వెండితెరపై మెగాస్టార్‌గా కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సమాజ హితం కోరే సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి నిరూపించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా దశాబ్దాలుగా ఎంతోమందికి పునర్జన్మనిస్తున్న ఆయన, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపిస్తుంటారు. ఇప్పుడు విఘ్నేశ్వరుని నవరాత్రుల వేళ సామాజిక బాధ్యతను గుర్తు చేశారు.
విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపును కాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి భక్తులకు ఒక కీలక పిలుపునిచ్చారు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే మట్టి వినాయకులతో పాటు ఈసారి విత్తనాలతో కూడిన 'సీడ్ గణేశుడిని' మాత్రమే పూజించాలని ఆయన కోరారు. సీడ్ గణేశుడి ప్రతిమను పూజించిన అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా, అందులోని విత్తనాల నుంచి కొత్త మొక్కలు మొలకెత్తి భవిష్యత్తులో అందరికీ ఆశీస్సులను అందిస్తాయని ఆయన ఆకాంక్షించారు.
'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన సీడ్ గణేశుడి ప్రతిమలను చిరంజీవి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ రూపకర్త, మాజీ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహతో మెలిగి, సీడ్ గణేశుడి ప్రతిమలను ఉపయోగించి పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగస్వామ్యులు కావాలని చిరంజీవి ఈ సందర్భంగా సూచించారు.
సంతోష్ కుమార్ చేపడుతున్న 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఒక పవిత్ర యజ్ఞంలా సాగుతోందని చిరంజీవి కొనియాడారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ దాదాపు 20కోట్ల మొక్కలు నాటించేలా ప్రేరణ కలిగించిన సంతోష్ కుమార్ కృషి అత్యంత అభినందనీయమని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంచడానికి ఆయన చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి తన పూర్తి మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని మెగాస్టార్ ప్రకటించారు.












