తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు...
కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలంటున్న బీఆర్ఎస్..
మేడిగడ్డను పునరుద్ధరించకుండా సాధ్యం కాదంటున్న సర్కార్
రూ.4,193 కోట్లతో మూడు బ్యారేజీల పునరుద్ధరణకు కేబినెట్ నిర్ణయం..
తెలంగాణకు నీళ్లు అందేదెప్పుడు?
కాళేశ్వరం నిర్మించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానిది తప్పా..? లేక ఆ నీటిని పొలాలకు పారించలేకపోతున్న కాంగ్రెస్ సర్కారుది తప్పా..? ఇదే ఇప్పడు తెలంగాణ ప్రజల ముందున్న బిగ్ క్వశ్చన్. తెలంగాణలో నీటి సంక్షోభం రాజకీయ యుద్ధానికి దారితీస్తోంది. ఒకవైపు ఎల్ నినో ప్రభావం, వర్షపాతం లోటుతో వ్యవసాయ రంగం ఆందోళనలో ఉంది. మరోవైపు గోదావరిలో నీళ్లు ఉన్నా వాటిని వినియోగించుకోవడం లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాల కారణంగానే నీటిని ఎత్తిపోయలేకపోతున్నామని కాంగ్రెస్ చెబుతోంది. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే మేడిగడ్డ దగ్గరే సమస్యలు మొదలవుతాయన్నది ప్రభుత్వ వాదన. మరి ఇందులో వాస్తవం ఎంత? అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది?
కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు.. ఇదో భారీ నీటి వ్యవస్థ!
కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ కాదు. గోదావరి నీటిని భారీ మోటార్ల సహాయంతో ఎత్తిపోసి తెలంగాణలోని ఎత్తైన ప్రాంతాలకు తరలించే లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ.
ఈ ప్రాజెక్టులో మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) అనే మూడు ప్రధాన బ్యారేజీలు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా కన్నెపల్లి, ఇతర పంప్ హౌస్‌లు, సొరంగాలు, కాలువలు, భారీ రిజర్వాయర్లు నిర్మించారు. మొదట మేడిగడ్డ దగ్గర గోదావరి నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. తర్వాతి దశల్లో మిడ్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి రిజర్వాయర్లకు నీటిని చేరుస్తారు.
అంటే ఒక చోట పంపింగ్ నిలిచిపోయినా దాని ప్రభావం మొత్తం నీటి సరఫరా వ్యవస్థపై పడే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు కాళేశ్వరం వివాదంలో కీలకంగా మారింది.
మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు.. ప్రాజెక్టుపై మొదలైన అనుమానాలు!
2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో పిల్లర్లు కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. దీనిని పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నిర్వహణకు సంబంధించి పలు లోపాలను ప్రస్తావించింది. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపైనా ఆందోళనలు వ్యక్తం చేసింది.
దీంతో ఈ మూడు బ్యారేజీలను యథాతథంగా వినియోగించుకోవడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. నిపుణుల సూచనలు, సాంకేతిక పరీక్షలు, మరమ్మతులు లేకుండా నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమన్నది ప్రభుత్వ వాదన.
కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి వివరణ ఇదే!
ఇప్పుడు అసలు వివాదం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరే ఉంది. గోదావరిలో నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు వాటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందన్నది బీఆర్ఎస్ ప్రశ్న.
అయితే ప్రభుత్వం చెబుతున్న సాంకేతిక కారణం వేరు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసిన తర్వాత ఆ నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి చేరాలి. ఇందుకోసం మధ్యలోని బ్యారేజీల్లో నీటి ప్రవాహాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూసివేయకూడదని నిపుణులు సూచిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.
అంటే కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేయడం ఒక్కటే పరిష్కారం కాదని, ఆ నీటిని తర్వాత దశలకు సురక్షితంగా తరలించే వ్యవస్థ కూడా పనిచేయాలని ప్రభుత్వం వాదిస్తోంది.
నవంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం పునరుద్ధరణపై అధికారులతో సమీక్షించారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా NDSA, సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సూచనల ప్రకారం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సుమారు రూ.4,193 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారులు వివరించారు. అవసరమైన అనుమతులు నవంబర్ చివరి నాటికి పొందాలని, పనులు డిసెంబర్ చివరి నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
నీళ్లు కళ్లముందే కనిపిస్తున్నా ఎందుకు ఎత్తిపోయరు- బీఆర్ఎస్
ప్రభుత్వ వాదనకు బీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని ఆరోపిస్తోంది. నవంబర్ 4న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మేడిగడ్డను పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బ్యారేజీలోని 85 పిల్లర్లు నిలకడగానే ఉన్నాయని, కేవలం రెండు మూడు పిల్లర్లకు వచ్చిన సమస్యలతో మొత్తం ప్రాజెక్టును పక్కనపెట్టడం సరికాదని ఆయన వాదించారు.
కన్నెపల్లి దగ్గర సుమారు 22 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, రోజుకు కనీసం ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ నీటిని ఎస్ఆర్ఎస్పీ, నిజాంసాగర్, మిడ్ మానేరు వంటి రిజర్వాయర్లకు తరలించి రైతులకు ఉపయోగపడేలా చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. మేడిగడ్డ మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేస్తోందని కూడా ఆరోపిస్తున్నారు.
మరోవైపు కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని రాజకీయ పోరాటంగా మార్చారు. కాళేశ్వరం పంప్ హౌస్‌లను కావాలనే వినియోగించడం లేదని, కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కోసం మోటార్లు వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.
అంటే బీఆర్ఎస్ వాదనలో ప్రధానమైన అంశం ఒక్కటే. మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు దెబ్బతిన్నంత మాత్రాన మిగిలిన వ్యవస్థను కూడా నిరుపయోగంగా మార్చాల్సిన అవసరం ఏముంది? నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటిని ఎందుకు వినియోగించుకోకూడదు? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నే.
రూ.4,193 కోట్లతో మరమ్మతులు.. కాంట్రాక్టర్లదే ఖర్చా?
కాళేశ్వరం వివాదంలో మరో కీలక పరిణామం నవంబర్ 5న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలను పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సుమారు రూ.4,193 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కేంద్ర జల సంఘం, NDSA సూచనల మేరకు అప్‌స్ట్రీమ్‌లో కట్ఆఫ్ వాల్, డౌన్‌స్ట్రీమ్‌లో స్పిల్‌వే అప్రాన్ వంటి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
నిర్మాణ లోపాల కారణంగా చేయాల్సిన మరమ్మతుల ఖర్చును సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయాలని, అదనపు పనులకు ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.
ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ఇంత భారీ మొత్తం ఖర్చవుతుంటే ఆర్థిక బాధ్యతను పూర్తిగా ఎవరు తీసుకుంటారు? కాంట్రాక్టర్ల నుంచి ఎంత వసూలు చేయగలుగుతారు? మరమ్మతుల తర్వాత బ్యారేజీలు ఎంతకాలం సురక్షితంగా పనిచేస్తాయి? ఈ వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలి.
ఎల్ నినో ప్రభావం.. కాళేశ్వరం ఒక్కటే పరిష్కారమా?
ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం. తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి ఎల్ నినో ప్రభావం, వర్షపాతం లోటు కూడా కారణమవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరడంతోపాటు కరువు ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఒక ప్రశ్న. ఎల్ నినో ప్రభావం ఉంటుందని ముందే అంచనాలు వచ్చినప్పుడు నీటి నిర్వహణకు ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేశారు? కాళేశ్వరం మాత్రమే కాదు.. దేవాదుల, ఇతర సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, భూగర్భ జలాలను ఎలా వినియోగించుకోబోతున్నారు? కరువు వచ్చిన తర్వాత సమీక్షలు చేయడం కంటే.. కరువు రాకముందే సిద్ధం కావడం ముఖ్యం కాదా?
అసలు తప్పు ఎవరిది?
ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే రెండు ప్రభుత్వాల బాధ్యతలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు వచ్చాయంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పించుకోలేదు. బ్యారేజీలను పునరుద్ధరించడం, ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించడం, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత.
బీఆర్ఎస్ చెబుతున్నట్టుగా నీటిని తాత్కాలికంగా ఎత్తిపోయే అవకాశం ఉంటే ప్రభుత్వం పరిశీలించి స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం చెబుతున్నట్టుగా బ్యారేజీల భద్రతకు ముప్పు ఉంటే ఆ నివేదికలను ప్రజల ముందు పెట్టాలి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడిపితే నష్టపోయేది రైతులే. నీటి సమస్యతో ఇబ్బంది పడేది సామాన్య ప్రజలే.
కాళేశ్వరంలో సమస్యలున్నాయని చెబుతున్నారు సరే.. మరి వాటిని పరిష్కరించి తెలంగాణకు నీళ్లు అందించడానికి మీ కార్యాచరణ ఏమిటి?
కాంగ్రెస్‌ను అడగాల్సిన ప్రశ్న ఇది.
కాళేశ్వరం ఎవరి రాజకీయ విజయమో, ఎవరి రాజకీయ వైఫల్యమో చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ తెలంగాణకు నీళ్లు అందించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. అంతిమంగా ప్రజలకు కావాల్సింది నీళ్లు మాత్రమే. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. లేదంటే.. రానున్న రోజుల్లో నీటి సంక్షోభం.. ప్రజా జీవితాలను ఛిన్నాభిన్నం చేయడం ఖాయం. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరాల్లో నీటి కరువు మొదలైంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


