జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యల పరిష్కారం కోరుతూ మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర తీవ్ర రాజకీయ వేడిని రాజేసింది. పాదయాత్ర సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డంప్ యార్డు తొలగింపు కోసం తాను పాదయాత్ర చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు 'ఈటలకు పనిలేక తిరుగుతున్నాడంటూ' బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం ఈ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించడమే కాకుండా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు తాను వీధుల్లోనే తిరుగుతూ పోరాటం చేస్తానని బహిరంగంగా సవాల్ విసిరారు.
జవహర్ నగర్ డంప్ యార్డు రీసైకిలింగ్ , శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక కీలకమైన ప్రతిపాదనతో కూడిన సవాల్ చేశారు. జవహర్ నగర్ డంపు యార్డును పూర్తిగా రీసైకిల్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తక్షణమే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంతో స్వయంగా మాట్లాడి, ఒప్పించి దానికి కావలసిన పూర్తి నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి జవహర్ నగర్ డంప్ యార్డ్ రీసైక్లింగ్‌కు అవసరమైన నిధులను తీసుకురాలేకపోతే, తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈటల సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు అనవసరమైన వ్యాఖ్యలు బంద్ చేసి, ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఈ సమస్యపై డీపీఆర్ తయారు చేయించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ నగర శివార్లలో తీవ్ర దుర్గంధం, కాలుష్యంతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్న జవహర్ నగర్ డంప్ యార్డును అక్కడి నుంచి తరలించే వరకు మరియు ప్రభావిత ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు బిజెపి తరఫున రాజీలేని పోరాటం చేస్తామని ఈటల పునరుద్ఘాటించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.


