ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్న కొద్దీ దాని ప్రభావం ప్రతికూలంగా సామాన్య స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల జేబులపై పడనుంది. గ్లోబల్ రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్ సంస్థ 'జెఫరీస్' (Jefferies) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, రాబోయే రోజుల్లో కొత్తగా లభించే బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల ధరలు ఏకంగా 30శాతం వరకు పెరగనున్నాయి. జెమిని, చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడళ్లను నడిపించేందుకు టెక్ దిగ్గజాలు పెద్ద ఎత్తున డేటా సెంటర్లను నిర్మిస్తుండటం, ఫలితంగా మెమరీ చిప్‌లకు (DRAM & NAND Flash) భారీ కొరత ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
స్మార్ట్ఫోన్ల తయారీలో మెమరీ చిప్‌ల వాటా ఎంతో కీలకమైనది. గతంలో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు లభించిన ఒక మెమరీ యూనిట్ ధర 20డాలర్లు (సుమారు రూ.1,680) ఉండగా, ప్రస్తుతం అది మూడు రెట్లు పెరిగి 60నుంచి 65డాలర్లకు (సుమారు రూ.5వేలు) చేరుకుందని జెఫరీస్ నివేదించింది. ముఖ్యంగా రూ.16వేలు (సుమారు 200 డాలర్లు) కంటే తక్కువ ధర కలిగిన బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల మొత్తం తయారీ వ్యయంలో దాదాపు 60శాతం ఖర్చు కేవలం మెమరీ భాగాలకే అవుతుంది.
తయారీ వ్యయం విపరీతంగా పెరగడంతో ఆ భారాన్ని మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల పైకే మోపక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధరల విపరీత పెంపు ఫలితంగా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్వరూపం తీవ్రంగా మారే అవకాశం ఉంది. 200డాలర్లలోపు ఉండే బడ్జెట్ ఫోన్ల మార్కెట్ వాటా ప్రపంచవ్యాప్తంగా 42శాతం నుంచి 24శాతానికి పడిపోనుండగా, 600డాలర్ల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం విభాగపు ఫోన్ల వాటా 29శాతం నుంచి 38 శాతానికి పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
దీంతో సగటు వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం లేదా సరసమైన ధరల్లో లభించే సెకండ్ హ్యాండ్ (Refurbished) ఫోన్ల వైపు మొగ్గు చూపే సంకేతాలు కనిపిస్తున్నాయి. టెక్ కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల కల్పనకు 2027 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నందున, మెమరీ చిప్‌ల కొరత, ఈ అధిక ధరల భారం 2027 మధ్యకాలం వరకు కొనసాగవచ్చని జెఫరీస్ హెచ్చరించింది. వ్యయాన్ని తగ్గించుకోవడానికి మొబైల్ కంపెనీలు కొత్త మోడళ్ల తయారీని తగ్గించడం లేదా మునుపటి తరం ప్రాసెసర్‌లతోనే తక్కువ ధర ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే యోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


