తహసీల్దార్ ఆఫీసుల్లో పెరిగిన అవినీతి!
ఏసీబీకి వరుసగా చిక్కుతున్న రెవెన్యూ అధికారులు!
వరుసగా దొరికినా మారని తీరు
భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగీ తిరిగీ విసిగిపోయి చివరకు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లు, సీనియర్ అసిస్టెంట్ల స్థాయి అధికారులే ఎక్కువగా ఏసీబీకి చిక్కుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం భూ సమస్యల పరిష్కారంలో పైఅధికారుల పాత్ర చాలా కీలకం. భూభారతి లేదా ఇతర పోర్టళ్ల ద్వారా వచ్చిన దరఖాస్తులపై కింది స్థాయి అధికారులు పంపించే విచారణ నివేదికల (Reports) ఆధారంగానే ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ) జిల్లా కలెక్టర్లు ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. అయితే, ఉన్నతాధికారుల నిర్ణయానికి కింది స్థాయి అధికారుల రిపోర్టే కీలకం కావడంతో, కొంతమంది అధికారులు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
అధికంగా లంచాలు గుంజుతు రైతుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి సరైన రిపోర్టు రాయడానికి, పైఅధికారులకు ఫైల్ పంపడానికి తహసీల్దార్ స్థాయి సిబ్బంది రైతుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇక భూభారతిలో దరఖాస్తు చేసుకున్న తర్వాత, పరిష్కారం కోసం ప్రజలు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నివేదికలు పంపకుండా కాలయాపన చేస్తూ, డబ్బుల కోసం పదేపదే వేధిస్తుండటంతో విసిగిపోయిన బాధితులు వేరే దారి లేక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.
ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్, ఘట్కేసర్, షామీర్పేట్, ఇబ్రహీంపట్నం వంటి మండలాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. భూముల విలువ పెరగడంతో పాటు ఇక్కడ అవినీతి తీవ్రత కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ ప్రాంతాల్లో పనిచేసే కీలక అధికారులు రైతుల నుంచి లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి దొరికిపోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. అత్యంత విచారకరమైన విషయమేమిటంటే.. ఒకే కార్యాలయంలో ఒక అధికారి అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కినప్పటికీ, అదే ఆఫీసులో తరువాత వచ్చే అధికారులు,తోటి సిబ్బందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఒకరిని చూసి మరొకరు భయపడాల్సింది పోయి, మళ్లీ మళ్లీ అవినీతికి పాల్పడుతూ పట్టుబడుతున్నారు.
మరోవైపు ఈ పరిస్థితికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంది.. ఇందులో భాగంగా రైతులు, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా వ్యవస్థను బలోపేతం చేయాలి.. అలాగే రెవెన్యూ కార్యాలయాలపై ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలి.. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు కీలక బాధ్యతలు ఇవ్వకుండా లూప్ లైన్ పోస్టింగ్లలో వేయాలి. ఇక కష్టపడి వ్యవసాయం చేసుకునే రైతులను వేధించకుండా, అవినీతికి దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం రెవెన్యూ అధికారులపై ఎంతైనా ఉందనే అభిప్రాయాలున్నాయి..


