నేపాల్‌లో సంభవించిన వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడైతే వరద తాకిడి ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్ విజ్ఞప్తి మేరకు భారత్ వైద్యపరికరాలు, మెడిసిన్, రెస్క్యూ బృందాలను పంపించిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, నేపాల్ వరదల్లో భారతీయులు చాలా మందే కనిపించకుండా పోయారు.
ప్రతిఏటా నేపాల్‌కు వేల సంఖ్యలో భారతీయులు వెళ్తుంటారు. కొందరు మౌంట్ ఎవరెస్టు చూసేందుకు, అక్కడి పర్వతాల ట్రెక్కింగ్, కైలాష్ యాత్ర కోసం భక్తులు వెళ్తుంటారు. అయితే,తాజాగా సంభవించిన వరదల్లో కొందరు భారతీయులు కూడా గల్లంతయ్యారు.వారి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరు క్షేమంగా బయటపడగా.. మరికొందరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇంతకీ వారు బతికే ఉన్నారా? లేదా? అనేది కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది.
అయితే, నేపాల్ వరదల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయినట్టు తెలుస్తోంది.కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో విషాదం జరిగినట్టు సమాచారం. గల్లంతైన మహిళను శ్రీదేవి వేజెళ్లగా గుర్తించారు. శ్రీదేవి కనిపించకుండా పోయిందని ఆమె భర్త దీపక్ వెల్లడించారు. వరదలు వచ్చిన సమయంలో శ్రీదేవి ఇమ్మిగ్రేషన్ భవనంలో ఉన్నదని పేర్కొన్నారు.
https://x.com/pulsenewsbreak/status/2094264927074890087?s=20
కాగా, భారీ వరదల కారణంగా ఇమ్మిగ్రేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. అందులో ఉన్నవారంతా వరదల్లో కొట్టుకుపోయారు. కొందరు భవన శిథిలాల కింద పడి మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు.అయితే, కనిపించకుండా పోయిన శ్రీ దేవి కోసం ఆమె భర్త ఫిర్యాదు మేరకు అధికారులు గాలిస్తున్నట్టు సమాచారం. వరదల ధాటికి ఇప్పటివరకు సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గల్లంతయిన వారి సంఖ్య కూడా 3 వేలకు పైగా ఉంటుందని సమాచారం.











