రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులపై భారీగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్ నినో మీద మంత్రులతో సమావేశం అనంతరం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా ప్రతినిధులు మెడికవర్ అంశంలో మాట్లాడాలని కోరగా.. ఆరోపణలు కాదు సాక్ష్యాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.చూపిస్తే విచారణకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ మరోసారి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు ఇదిగో సాక్ష్యాలు అంటూ అంకెలతో సహా వివరాలు వెల్లడించారు. మెడికవర్ హాస్పిటల్లో రేవంత్ కుటుంబసభ్యులకు ఉన్న షేర్ల వివరాలను బహిర్గతం చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క ఆధారం అడిగారు కదా? ఒక్కటి కాదు మూడు చూపిస్తా అంటూ వ్యాఖ్యానించారు.
అన్నం శరత్ రెడ్డి (రేవంత్ అక్క అల్లుడి సోదరుడు) మెడికవర్ ఆసుపత్రిలో 50,880 షేర్లు, మాక్స్ బీఎన్ ఫార్మాలో 1,08,000 షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక బ్రహ్మానంద రెడ్డికి మెడికవర్ ఆసుపత్రిలో 28,78,192 షేర్లు ఉంటే , మైండ్ వాల్ట్ నిర్మిస్తున్న అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ స్కూల్లో రేవంత్ కూతురు నైమిష రెడ్డికి 65, 834 షేర్లు ఉన్నాయని ఆరోపించారు.
అదే విధంగా దుంప శిరీష రెడ్డికి మెడికవర్ ఆసుపత్రిలో 46,46,596 షేర్లు ఉండగా, మాక్స్ బీఎన్ ఫార్మాలో 37,00,00 షేర్లు (రేవంత్ అల్లుడి కంపెనీ) ఉన్నాయన్నారు. మైండ్ వాల్ట్లో ఆమెకు 1,97,500 షేర్లు (రేవంత్ కూతురు నైమిష రెడ్డి కార్పొరేట్ స్కూల్) ఉన్నాయని ఆరోపించారు. ఈ ముగ్గురికీ మెడికవర్, మాక్స్ బీఎన్, మైండ్ వాల్ట్ సంస్థల్లో షేర్లు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.ముందు వీటి గురించి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెడికవర్ ఆసుపత్రిని అమ్మేసి రూ.13,200 కోట్ల నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నావు కదా? అవన్నీ ఇలాంటి కష్టకాలంలో రైతులకు పంచిపెట్టు అని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, బీఆర్ఎస్ నేతలు మెడికవర్ ఆస్పత్రి అంశంలో చేస్తున్న ఆరోపణలకు గాను సీఎం రేవంత్ సహా ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు సైతం ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.


