రాష్ట్రంలో మరో కొత్త జిల్లా రాబోతుందంటూ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా మరో జిల్లా వస్తుందని తెలుస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలను విడతల వారీగా 33 జిల్లాలుగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. పరిపాలన సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొంటూ జిల్లాలను విభజించారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం కూడా జరిగింది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు తన మామ జైపాల్ రెడ్డి పేరు పెడతారని టాక్ వినిపిస్తోంది. తన భార్య కోరిక మేరకు కొత్తగా నిర్మించబోయే ఫ్యూచర్ సిటీలో ఈ జిల్లా ఏర్పాటు కానుందని సమాచారం. ఫ్యూచర్ సిటీ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఇప్పటికే రంగం సిద్ధం అయ్యిందని కూడా ప్రచారం జరుగుతోంది.
ఏ ప్రాంతాలను కొత్త జిల్లాలో కలపాలని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపినట్టు సమాచారం. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్నగర్ ప్రాంతం కూడా ఈ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉంది.
మహేశ్వరం మండలం మొత్తాన్ని, కందుకూరు మండలంలోని 9 గ్రామాలను కొత్త జిల్లాలో కలపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పుడున్న రంగారెడ్డి జిల్లాలోని సగం గ్రామాలు, మండలాలు అందులోకి వెళ్లనున్నాయి.
రేవంత్ రెడ్డి నిర్ణయంతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం సగం కొత్త జిల్లాలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆమెకు రాజకీయంగా దెబ్బే అపి పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి, రేవంత్ రెడ్డికి మధ్య పొలిటికల్ వైరం ఉంది. సీఎం రేవంత్ కావాలనే చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లో నేరుగా ఎదుర్కోలేక ఇక దొడ్డిదారిన బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.


