అమెరికాలో ఇటీవల జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్ స్థానాల్లో డెమోక్రాటిక్ పార్టీ అఖండ విజయం సాధించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ తన మాటే శాసనంగా చెలరేగిన ట్రంప్‌నకు ఈ ఎన్నికల ఫలితాలు గట్టి ఎదురుదెబ్బగా మారింది. అయితే ఈ ఓటమి ట్రంప్‌ను అమెరికా అధ్యక్ష పదవి నుంచి దించేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే కేవలం ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఆయనను అధ్యక్ష పీఠం నుంచి వెంటనే సాగనంపడం రాజ్యాంగపరంగా అంత సులభమైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. అధ్యక్షుడిపై అభిశంసన (Impeachment) తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించే అధికారం ప్రతినిధుల సభకు మాత్రమే ఉంటుంది. డెమోక్రాట్లు అక్కడ సాధారణ మెజారిటీ సాధించినందున అభిశంసనను తేలికగా నెగ్గించగలరు.
అయితే అసలు ప్రక్రియ మొత్తం సెనేట్‌లో ముగుస్తుంది. సెనేట్‌లో అధ్యక్షుడిని దోషిగా నిర్ధారించి పదవి నుంచి తొలగించాలంటే మొత్తం 100 స్థానాలకు గాను కనీసం మూడింట రెండొంతుల మంది, అంటే కనీసం 67 మంది సభ్యుల మద్దతు అత్యవసరం. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ప్రకారం సెనేట్‌లో డెమోక్రాట్ల బలం 54 స్థానాలకే పరిమితమైంది. దీంతో ట్రంప్‌ను పదవి నుంచి దింపాలంటే డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్ పార్టీకి చెందిన కనీసం 13మంది సభ్యులు కూడా వ్యతిరేకించి ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుత అమెరికా రాజకీయ పరిస్థితుల్లో ఇది దాదాపు అసాధ్యమైన విషయంగా భావిస్తున్నారు.
అధ్యక్ష పీఠానికి తక్షణ ముప్పు లేనప్పటికీ, కాంగ్రెస్‌పై పట్టు కోల్పోవడం వల్ల ట్రంప్ పాలనకు తీవ్రమైన కళ్లెం పడినట్లయింది. భవిష్యత్తులో ట్రంప్ ప్రభుత్వం తీసుకునే ఇమిగ్రేషన్ విధానాలు, రక్షణ శాఖ నిర్ణయాలు, ఇరాన్ యుద్ధ అంశాలు, ట్రంప్ కుటుంబ వ్యవహారాలపై కాంగ్రెస్ కమిటీలు స్వతంత్ర దర్యాప్తులు, విచారణలకు ఆదేశించే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ప్రశ్నలు ఎదురుకావడం ఖాయం. అధ్యక్షుడిగా ట్రంప్ పదవిలో కొనసాగినప్పటికీ, కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల హవా పెరగడంతో వైట్‌హౌస్‌కు రాబోయే రోజుల్లో ప్రతి అడుగులోనూ రాజకీయ పరీక్షలు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


