మానవ నాగరికతను ఒక సరికొత్త శిఖరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత తీసుకువెళుతుందని అంతా భావిస్తున్న తరుణంలో, శాస్త్రవేత్తల నుంచి వస్తున్న హెచ్చరికలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.. తాజాగా మెషిన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు నేట్ సోరెస్.. రాబోయే దశాబ్ద కాలంలో మానవజాతి అంతరించిపోయే ప్రమాదం 50 శాతానికి పైగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అసలు మానవాళికి భవిష్యత్తే లేనప్పుడు రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచుకోవడం ఎందుకని ఆయన తన పెన్షన్ ఖాతాకు కోతపెట్టడం, ఈ ముప్పు ఎంత తీవ్రంగా ఉందో కళ్లకు కడుతోందని చర్చించుకుంటున్నారు.. అయితే ఇలాంటి వార్నింగ్ లు మానవ చరిత్రలో కొత్తేమీ కాదు.. గతంలో కూడా ప్రపంచం అంతమైపోతుందనే ప్రచారాలు జోరుగా సాగాయి.. ఇక 1979లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై కూలిపోనుందని, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారని తీవ్రంగా ప్రచారం జరిగింది.
ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. జనం వణికిపోయారు. చావు ఖాయం అనే నిర్ణయానికి కూడా వచ్చారు.. కానీ, చివరికి అది జనసంచారం లేని సముద్రంలో పడడంతో పెను ప్రమాదం తప్పింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఇవిగాక గతంలోనూ ఉల్కలు పడతాయని, అణుయుద్ధాలు జరుగుతాయని, భూమి అంతమైపోతుందనే హెచ్చరికలు ఎన్నో ప్రపంచాన్ని చూట్టాయి. జనానికి నిద్ర లేకుండా చేశాయి..
అయితే, ఈ విపత్తులు ప్రకృతి సంబంధించినవి, ఆధిపత్య పోరు, ప్రయోగాలు వికటించడం వంటి వాటితో సంభవించేవి.. కానీ, నేడు ఏఐ రూపంలో వస్తున్న ముప్పు అలాంటిది కాదు.. మానవుడే స్వయంగా సృష్టిస్తున్న ఒక అదృశ్య మేధస్సు నుంచి వస్తున్న ముప్పు అని అంటున్నారు.. మరోవైపు నేట్ సోరెస్ ఒక్కడే ఈ ప్రమాదాన్ని హెచ్చరించలేదు. ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ దిగ్గజాలు, సైంటిస్టులు ఎప్పట్నుంచో AIపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ఇక నేర్చుకునే విధానంలో మనుషుల కంటే ఏఐ వేగంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇది మానవాళి నియంత్రణను దాటిపోయి పెను ముప్పుగా మారే అవకాశం 10 శాతం వరకు ఉందని AI గాడ్‌ఫాదర్ జియోఫ్రీ హింటన్ గతంలోనే హెచ్చరించారు. అలాగే పూర్తి స్థాయి కృత్రిమ మేధస్సు తయారీ మానవజాతి అంతానికి దారితీస్తుందని, ఇది స్వయంగా తనను తాను అప్ డేట్ చేసుకుంటూ, మనుషులను మించిన వేగంతో మారిపోతుందని స్టీఫెన్ హాకింగ్ తన జీవిత చివరి దశలో ఎన్నోసార్లు హెచ్చరించారు.
మరోవైపు ఏఐ అనేది మానవుల ఉనికిని ప్రమాదంలో పడేసే అవకాశాలున్నట్టు వారికి ముప్పుగా మారి మానవాళి అంతానికి కారణం అవ్వవచ్చని ఎలాన్ మస్క్ పలు వేదికలపై స్పష్టం చేశారు. దీనిని నియంత్రించకపోతే అణుబాంబుల కంటే ఇది ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. అయితే మానవుడు తన మేధస్సుతోనే ఇప్పటివరకు భూమిపై సమస్త ప్రాణకోటిని, ప్రకృతిని శాసించాడు. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణతో నిర్ణయాలు తీసుకున్నాడు.
కానీ, ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. మానవ మేధస్సు ఒక మరబొమ్మ (AI System) చేతిలోకి వెళ్లిపోతోందనే సంకేతాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి నిదర్శనం.. నేడు ఏఐ కేవలం మనుషులు చెప్పిన పనిచేయడం మాత్రమే కాదు... అబద్ధాలు చెప్పడం, వాస్తవాలను దాచడం, సైబర్ దాడి చేయడం, మనుషుల కళ్లుగప్పి తమకు నచ్చిన పనులు చేసుకోవడం లాంటి స్వయంప్రతిపత్తి (Autonomy) లక్షణాలను ప్రదర్శిస్తున్నాయి.
ఒక ఆర్టిఫిషల్ వ్యవస్థ తనకంటూ సొంత లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటి సాధన కోసం మానవ జాతిని అడ్డు తొలగించుకోవాలని భావిస్తే... ఆ రోజు మానవుడి మనుగడ ప్రశ్నార్థకం కావడంలో ఎలాంటి సందేహం లేదనే భయాలు వ్యక్తం అవుతున్నాయి.. అందుకే, నేట్ సోరెస్ లాంటి నిపుణులు ఇస్తున్న హెచ్చరికలను తేలికగా కొట్టిపారేయలేం.. ఎందుకంటే టెక్నాలజీ మనల్ని రక్షిస్తుందనే భ్రమలో ఉంటూనే, అది మనల్ని అంతం చేసే శక్తిని సంతరించుకుంటున్న వాస్తవాన్ని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రస్తుతం ఏఐ మనుషుల ప్రమేయం లేకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్న తరుణంలో... ఈ విశ్లేషణలను తప్పుపట్టడం మన భవిష్యత్తును మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నామనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక మనం సృష్టిస్తున్న ఈ డిజిటల్ మేధస్సు రానున్న రోజుల్లో మాధవ మేధస్సును మించిపోకుండా ఉండేందుకు, ప్రపంచ దేశాలు ఇప్పటికైనా కఠిన నిబంధనలు తీసుకువస్తాయా.. లేక తన నాశనాన్ని తనే మానవ జాతి కొనితెచ్చుకుంటుందా.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి..


