మాజీ సీఎం కేసీఆర్ మియాపూర్ భూములు కొట్టేయాలని చూశాడంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మియపూర్‌లోని రూ.50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు ఇందుకు గాను సుప్రీంకోర్టుకు రేవంత్ ధన్యవాదాలు తెలియజేశారు. 'కేసీఆర్ తన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ రావు ద్వారా కబ్జాకు యత్నించారు. తెలంగాణలోని భూములను కబ్జా చేయాలని చూశారు. అప్పట్లో నేను టీపీసీసీ చీఫ్‌గా పోరాడితే నన్ను జైలుకు పంపించారు. ఆ భూముల విషయంలో దామోదర్ రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లు లంచంగా ఇచ్చారు. కేసీఆర్ స్వయంగా డబ్బు రూపంలోనే లంచాలిచ్చారు. కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి. కోర్టు న్యాయానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా' అని సీఎం రేవంత్ వెల్లడించారు.
కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం, ఇతర నాయకుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడేండుకు పోరాడుతున్నామని రేవంత్ చెప్పారు. ఈ భూములను విద్య, వైద్యం, తదితర రంగాలకు కేటాయిస్తామన్నారు. ఇదే విషయంపై కేబినెట్ లో చర్చిస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించామరి రేవంత్ చెప్పారు. IMG భూములను భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై కేటీఆర్ కొట్టేయాలని చూస్తే న్యాయపోరాటంతో అడ్డుకున్నట్టు వెల్లడించారు. ఇవే కాకుండా కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు బీఆర్ ఎస్ నాయకులు ప్రయత్నిస్తే న్యాయపోరాటంలో తామే అడ్డుకుని విజయం సాధించామన్నారు.
రాష్ట్రంలో గత మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను ఆక్రమణల నుంచి కాపాడినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గుర్రంగూడ, మంచిరేవుల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అటవీ, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని వెల్లడించారు. మియాపూర్ భూముల విక్రయం ద్వారా వచ్చే నిధులను విద్యాభివృద్ధికి వినియోగిస్తామని స్పష్టం చేశారు.
గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు ఆక్రమించేందుకు ప్రయత్నించారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఈ భూముల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిందని, అవి అటవీ భూములేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. మంచిరేవులలోని 143 ఎకరాల భూమిని కేటీఆర్, రాయలసీమ బిల్డర్స్‌తో కలిసి ఆక్రమించేందుకు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ భూములను ప్రభుత్వం కాపాడిందని, ప్రస్తుతం అక్కడ పోలీసుల పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు నజరానాగా అప్పగించారని సీఎం విమర్శించారు. ఆ భూముల పరిరక్షణ కోసం కూడా సుప్రీంకోర్టులో పోరాడి కాపాడుకున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు చేసిన భూ ఆక్రమణలను సైతం అడ్డుకున్నామని వెల్లడించారు.
మియాపూర్ భూముల విక్రయంపై స్పష్టత
మియాపూర్ భూముల విక్రయంపై వస్తున్న విమర్శలకు సీఎం స్పందించారు. ఈ భూముల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యారంగ అభివృద్ధికి ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం భూముల విక్రయం, తద్వారా సమకూరే నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధ్యయనం చేస్తుందని తెలిపారు. మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కృషి చేసిన రెవెన్యూ అధికారులను కనీసం ఎందుకు అభినందించడం లేదని నిలదీశారు. మియాపూర్ భూముల విషయంలో ఇప్పటికైనా కుట్రలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.
పద్మాలయ, ల్యాంకో భూములపై ప్రశ్నలు
పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూముల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీశ్ రావు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఎవరిపై కేసులు వేశారో, అధికారంలోకి వచ్చాక వారితోనే కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారని ఆరోపించారు. హరీశ్ రావు మామ హనుమంతరావు ఆక్రమణలో ఉన్నాయని చెబుతున్న భూముల సర్వేకు అధికారులు వెళ్తే అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారని పేర్కొన్నారు.
భూ ఆక్రమణల అంశంపై బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. ఈ అంశాలపై శాసనసభలో చర్చించి చర్యలు తీసుకోవడానికి సిద్ధమైతే వారు వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. భూ ఆక్రమణలపై చర్చించేందుకు బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. రెండు గ్రామాల మధ్య ఉన్న భూ వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్కడి భూ ఆక్రమణలను పూర్తిస్థాయిలో తేల్చి, అదే ప్రాంతంలో శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తామని ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా భూ ఆక్రమణలకు పాల్పడటం మానుకోవాలని సీఎం సూచించారు. ఆక్రమణలకు సంబంధించి కోర్టులు కూడా వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, అటవీ భూముల పరిరక్షణకు తమ ప్రభుత్వం న్యాయపరంగా, పరిపాలనాపరంగా చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.


