అతివేగం ప్రమాదకరమని ఎన్నిసార్లు చెప్పినా నేటితరం పట్టించుకోవడం లేదు. వేగంలోనే కిక్ ఉందని దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నారు. వాహన లైనెస్సులు రాకముందే టూవీలర్, ఫోర్ వీలర్ నడుపుతూ రోడ్లపై స్టంట్స్ చేస్తున్నారు. డేంజరెస్ డ్రైవింగ్ చేస్తూ తోటి వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు.ఫలితంగా ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
వీరితో పాటు అమాయకులు బలవుతున్నారు. చేయని తప్పుకు కొందరు గాయాలపాలవుతుంటే మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని ఘటనల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారికి బదులు అవతలి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనేకం ఉన్నాయి.
తాజాగా ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ముగ్గురు యువకులు అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అయితే, రైడర్ వాహనాన్ని వేగంగా నడపటంతో అదుపుతప్పి రవవాండ్లపల్లి వద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది.
https://x.com/pulsenewsbreak/status/2094272466994737530?s=20
ప్రమాద తీవ్రతకు ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం బైక్‌లో మంటలు చెలరేగినట్టు సమాచారం.మంటల్లో ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోగా.. మృతులు అనిల్, దీక్షిత్, అర్జున్‌గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతిచెందిన ముగ్గురు యువకులు మత్తులో ఉన్నారా? అని కూడా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.












