదల చేశారు. ఈ పాటతో మహాకాళి సినిమా ప్రమోషన్లలో కొత్త ఉత్సాహం మొదలైంది. దుర్గాదేవిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ మహిషాసుర మర్దిని స్తోత్రంలోని ఐగిరి నందిని పాటను చిత్రబృందం కొత్త సంగీత హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సంప్రదాయ భక్తి భావాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా, ఆధునిక సంగీతాన్ని జోడించడం ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్ తమ గాత్రాలతో పాటకు మరింత ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చారు. ముఖ్యంగా, గాయకుల గొంతులు, బ్యాక్‌గ్రౌండ్ కోరస్, సంగీత వాయిద్యాల సమ్మేళనం పాటకు మంచి ఫీల్‌ను అందించాయి.
అమ్మవారి పాత్రలో శ్రీయా రెడ్డి ప్రత్యేక ఆకర్షణ:
తాజాగా వచ్చిన ‘ఐగిరి నందిని’ పాటలో విజువల్స్ కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఇక, నటి శ్రీయా రెడ్డి మహాకాళి దేవి రూపంలో కనిపించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బహుళ చేతులతో అమ్మవారి రూపంలో కనిపిస్తూ, ఒకవైపు ఉగ్రరూపాన్ని, మరోవైపు మాతృత్వంలోని కరుణను చూపించేలా విజువల్స్‌ను చిత్రీకరించారు. ముఖ్యంగా అమ్మవారి శక్తి, మాతృత్వం అనే రెండు విభిన్నమైన కోణాలను ఒకే పాటలో చూపించడం ఎంతో ఆసక్తికరంగా ఉంది. కాగా, ఈ విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
2027 సంక్రాంతి బరిలో మహాకాళి:
ప్రశాంత్ వర్మ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 జనవరి 8న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే, ఈ బరిలో మెగాస్టార్ కాకా, రజినీకాంత్ ధర్మన్ లాంటి సినిమాలే కాకుండా, సంబరాల ఏటిగట్టు, జార్జి రెడ్డి, జనవరి 12 విడుదల లాంటి చిత్రాలున్నాయి. మరి, వీటన్నటినీ మించి మహాకాళి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంశం సృష్ఠిస్తుందో చూడాలి.


