తెలంగాణలో ఫేక్ డిఫెన్స్ కంపెనీలు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ పాలనలో ఫేక్ ఏరోస్పేస్,డిఫెన్స్ షెల్ కంపెనీలకు అడ్డగా హైదరాబాద్ మారుతోందన్నారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ట్యాగ్ చేస్తూ నగరంలోని నకిలీ కంపెనీలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలో పలువురు కీలక నేతల కుటుంబాలకు చెందిన అనుమానాస్పద కంపెనీలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న టెసరాక్ట్ ఏరోస్పేస్ షెల్ కంపెనీ వ్యవహారం బయటపడిందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ ఏరోస్పేస్ కంపెనీ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. తాజాగా ఐంద్రి డిఫెన్స్ అనే మరో షెల్ కంపెనీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
దేశ భద్రతలో కీలకమైన రక్షణ రంగానికి సంబంధించి ఇలాంటి నకిలీ షెల్ కంపెనీలు పరికరాలు, సమాచారాన్ని సరఫరా చేసే పరిస్థితి వస్తే, భారత సాయుధ దళాలను ఆ దేవుడే కాపాడాలని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.ఈ తరహా షెల్ కంపెనీల బాగోతంపై కేంద్ర రక్షణ మంత్రి, ఇంటెలిజెన్స్ విభాగం సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను బయటకు తీయాలని కేటీఆర్ కోరారు.ఇక రాష్ట్రంలో వచ్చిన కరువుపైనా కేటీఆర్ స్పందించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు.
గోదావరి నుంచి 750 టీఎంసీలకు పైగా, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారని, కన్నెపల్లి, దేవాదుల పంపులను సక్రమంగా వినియోగించి ఉంటే రిజర్వాయర్లు, చెరువులను నింపే అవకాశం ఉండేదన్నారు.త పాలమూరు–రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా కృష్ణా జలాలను వృథా చేశారని, ఎల్నినో ప్రభావంపై మార్చి నుంచే హెచ్చరికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.తెలంగాణ నీటిని దిగువకు వదిలేయడంతో ఏపీ ప్రభుత్వం పట్టిసీమ, పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా నీటిని తరలించుకుపోయిందన్నారు. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి సైతం నీటిని తరలించారని చెప్పారు.


