ఒక్క సరస్సు ఉప్పొంగితేనే ఇంత విధ్వంసమా?
భూటాన్‌లో 567 హిమ సరస్సులు.. 17 అత్యంత ప్రమాదకరం!
అసలు హిమ సరస్సులు ఎందుకు పేలిపోతాయి?
భూటాన్‌లో ప్రమాదంతో భారత్‌కు ఎందుకు ఆందోళన?
ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటున్న హిమనదాలు.. నిమిషాల్లోనే నదుల ఉగ్రరూపం. భూటాన్‌లో తాజాగా సంభవించిన హిమ సరస్సు ఉప్పొంగిన ఘటన మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అసోం, పశ్చిమ బెంగాల్‌కు వరద హెచ్చరికలు జారీ కావడంతో హిమాలయాల దిగువ ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది. భూటాన్‌లో ఇప్పటికే 17 హిమ సరస్సులను ప్రమాదకరమైనవిగా గుర్తించారు. మరి ఇవి ఎప్పుడు ఉప్పొంగుతాయి? ఎంతటి విధ్వంసం సృష్టిస్తాయి. వాతావరణ మార్పులు ఈ ముప్పును ఎలా పెంచుతున్నాయి?
ఒక్క సరస్సు ఉప్పొంగితేనే ఇంత విధ్వంసమా?
భూటాన్‌లోని గాసా జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు అందరి దృష్టిని హిమాలయాల వైపు మళ్లించింది. అక్కడి షింటాఫు హిమ సరస్సు నుంచి ఒక్కసారిగా భారీగా నీరు బయటకు రావడంతో దిగువ ప్రాంతాల్లో వరద పరిస్థితి ఏర్పడింది. ఈ నీటి ప్రవాహం మో చు నదిలోకి చేరింది. నది ఒడ్డున ఉన్న ప్రముఖ సహజ వేడి నీటి కేంద్రం గాసా త్షాచు వద్ద ఉన్న సదుపాయాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. పునాఖా–గాసా హైవేలోని కొంత భాగం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
అదృష్టవశాత్తూ, ముందుగానే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ వరద ప్రభావం భూటాన్‌కే పరిమితం కాలేదు. నీటి ప్రవాహం భారత్ వైపు వచ్చే నదుల్లోకి చేరే అవకాశం ఉండటంతో అసోం, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక్కడ అసలు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ ప్రమాదానికి కారణమైన షింటాఫు సరస్సు భూటాన్‌లో ఇప్పటికే ప్రమాదకరమైనవిగా గుర్తించిన హిమ సరస్సుల ముప్పుపై మరోసారి దృష్టి సారించేలా చేసింది. అంటే ఇది అనుకోకుండా జరిగిన సాధారణ వరద కాదు. హిమాలయాల్లో ఎప్పటి నుంచో పెరుగుతున్న ఒక పెద్ద ముప్పు ఇప్పుడు మరోసారి బయటపడింది. కొద్ది రోజుల కిందటే నేపాల్ లో చోటు చేసుకున్న విధ్వంసం ఇంకా కళ్ల ముందే ఉంది. అదే సమయంలో భూటాన్ ఘటన భయపెడుతోంది.
భూటాన్‌లో 567 హిమ సరస్సులు.. 17 అత్యంత ప్రమాదకరం!
భూటాన్ అంటేనే ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పుకున్న హిమాలయాలు, వాటి మధ్య నుంచి ప్రవహించే నదులు. ఈ పర్వత ప్రాంతాల్లో హిమనదాలు క్రమంగా కరిగిపోతుండటంతో కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న సరస్సుల్లో నీటి మట్టం కూడా పెరుగుతోంది.
భూటాన్ జాతీయ జలవిజ్ఞాన, వాతావరణ కేంద్రం (NCHM) లెక్కల ప్రకారం ఆ దేశంలో మొత్తం 567 హిమ సరస్సులు ఉన్నాయి. వీటిలో 17 సరస్సులను అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. గతంలో ఈ సంఖ్య 25గా ఉండేది. మరిన్ని అధ్యయనాల తర్వాత 8 సరస్సుల ప్రమాద స్థాయి తక్కువగా ఉందని తేలడంతో సంఖ్యను 17కు తగ్గించారు.
అయితే 17 సరస్సులను గుర్తించడం అంటే మిగిలిన సరస్సులన్నీ పూర్తిగా సురక్షితమని కాదు. ప్రతి సరస్సు పరిస్థితి, దాని చుట్టూ ఉన్న మంచు పర్వతాలు, సహజ అడ్డుకట్టల బలం, దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్యను బట్టి ప్రమాద స్థాయి మారుతుంది. ఈ సరస్సుల్లో థోర్తోర్మి, రాఫ్‌స్ట్రెంగ్, లుగ్గే వంటి సరస్సుల్లో పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు.
అసలు హిమ సరస్సులు ఎందుకు పేలిపోతాయి?
సాధారణంగా హిమనదాలు అంటే పర్వతాలపై పేరుకుపోయిన భారీ మంచు గడ్డలు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఈ మంచు కరిగి నీరుగా మారుతుంది. హిమనదాలు వెనక్కి వెళ్లినప్పుడు పర్వతాల మధ్య ఏర్పడిన లోతట్టు ప్రాంతాల్లో ఈ నీరు చేరి పెద్ద సరస్సులుగా మారుతుంది.
అయితే వీటికి సాధారణ సరస్సుల్లా బలమైన కట్టలు ఉండవు. ఎక్కువగా రాళ్లు, ఇసుక, మంచు శిథిలాలతో ఏర్పడిన సహజ అడ్డుకట్టలే నీటిని ఆపుతుంటాయి. వీటినే మొరైన్ డ్యామ్స్ అంటారు.
ఏదైనా భారీ కొండచరియలు విరిగిపడినా, మంచు కొండలు సరస్సులోకి కూలినా, భారీ వర్షాలు కురిసినా ఈ సహజ అడ్డుకట్టలు బలహీనపడవచ్చు. ఒక్కసారిగా తెగిపోతే సరస్సులో నిల్వ ఉన్న లక్షలాది క్యూబిక్ మీటర్ల నీరు బయటకు దూసుకొస్తుంది. నీటితో పాటు బండరాళ్లు, మట్టి, మంచు శిథిలాలు కూడా కొట్టుకొస్తాయి.
దీంతో నిమిషాల్లోనే నది ఉగ్రరూపం దాల్చుతుంది. సాధారణ వరదలా కాకుండా భారీ వేగంతో దూసుకొచ్చే ఈ నీటి ప్రవాహం దారిలో ఉన్న వంతెనలు, రోడ్లు, ఇళ్లు, వ్యవసాయ భూములను ధ్వంసం చేస్తుంది. నేపాల్‌లో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఘోర విపత్తు కూడా ఇదే ప్రమాద తీవ్రతను ప్రపంచానికి చూపించింది. లాంగ్‌టాంగ్ రి పర్వత ప్రాంతంలో భారీ హిమనదం కూలిపోవడంతో మంచు, రాళ్లు, మట్టి కలిసి నదిని అడ్డుకున్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా విడుదలైన వరద భోటేకోషి నదీ పరివాహక ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. ఇప్పుడు భూటాన్‌లో తాజా ఘటనతో హిమాలయాల్లో పెరుగుతున్న ప్రమాదంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విపత్తునే గ్లేషియల్ లేక్ అవుట్‌బస్ట్ ఫ్లడ్ (GLOF) అంటారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ఇలాంటి విపత్తుల తీవ్రతను వివరించడానికి ఆకాశంలో సునామీ అనే పదాన్ని ఉపయోగించింది.
భూటాన్ ను వెంటాడుతున్న విషాదాలు...
భూటాన్‌కు ఈ ముప్పు కొత్త కాదు. 1994 అక్టోబర్ 6న లుగ్గే త్షో సరస్సు వద్ద సహజ అడ్డుకట్టలో కొంత భాగం కూలిపోవడంతో భారీ వరద సంభవించింది. ఈ నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, వ్యవసాయ భూములు, రోడ్లు, కీలక నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఆ తర్వాత కూడా భూటాన్‌లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. 2009లో త్షోజో సరస్సు, 2015లో లెమ్‌థాంగ్ త్షో ప్రాంతాల్లో వరద ఘటనలు చోటుచేసుకున్నాయి. 1950ల నుంచి భూటాన్‌లో కనీసం 18 హిమ సరస్సుల ఉప్పొంగిన ఘటనలను పరిశోధకులు గుర్తించారు. అయితే పాత రికార్డులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
300 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు బయటకు వస్తే?
హిమాలయాల్లోని ప్రమాదకర సరస్సులపై శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు అధ్యయనాలు చేశారు. 2023లో జర్నల్ ఆఫ్ హైడ్రాలజీలో ప్రచురితమైన ఒక పరిశోధన భూటాన్‌లోని నాలుగు ప్రమాదకర సరస్సులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. థోర్తోర్మి, రాఫ్‌స్ట్రెంగ్, లుగ్గే, బెచుంగ్ సరస్సుల నుంచి నీరు ఒక్కసారిగా బయటకు వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో శాస్త్రవేత్తలు కంప్యూటర్ మోడళ్ల ద్వారా అంచనా వేశారు.
ఈ అధ్యయనం ప్రకారం.. వివిధ పరిస్థితుల్లో 6 లక్షల నుంచి 30 కోట్ల క్యూబిక్ మీటర్ల వరకు నీరు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు మోడలింగ్‌లో తేలింది. ఇలాంటి విపత్తు జరిగితే 16 వేల మందికి పైగా ప్రజలు, కీలక మౌలిక సదుపాయాలు ప్రమాదంలో పడవచ్చు. సరస్సుల నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలపైనా ప్రభావం ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు.
ముఖ్యంగా థోర్తోర్మి, లుగ్గే సరస్సుల విషయంలో ప్రమాద స్థాయి ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఇది కచ్చితంగా జరగబోయే విపత్తు అంచనా కాదు. కానీ ఒకవేళ ఈ సరస్సుల సహజ అడ్డుకట్టలు తెగిపోతే ఎంతటి విధ్వంసం జరగవచ్చో చెప్పే హెచ్చరిక మాత్రమే.
వాతావరణ మార్పులతో పెరుగుతున్న ప్రమాదం
ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హిమాలయాల్లో కూడా మంచు కరిగే వేగం పెరుగుతోంది. దీనివల్ల హిమనదాలు వెనక్కి వెళ్తున్నాయి. కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న సరస్సులు విస్తరిస్తున్నాయి.
మరోవైపు మంచు కప్పుకున్న పర్వత ప్రాంతాల్లో నేల గట్టిదనం తగ్గుతోంది. మంచు కరిగిపోవడంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతోంది. భారీ వర్షాలు, హిమపాతాలు కూడా సరస్సులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
అయితే వాతావరణ మార్పుల వల్ల ప్రతి సరస్సు కచ్చితంగా ఉప్పొంగుతుందని చెప్పలేం. దాని లోపల ఎంత నీరు ఉంది? సహజ అడ్డుకట్ట ఎంత బలంగా ఉంది? చుట్టుపక్కల కొండల పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలే అసలు ప్రమాదాన్ని నిర్ణయిస్తాయి. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ ప్రమాదాలకు అనుకూల పరిస్థితులను మాత్రం సృష్టిస్తున్నాయి. అందుకే హిమాలయ ప్రాంతాల్లో హిమ సరస్సులపై నిరంతర నిఘా అవసరమవుతోంది.
భూటాన్‌లో ప్రమాదం.. భారత్‌కు ఎందుకు ఆందోళన?
భూటాన్‌లోని పర్వత ప్రాంతాల నుంచి పుట్టే నదులు భారత్‌లోకి ప్రవహిస్తాయి. మో చు, ఫో చు వంటి నదులు దిగువకు ప్రవహిస్తూ సంకోష్ నది వ్యవస్థలో కలుస్తాయి. ఈ నదీ వ్యవస్థ చివరకు అసోంలోని బ్రహ్మపుత్రలో కలుస్తుంది.
అంటే భూటాన్‌లోని ఒక హిమ సరస్సు ఉప్పొంగితే దాని ప్రభావం ఆ దేశానికే పరిమితం కాదు. నదుల ప్రవాహ మార్గంలో ఉన్న భారతీయ ప్రాంతాలకూ ప్రమాదం ఏర్పడవచ్చు.
తాజా ఘటనలోనూ ఇదే కనిపించింది. భూటాన్ నుంచి వచ్చిన వరద నీరు నదీ వ్యవస్థలోకి చేరే అవకాశం ఉండటంతో భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం అత్యంత కీలకం.
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. భూటాన్‌లోని పర్వత ప్రాంతాల్లో వరద మొదలైన తర్వాత దిగువ ప్రాంతాలకు చేరడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. అందువల్ల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఎంత వేగంగా పనిచేస్తాయన్నదే ప్రాణనష్టాన్ని తగ్గించడంలో కీలకం.
ముందస్తు హెచ్చరికలే అసలైన రక్షణ
భూటాన్ ప్రభుత్వం ఇప్పటికే శాటిలైట్ ఇమేజె స్, క్షేత్రస్థాయి పరిశీలనలు, నదుల్లో నీటి మట్టం పర్యవేక్షణ ద్వారా ప్రమాదకర సరస్సుల పరిస్థితిని అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టాన్ని తగ్గించడం, సహజ అడ్డుకట్టలపై ఒత్తిడిని తగ్గించడం వంటి చర్యలు కూడా చేపడుతున్నారు.
అయితే అన్ని సరస్సులను నిరంతరం పర్యవేక్షించడం, ఎప్పుడు ప్రమాదం ఏర్పడుతుందో ముందుగానే గుర్తించడం అంత సులభం కాదు. ముఖ్యంగా మారుమూల పర్వత ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు, రవాణా సదుపాయాలు పరిమితంగా ఉండటం మరో సవాల్.
ఇక భారత్, భూటాన్ మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా కీలకం. ఒక దేశంలోని పర్వత ప్రాంతంలో మొదలైన విపత్తు మరో దేశంలోని లోతట్టు ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. అందుకే నదుల నీటి మట్టాలపై రియల్ టైమ్ సమాచారం, వేగవంతమైన హెచ్చరికలు, అత్యవసర సహాయక చర్యలు మరింత బలోపేతం కావాలి.
భూటాన్‌లో తాజాగా జరిగిన ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది. హిమాలయాల్లో మంచు కరగడం అనేది కేవలం పర్వతాలకే సంబంధించిన పర్యావరణ సమస్య కాదు. అది దిగువ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ప్రజల భద్రతకు సంబంధించిన అంశం.
ఇప్పటివరకు మనం హిమాలయాలను నదులకు నీటిని అందించే జీవనాధారంగా చూశాం. కానీ అదే హిమాలయాల్లో పెరుగుతున్న హిమ సరస్సులు ఇప్పుడు కొత్త విపత్తులకు కారణమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
ఒక సరస్సు ఉప్పొంగితేనే ఇంతటి ఆందోళన ఏర్పడితే.. ఇంకా ప్రమాదకర స్థితిలో ఉన్న మిగిలిన సరస్సుల పరిస్థితి ఏమిటి? వాటి విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? ప్రకృతి ఇచ్చే హెచ్చరికలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే నష్టం ఎంతటి స్థాయిలో ఉంటుంది? ఇప్పుడు ప్రపంచం ముందున్న అసలు ప్రశ్న ఇదే.


