తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి 'గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక' (GPSAP-2026) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆలోచనలు, ఆదేశాల మేరకు రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక విధానానికి సంబంధించి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే ఐదేళ్ల కాలంలో గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు ఈ ప్రణాళిక ఒక స్పష్టమైన దిక్సూచిలా పనిచేయనుంది.
ఈ నూతన విధానంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి సంబంధించిన సమగ్ర డేటాను సేకరించి, ప్రత్యేకమైన 'గ్రామ ప్రొఫైల్' సిద్ధం చేస్తారు. ఇందులో గ్రామంలోని మొత్తం జనాభా, కుటుంబాల సామాజిక-ఆర్థిక స్థితిగతులు, ఉపాధి అవకాశాలు, గృహవసతి, పశుసంపద, ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ పక్కాగా రికార్డు చేస్తారు. 3 నుంచి 5 ఏళ్ల కాలపరిమితితో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించడంతో పాటు, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి గ్రామీణుల అత్యవసర అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ప్రత్యేక వార్షిక కార్యాచరణను ఖరారు చేస్తారు.
అంతేకాకుండా, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ప్రతి గ్రామపంచాయతీకి ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక 'డిజిటల్ డాష్‌బోర్డ్' ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో గ్రామాల్లో పనులు వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి నెలా జరిగే గ్రామపంచాయతీ సమావేశంలో GPSAP అమలపై తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. పనుల పురోగతి పర్యవేక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు ఉన్న అధికారులకు అప్పగించారు. ఒకవేళ సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినా లేదా తప్పుడు రికార్డులు సమర్పించినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
'తెలంగాణ రైజింగ్-2047' (Telangana Rising 2047) సుదూర లక్ష్యాలకు అనుగుణంగా, గ్రామాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ఈ ప్రణాళిక ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా నిధుల లభ్యతకు అనుగుణంగా గ్రామాల్లో ప్రాధాన్యత ఆధారిత అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు.


