మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. యెమెన్ తాత్కాలిక రాజధాని ఏడెన్లోని చారిత్రాత్మక అల్-మాషిక్ (Al-Maashiq) అధ్యక్ష భవన ప్రాంగణాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు గురువారం భీకర బాలిస్టిక్ క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దాడి జరిగిన సమయంలో భవనంలోనే ఉన్న యెమెన్ ప్రధాని షయా అల్-జిందానీతో పాటు ఇతర కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం ఐదు బాలిస్టిక్ క్షిపణులతో హౌతీలు ఈ దాడులు చేసినట్లు యెమెన్ సమాచార శాఖ మంత్రి స్పష్టం చేశారు. బాంబుల ధాటికి భవన ప్రాంగణం తీవ్రంగా దెబ్బతినగా, భారీగా పొగలు అలుముకున్నాయి. మృతుల్లో ప్రధాని వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరితో పాటు ప్రాంగణానికి కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డులు, ఇతర పౌర ఉద్యోగులు ఉన్నారని యెమెన్ ఆరోగ్య శాఖ మంత్రి ఖాసిం బుహైబే వెల్లడించారు.
ఈ క్షిపణి దాడికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష భవనంలోని సౌదీ సైనిక బలగాల వ్యూహాత్మక కార్యకలాపాల గదిని లక్ష్యంగా చేసుకున్నామని, తమ భూభాగంలో ఉన్న సౌదీ సైనిక స్థావరాలపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. దాడిని తీవ్రంగా ఖండించిన యెమెన్ ప్రధాని అల్-జిందానీ.. ఇది హౌతీల ‘పిరికిపంద చర్య’ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వంపై జరిగిన ఉగ్రవాద కుట్ర అని మండిపడ్డారు.
ఎంతటి దాడులు చేసినా తమ సైన్యానికి ఉన్న పట్టుదల తగ్గదని తెలిపారు. హౌతీ ఉగ్రవాదుల నుంచి యెమెన్ భూభాగాన్ని పూర్తిగా విడిపించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. 2014-15 కాలంలో రాజధాని సనాను హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్న నాటి నుంచి సౌదీ అరేబియా మద్దతుతో కూడిన యెమెన్ అధికారిక ప్రభుత్వం ఏడెన్ నగరం నుంచే పాలన సాగిస్తోంది. తాజా క్షిపణి దాడితో ఆ ప్రాంతంలో మరోసారి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


