ఎనిమిదేళ్ల బాలుడి దాడి నుంచి రాప్తాడు ఘటన వరకు..
పిల్లల ప్రవర్తనలో పెరుగుతున్న హింసాత్మక ధోరణి
మార్కుల వెంట పరుగులు పెడుతున్నామా..?
మానవత్వాన్ని నేర్పించడం మర్చిపోతున్నామా?
ఒక ఎనిమిదేళ్ల బాలుడు.. ఆరేళ్ల చిన్నారిపై దాడి చేశాడు. ఆమెను బెంచీకి బలంగా కొట్టాడు. కిందపడేసి తన్నాడు. రాళ్లు, ఇటుకలు, పూలకుండీతో విచక్షణారహితంగా కొట్టాడు. చిన్నారి స్పృహ కోల్పోయినా అతడి దాడి ఆగలేదు. ఈ దారుణం హర్యానాలోని పంచకులలో క్లాస్ రూమ్ లో జరిగింది. అక్టోబర్ 28న జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు. పదో తరగతి చదువుతున్న బాలికపై ఒక 21 ఏళ్ల యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు. తరగతి గదిలో పాఠం జరుగుతున్న సమయంలో జరిగిన ఈ దాడిలో మరో విద్యార్థిని కూడా గాయపడింది. అడ్డుకునేందుకు వెళ్లిన చిన్నారిపైనా దాడి చేశాడు. చదువుకోవాల్సిన తరగతి గది క్షణాల్లో భయానక వాతావరణంగా మారిపోయింది.
ఈ రెండు ఘటనల మధ్య వయసులోనూ, పరిస్థితుల్లోనూ చాలా తేడా ఉంది. ఒక ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడు. మరో ఘటనలో యువకుడు. కానీ రెండింటిలోనూ కనిపిస్తున్నది ఒక్కటే. ఎదుటివారికి హాని చేయడానికి వెనుకాడని హింసాత్మక ధోరణి. అంతేకాదు.. రెండు ఘటనలు స్కూల్ లోనే జరిగాయి.
అసలు మనుషులు ఎందుకిలా మారుతున్నారు? చిన్న వయసులోనే పిల్లల్లో ఇంతటి దూకుడు ఎలా పెరుగుతోంది? కోపం వస్తే కొట్టడం, నచ్చకపోతే దాడి చేయడం, తిరస్కరణ ఎదురైతే ప్రతీకారం తీర్చుకోవడం.. ఇవే పరిష్కారాలుగా భావించే పరిస్థితి ఎందుకు వస్తోంది?
తప్పు ఎవరిది?
పిల్లల ప్రవర్తనకు మొదటి స్కూల్ ఇల్లు. తల్లిదండ్రులు మాట్లాడే మాటలు, ప్రవర్తించే తీరు, ఇంట్లో ఉండే వాతావరణం పిల్లలపై ప్రభావం చూపుతాయి. ఇంట్లో ప్రతి చిన్న విషయానికీ గొడవలు, అరుపులు, దాడులు కనిపిస్తే పిల్లలు వాటిని సాధారణంగా భావించే ప్రమాదం లేదా? పిల్లలతో మాట్లాడటానికి సమయం లేకుండా, వారి చేతిలో ఫోన్ పెట్టి మన బాధ్యత పూర్తయిందని అనుకుంటున్నామా?
పిల్లలకు మంచి చదువు చెప్పిస్తున్నాం. మంచి స్కూల్లో చేర్పిస్తున్నాం. మంచి మార్కులు రావాలని ఒత్తిడి చేస్తున్నాం. కానీ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఓటమిని ఎలా స్వీకరించాలి? మనకు నచ్చని వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి? ఎదుటివారి బాధను ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలు నేర్పిస్తున్నామా? ఈ ప్రశ్నకు జవాబులు కూడా మనమే చెప్పాలి.
తప్పు తల్లిదండ్రులదేనా? స్కూళ్ల బాధ్యత లేదా?
పిల్లలు రోజులో ఎక్కువ సమయం గడిపే పాఠశాలల్లో వారి ప్రవర్తనను గమనించే వ్యవస్థ ఉందా? విద్యార్థుల మధ్య గొడవలు జరిగినప్పుడు వాటిని సీరియస్‌గా తీసుకుంటున్నారా? పిల్లల్లో కోపం, దూకుడు, ఒంటరితనం, వేధింపుల లక్షణాలు కనిపిస్తే గుర్తించే కౌన్సెలింగ్ వ్యవస్థ ఉందా? స్కూళ్లలో భద్రత అంటే గేటు దగ్గర వాచ్‌మన్ ఉండటమేనా? తరగతి గదుల్లో పర్యవేక్షణ, పిల్లల మానసిక స్థితిపై శ్రద్ధ అవసరం లేదా?
పంచకుల ఘటన తర్వాత స్కూల్ మానిటరింగ్, భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. రాప్తాడు ఘటనలోనూ నిందితుడు పాఠశాల ప్రాంగణంలోకి ఎలా ప్రవేశించగలిగాడన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేశారు. అంటే భద్రతా వ్యవస్థలోని లోపాలను కూడా ప్రశ్నించాల్సిందే.
మానసిక నిపుణులు ఏమంటున్నారు?
పంచకుల ఘటనపై స్పందించిన చైల్డ్ సైకాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. క్రైమ్ వీడియోలు, ఎక్కువ స్క్రీన్ టైమ్, ఇంట్లో గొడవలు, బాల్యంలో ఎదురయ్యే ప్రతికూల అనుభవాలు పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల వయసులో పిల్లల్లో భావోద్వేగాలను నియంత్రించుకోవడం, ఆవేశాన్ని అదుపు చేసుకోవడం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చిన్న వయసులో కనిపించే తీవ్రమైన దూకుడును సాధారణ అల్లరిగా కొట్టిపారేయకూడదని హెచ్చరిస్తున్నారు. పిల్లల ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను పరిశీలించి, అవసరమైనప్పుడు ముందుగానే నిపుణుల సహాయం అందించాలని సూచిస్తున్నారు.
ప్రైమరీ క్లాసుల నుంచే కోపాన్ని గుర్తించడం, నిరాశను తట్టుకోవడం, గొడవలను మాట్లాడి పరిష్కరించుకోవడం, అవసరమైనప్పుడు సహాయం అడగడం వంటి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను పిల్లలకు నేర్పించాలని నిపుణుల సూచిస్తున్నారు. అయితే ప్రతి హింసాత్మక ప్రవర్తన వెనుక మానసిక అనారోగ్యమే ఉందని చెప్పలేం. అలాగే మానసిక సమస్యలతో బాధపడుతున్న వారందరినీ హింసాత్మకులుగా చూడటం కూడా తప్పు. ప్రతి ఘటన వెనుక ఉన్న పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలించాలి.
వ్యవస్థ మారాలా? మనమే మారాలా?
ఇక్కడ మరో ప్రశ్న. పిల్లలపై చదువు, మార్కులు, పోటీ పరీక్షలు, భవిష్యత్తు పేరుతో అంతులేని ఒత్తిడి పెడుతున్నామా? వారి భావోద్వేగాలను పట్టించుకుంటున్నామా? పిల్లలు తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుతున్నామా? లేక అవమానించడం, కొట్టడం, భయపెట్టడం ద్వారా మరింత ఒత్తిడికి గురిచేస్తున్నామా?
స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడం మాత్రమే సరిపోతుందా? మంచి పౌరులుగా, మంచి మనుషులుగా ఎదిగేలా నేర్పించాల్సిన బాధ్యత లేదా? విద్యాశాఖలు, స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదా?
ఇది ఒక్క తల్లిదండ్రుల సమస్య కాదు. ఒక్క స్కూల్ సమస్య కూడా కాదు. పిల్లల పెంపకం, విద్యావ్యవస్థ, కుటుంబ వాతావరణం, సమాజంలో కనిపిస్తున్న ప్రవర్తన, డిజిటల్ ప్రపంచం.. ఇవన్నీ కలిసే పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. అందుకే బాధ్యతను ఒకరి మీదకు నెట్టి మనం తప్పించుకోలేం.
పిల్లలకు ఖరీదైన ఫోన్లు కొనిస్తున్నాం. మంచి స్కూల్లో చదివిస్తున్నాం. మంచి భవిష్యత్తు కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ ఒక మనిషిని గౌరవించడం, కోపాన్ని అదుపు చేసుకోవడం, ఎదుటివారికి హాని చేయకూడదనే కనీస విలువలు నేర్పిస్తున్నామా?
ఎనిమిదేళ్ల బాలుడి ఘటన మనల్ని ప్రశ్నిస్తోంది. రాప్తాడులో జరిగిన దాడి మనల్ని హెచ్చరిస్తోంది. ఈ ఘటనలను చూసి కొన్ని రోజులు బాధపడటం, ఆ తర్వాత మర్చిపోవడం కాదు. మన ఇళ్లలో, పాఠశాలల్లో, సొసైటీలో ఏం జరుగుతోందో నిజాయితీగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
ఎందుకంటే పిల్లలకు ఆస్తులు ఇవ్వొచ్చు. చదువు చెప్పించొచ్చు. ఉద్యోగాలు సంపాదించేలా చేయొచ్చు. కానీ మానవత్వం నేర్పించకపోతే ఆ విజయాలన్నింటికీ అర్థం ఏముంటుంది? అందుకే.. మంచి మార్కులు తెచ్చుకునే పిల్లలు కావాలి. మంచి ఉద్యోగాలు సంపాదించే యువత కావాలి. కానీ అంతకంటే ముందు మంచి మనుషులు కూడా కావాలి. మనిషి ఎదగాలి. సమాజం అభివృద్ధి చెందాలి. కానీ ఆ ప్రయాణంలో మనలోని మానవత్వం మాత్రం చనిపోకూడదు.


