National

2029 యుద్ధానికి ఢిల్లీ ర్యాలీ నుంచే కాంగ్రెస్ స్కెచ్

రచన: Kashi••15 నిమిషాల పఠనం

2029 ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కానీ దేశ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైందా? మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ముందుగా ఎన్నికల వ్యవస్థపైనే పోరాటం చేయాలన్నది కాంగ్రెస్ కొత్త వ్యూహమా? రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన INDIA కూటమి ర్యాలీ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఇదేనా?

ఢిల్లీ నుంచి రాహుల్ బిగ్ స్కెచ్

ఓట్ చోరీ నినాదంతో మోదీ సర్కార్‌కు సవాల్

INDIA కూటమి మళ్లీ ఒక్కటైందా?

జన సమీకరణలో కాంగ్రెస్ టార్గెట్ రీచ్ అయ్యిందా?

2029 ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కానీ దేశ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైందా? ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ముందుగా ఎన్నికల వ్యవస్థపైనే పోరాటం చేయాలన్నది కాంగ్రెస్ కొత్త వ్యూహమా? రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన INDIA కూటమి ర్యాలీ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఇదేనా?

దేశ రాజధాని ఢిల్లీ ఆదివారం మరోసారి రాజకీయ పోరాటానికి వేదికైంది. ఓట్ చోరీ, ఎన్నికల జాబితాల్లో అక్రమాలు, ఎన్నికల సంఘం వ్యవహారశైలిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని INDIA కూటమి రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ వంటి కీలక నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. కేవలం ప్రసంగాలతో సరిపెట్టకుండా, మింటో రోడ్ నుంచి కనాట్ ప్లేస్ మీదుగా రామ్‌లీలా మైదాన్ వరకు నేతలంతా కలిసి మార్చ్ నిర్వహించారు.

ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్‌ కుమార్‌ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన తర్వాత మోదీ, అమిత్ షాల వంతు వస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

అయితే ఈ ర్యాలీ కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో విజయవంతమైందా? బీజేపీకి రాజకీయంగా ఎంతవరకు నష్టం కలిగించింది? INDIA కూటమిలో మళ్లీ ఐక్యత తీసుకొచ్చిందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఓట్ చోరీ నుంచి మొదలైన రాజకీయ యుద్ధం

ఈ మొత్తం పోరాటానికి కేంద్రబిందువు ఓటు హక్కు. ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణగా పిలిచే SIR ప్రక్రియపై కాంగ్రెస్ కొంతకాలంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని, ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్న వర్గాలపై దీని ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఓటర్ల జాబితాల సవరణలో 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తొలగింపులన్నీ అక్రమమని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే డూప్లికేట్, అనర్హులైన ఓటర్లను తొలగించడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతోంది. తప్పుగా తొలగించిన ఓట్లను నమోదు చేసుకోవచ్చని కూడా స్పష్టం చేస్తోంది. కానీ కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతే ప్రజాస్వామ్యంలో వారి గొంతు నొక్కినట్టేనని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఓటు వేయలేని పరిస్థితి కల్పించడం అంటే ప్రజల రాజకీయ హక్కును హరించడమేనని ఆరోపిస్తున్నారు.

ఈ అంశాన్ని కేవలం ఎన్నికల సంఘానికి సంబంధించిన వివాదంగా కాకుండా, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ అంశంగా మార్చడమే కాంగ్రెస్ వ్యూహం. ఇక్కడే రాహుల్ రాజకీయ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయడం కంటే, ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ప్రజల్లో చర్చ సృష్టించాలన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది.

రాహుల్ హెచ్చరిక.. జ్ఞానేశ్‌ కుమార్‌కు సవాల్

ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగం అత్యంత దూకుడుగా సాగింది. ఓట్ చోరీ ద్వారా ప్రజల గళాన్ని దొంగిలిస్తున్నారని, దీనికి బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌పై చర్యలు తప్పవని అన్నారు. ఆయన పదవిలో కొనసాగడానికి వీల్లేదని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఓటు హక్కును చోరీ చేయడం దేశ ప్రజలకు చేసిన ద్రోహమని, ప్రజలు దీనికి తప్పకుండా సమాధానం చెబుతారని అన్నారు. ఇక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘం తర్వాత మోదీ, అమిత్ షాలు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాహుల్ ప్రసంగంలోని మరో కీలక అంశం ప్రభుత్వ సంస్థల స్వతంత్రత. ఎన్నికల సంఘం సహా కీలక వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. RSS, బీజేపీ ప్రభావం ప్రభుత్వ వ్యవస్థల్లో పెరిగిందని విమర్శిస్తోంది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఖండిస్తున్నాయి.

మమతా బెనర్జీ, అఖిలేష్ ఎంట్రీతో కొత్త ఊపు...

ఈ ర్యాలీలో మరో ముఖ్యమైన అంశం INDIA కూటమి నేతల భాగస్వామ్యం. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ వంటి నేతలు ఒకే వేదికపై కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. పశ్చిమ బెంగాల్ కూడా SIR ప్రభావాన్ని ఎదుర్కొంటోందని ఆమె ఆరోపించారు. బీజేపీని ఎదుర్కోవడంలో వెనక్కి తగ్గేది లేదని, ప్రజాస్వామ్య మార్గంలోనే బదులిస్తామని స్పష్టం చేశారు.

అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీపై విమర్శలు చేశారు. దేశ యువత అన్యాయాలను సహించబోదని, ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెబుతుందని అన్నారు. ఇక ఓటు చోరీకి వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు పోరాటంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. కపిల్ సిబల్ మరో అడుగు ముందుకేసి, ఈ ర్యాలీ బీజేపీ పతనానికి ప్రారంభమని అభివర్ణించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో INDIA కూటమిలో నాయకత్వం, రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు, సీట్ల పంపకం వంటి అంశాల్లో విభేదాలు కనిపించాయి. ఇప్పుడు మాత్రం ఎన్నికల సంఘం అంశంపై అందరూ ఒకే గళం వినిపిస్తున్నారు. ఇది తాత్కాలిక ఐక్యతా? లేక 2029 ఎన్నికల వరకు కొనసాగబోయే రాజకీయ అవగాహనా? అదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న.

జనసమీకరణలో కాంగ్రెస్ టార్గెట్ రీచ్ అయ్యిందా?

ర్యాలీకి ముందు కాంగ్రెస్ పెట్టుకున్న లక్ష్యం చాలా పెద్దది. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఢిల్లీకి తరలించి సుమారు 10 లక్షల మందిని సమీకరించాలని భావించింది. ఢిల్లీ పోలీసుల అంచనా మాత్రం సుమారు 50 వేల మంది మాత్రమే. రామ్‌లీలా మైదాన్ సామర్థ్యం కూడా ఏర్పాట్లను బట్టి 30 వేల నుంచి 50 వేల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఆదివారం ఉదయం నుంచే వివిధ రాష్ట్రాల నుంచి కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. మింటో రోడ్ నుంచి రామ్‌లీలా మైదాన్ వరకు జరిగిన మార్చ్‌లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన డ్రోన్ దృశ్యాల్లో కూడా మార్చ్ మార్గంలో భారీగా జనం కనిపించారు. అయితే ర్యాలీ తర్వాత బీజేపీ కొత్త విమర్శలు చేసింది. రామ్‌లీలా మైదాన్‌లో 40 శాతం ఖాళీగా ఉందని పేర్కొంది. కాంగ్రెస్ ప్రకటించిన జనసమీకరణ లక్ష్యాన్ని ఎద్దేవా చేసింది.

కాంగ్రెస్ ర్యాలీకి బీజేపీ కౌంటర్.. తెరపైకి 1984 అల్లర్ల అంశం..

ఢిల్లీలో మరో ఆసక్తికరమైన పరిణామం కూడా చోటుచేసుకుంది. INDIA కూటమి ర్యాలీ జరుగుతున్న సమయంలోనే బీజేపీ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. నవంబర్ 1 తేదీని కాంగ్రెస్ రాజకీయ కార్యక్రమానికి ఎంచుకోవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక హింసలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసింది.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నేతృత్వంలో పశ్చిమ ఢిల్లీలో బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన మార్చ్ నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. 1984 హింసకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని, పార్టీ చరిత్రను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆదివారం ఢిల్లీలో రెండు రాజకీయ శిబిరాల మధ్య రెండు వేర్వేరు అంశాలపై పోటీ నిరసనలు కనిపించాయి. ఒకవైపు ఓటు హక్కు, ఎన్నికల సంఘంపై INDIA కూటమి పోరాటం చేస్తుంటే, మరోవైపు 1984 అల్లర్ల అంశంతో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇది కేవలం ఒక ర్యాలీగా కాకుండా, రెండు పార్టీల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుగా మారింది.

2029 కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్

ఇప్పుడు అసలు ప్రశ్న... ఈ ర్యాలీతో కాంగ్రెస్ ఏం సాధించాలనుకుంటోంది? 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఒక రాజకీయ కథనాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. SIR, ఓటర్ల జాబితాలు, ఎన్నికల సంఘం విశ్వసనీయత వంటి అంశాలను రాజకీయ చర్చలో కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉంటే అది అధికార పార్టీకి రాజకీయంగా సవాలుగా మారుతుంది.

ఇక మోదీ, అమిత్ షాలపై నేరుగా విమర్శలు చేస్తూ రాహుల్ తన ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుడిగా మాత్రమే కాకుండా, దేశవ్యాప్త ప్రతిపక్ష ఉద్యమానికి నాయకత్వం వహించే వ్యక్తిగా ఎదగాలన్న ప్రయత్నం ఆయనలో కనిపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలను పక్కనపెట్టి అందరినీ ఒక్కతాటిపైకి తేవాలనేది కాంగ్రెస్ లక్ష్యం. 2029 ఎన్నికల నాటికి సీట్ల పంపకం, ఉమ్మడి ప్రచారం వంటి అంశాలకు ఈ ఐక్యత ఉపయోగపడవచ్చు.

నిరుద్యోగం, రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, సంపద కేంద్రీకరణ వంటి అంశాలను ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణతో కలిపి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకే ఈ ప్రయత్నాలు ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. అక్టోబర్ 12న ఢిల్లీలో జరిగిన నిరసన మార్చ్, అక్టోబర్ 31న జరిగిన ప్రతిపక్షాల మాక్ పార్లమెంట్, నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్ ర్యాలీ.. ఇవన్నీ ఒకే రాజకీయ అంశంపై కొనసాగుతున్న కార్యాచరణలో భాగంగా కనిపిస్తున్నాయి. అంటే ఒక్కరోజు నిరసనతో సరిపెట్టకుండా, నిరంతర రాజకీయ ఉద్యమంగా మార్చాలన్నది కాంగ్రెస్ వ్యూహం.

రాహుల్ అనుకున్నది సాధించారా?

ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా అవును అని చెప్పలేం. అలాగని ర్యాలీని విఫలమైందని కూడా చెప్పలేం. రాజకీయంగా రాహుల్ తన సందేశాన్ని దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లగలిగారు. INDIA కూటమిలోని కీలక నేతలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగారు. ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల అసంతృప్తిని మరోసారి ప్రధాన చర్చగా మార్చగలిగారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ ముందు మూడు లక్ష్యాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. INDIA కూటమిని ఎన్నికల వరకు ఐక్యంగా ఉంచడం. రెండోది.. ఓటు హక్కు, ప్రజాస్వామ్యం వంటి అంశాలను ప్రజల రోజువారీ సమస్యలతో అనుసంధానించడం. ఇక మూడోది.. మోదీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా ఇండి కూటమిని ముందుకు తీసుకురావడం. ఐతే ఢిల్లీలో మొదలైన ఈ రాజకీయ పోరాటానికి సమాధానం రాబోయే రెండున్నరేళ్లలోనే కనిపిస్తుందన్నది మాత్రం వాస్తవం.

#Rahul Gandhi#INDIA Alliance#Delhi Rally 2026#Mission 2029#Congress Party#Narendra Modi#Mallikarjun Kharge#Mamata Banerjee#Akhilesh Yadav#Opposition Unity#Vote Chori#Election Commission#Indian Politics#Lok Sabha Elections 2029#BJP vs Congress#Indian Political News#Rahul Gandhi Speech#Ramlila Maidan#Congress Strategy#2029 Elections
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి