National

ఉత్తరాంధ్రను కుదిపేస్తున్న 'ఆర్నబ్' తుపాను: పొంగిపొర్లుతున్న బాహుదా, వంశధార నదులు!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

భారతదేశ తూర్పు తీరాన్ని వణికించిన 'ఆర్నబ్' తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్రంగా అతలాకుతలమవుతోంది. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి.

భారతదేశ తూర్పు తీరాన్ని వణికించిన 'ఆర్నబ్' తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్రంగా అతలాకుతలమవుతోంది. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో ఉన్న బాహుదా నది పొంగి పొర్లుతుండటంతో ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వీటికి తోడు వంశధార, నాగావళి, మహేంద్రతనయ, సువర్ణముఖి, వేగావతి నదులు తీవ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్నాయి.

బాహుదా నది పరివాహక ప్రాంతంలోకి ఏకంగా 86,458 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరడంతో దిగువ ప్రాంతాలు జలమయమై భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార నది ప్రవాహం 73,324 క్యూసెక్కులకు చేరుకోవడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ భారీ వరదల దాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, మందస, పాతపట్నం నియోజకవర్గాల పరిధిలోని గ్రామలతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని వందలాది గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వరద ఉద్ధృతి కారణంగా రవాణా, రైల్వే వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలిగింది. ఇచ్ఛాపురం లొద్దపుట్టి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురం-జడుపూడి మధ్య రైల్వే ట్రాక్‌లు, వంతెనలు దెబ్బతినడంతో చెన్నై-హౌరా ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అటు అరకు-విశాఖ ఘాట్ రోడ్డులోని గాలికొండ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడటంతో మార్గాన్ని మూసివేశారు. బొర్రా-కారకవలస రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ దెబ్బతినడంతో కొత్తవలస-కిరండూల్ (KK Line) ప్యాసింజర్ రైలును నవంబర్ 3వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించిన పంట నష్టం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 728 గ్రామాల పరిధిలో సుమారు 21,590 హెక్టార్లలో వరి పంట, 383 హెక్టార్లలో ఉద్యానవన పంటలు పూర్తిగా నీట మునిగి ధ్వంసమయ్యాయి. బారువ తీరప్రాంతంలో సముద్ర కోత తీవ్రమవ్వడంతో వందలాది ఎకరాల కొబ్బరి తోటలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. సోంపేట-బారువ ప్రధాన రహదారిలో సుమారు 7 కిలోమీటర్ల పరిధిలోని పొలాల్లో ఏకంగా 10 అడుగుల లోతున వరద నీరు నిలిచిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

#CycloneArnabDevastation#SrikakulamFloods2026#BahudaRiverOverflow#VamsadharaFirstWarning#UttarandhraHeavyRains#APRoadsRailwaysBlocked#APNewsTelugu#AndhraPradeshNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి