TG: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కరువు ఫలితమేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023లో కేసీఆర్ హయాంలో ఉన్న ధరలకు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో పెరిగిన రేట్లకు సంబంధించిన వివరాలను కంపేర్ చేస్తూ నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.1,150గా ఉన్న 25 కిలోల సన్నబియ్యం బస్తా ధర నేడు ఏకంగా 87 శాతం పెరిగి రూ.2,250కి చేరిందని, సన్ఫ్లవర్ నూనె రూ.110 నుంచి రూ.189కి, గ్యాస్ సిలిండర్ రూ.870 నుంచి రూ.1,300కి చేరి సామాన్యుడి వంటింట్లో మంటలు పుట్టిస్తోందని ఆయన ఆరోపించారు.
అలాగే నిత్యం వాడే చక్కెర కేజీ గతంలో రూ.36 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.75కి చేరి 108 శాతం భారం పడిందని, పాలు రూ.44 నుంచి రూ.70కి, కందిపప్పు రూ.105 నుంచి రూ.152కి పెరిగాయని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఉల్లిపాయలు, టమాటా, గుడ్ల ధరలతో పాటు పెట్రోల్ లీటరుకు రూ.117కు, డీజిల్ రూ.104కు చేరడంతో రవాణా చార్జీలు పెరిగి ప్రతి కుటుంబ బడ్జెట్ తలకిందులైందని ఆయన మండిపడ్డారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజల నడ్డి విరుస్తోందని, పెరిగిన ధరలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


