తెలంగాణ

Telangana: ఎండిపోతున్న పొలాలు-అడుగంటుతున్న ఆశలు!..

రచన: Venu•••13 నిమిషాల పఠనం

తెలంగాణ రాష్ట్రంలో 2026 ఖరీఫ్ వ్యవసాయ రంగాన్ని ఎల్ నినో ప్రభావం తీవ్రంగా దెబ్బతీసింది. వర్షాభావం, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర కరువు పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

తెలంగాణ వ్యవసాయంపై ఎల్ నినో దాడి!

అడుగంటిపోతున్న భూగర్భ జలాలు!

ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు!

అవస్థల్లో అన్నదాతలు!

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

9912928422

తెలంగాణ రాష్ట్రంలో 2026 ఖరీఫ్ వ్యవసాయ రంగాన్ని ఎల్ నినో ప్రభావం తీవ్రంగా దెబ్బతీసింది. వర్షాభావం, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర కరువు పరిస్థితులను సృష్టిస్తున్నాయి. పంటలను కాపాడుకోవడానికి రైతాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే పెసర, మినుము, సోయాబీన్ వంటి పంటలు కోతకు వస్తుండగా, మిగిలిన పంటలు నీరందక ఎండిపోతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు మొలకెత్తక రైతులు ఒకటికి మూడుసార్లు విత్తనాలు నాటాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో బావులు, బోర్లు ఎండిపోవడంతో పాటు విద్యుత్ కోతలు సర్వసాధారణ మయ్యాయి. యూనిట్‌కు పది రూపాయలు చెల్లించి కొందామన్నా మార్కెట్‌లో విద్యుత్ లభించని పరిస్థితి ఉందని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. పైరును కాపాడుకోవడానికి వేలాది రూపాయలు వెచ్చించి రైతులు ఇతరుల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నారు.

బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్ర వ్యవసాయానికి ఆధారమైన నైరుతి రుతు పవనాల కాలంలో వర్షపాతం తీవ్రంగా పడిపోయింది. నైరుతి రుతుపవనాల సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు కాగా, గత సంవత్సరం జూన్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు 988.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ ఈ ఏడాది అదే కాలంలో కేవలం 615.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.

నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే, జూన్‌లో 130.3 మి.మీ సాధారణ వర్షపాతానికి గాను 115 మి.మీ నమోదు కాగా, ఆగస్టులో 215.8 మి.మీకి కేవలం 134.5 మి.మీ నమోదై 38 శాతం లోటు ఏర్పడింది. సెప్టెంబర్‌లో 167.1 మి.మీకి గాను 141.7 మి.మీ మాత్రమే కురిసి 31 శాతం లోటును చూపించింది. ఇక రాష్ట్ర సగటు వర్షపాతం లోటు 17 శాతంగా ఉండి సాధారణ వర్షపాతంగా అనిపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 16 జిల్లాలు మాత్రమే సాధారణ వర్షపాతాన్ని నమోదు చేయగా, ఏకంగా 17 జిల్లాల్లో 20 శాతం నుండి 59 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్ వంటి ప్రధాన జిల్లాలు ఈ లోటు వర్షపాతం జాబితాలో ఉన్నాయి. మరోవైపు వర్షాలు లేకపోవడంతో ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 848.77 టీఎంసీల నీరు ఉండగా, ఈ ఏడాది అది కేవలం 475.57 టీఎంసీలకు పడిపోయింది.

కృష్ణా బేసిన్ పరిధిలోని శ్రీశైలంలో గతేడాది 206.10 టీఎంసీలు ఉండగా ఈసారి 87.45 టీఎంసీలకు, నాగార్జున సాగర్‌లో 295.70 టీఎంసీల నుండి 181.52 టీఎంసీలకు నీటి నిల్వలు క్షీణించాయి. గోదావరి బేసిన్ లోని శ్రీరామ్‌సాగర్ నిల్వలు 56.64 టీఎంసీల నుండి 46.36 టీఎంసీలకు, సింగూరు నీటి మట్టం 18.36 టీఎంసీల నుండి ఏకంగా 4.01 టీఎంసీలకు పడిపోయింది.

ఉపరితల నీటి లభ్యత తగ్గడంతో రైతులు బోర్లపై విపరీతంగా ఆధారపడ్డారు. దీనికి తోడు నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి, పత్తి పంటలను విస్తృతంగా సాగు చేయడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఉదాహరణకు సూర్యాపేటలో వర్షపాతం 19 శాతం తగ్గినప్పటికీ వరి సాగు పెరగడంతో భూగర్భ నీటిమట్టం 3.72 మీటర్ల నుండి 9.07 మీటర్ల లోతుకు పడిపోయింది. వికారాబాద్‌లో పత్తి సాగు వల్ల నీటి మట్టం 6.57 మీటర్ల నుండి 11.73 మీటర్లకు పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భజల మట్టం గత ఏడాది ఆగస్టులో 5.78 మీటర్లు ఉండగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 7.87 మీటర్లకు పడిపోయి సగటున 2.09 మీటర్ల లోతుకు పడిపోయింది.

అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో నీటి మట్టాలు 11 నుండి 12 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. ఈ ఖరీఫ్ సీజన్లలో పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. రాష్ట్ర సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు కాగా, ఈసారి 1,25,85,426 ఎకరాలకు పరిమితమైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 65,95,645 ఎకరాలు కాగా, గతేడాది ఖరీఫ్‌లో 67,33,484 ఎకరాల్లో సాగై, ఈసారి 56,79,969 ఎకరాలకు అంటే దాదాపు 9 లక్షల ఎకరాలకు పైగా తగ్గింది. ధాన్యాల మొత్తం సాగు విస్తీర్ణం 72,48,771 ఎకరాలకు గాను 63,12,526 ఎకరాల్లో (87 శాతం) మాత్రమే సాగైంది. నూనెగింజల సాగు 4,47,585 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 3,96,597 ఎకరాలకు పరిమితమైంది.

అయితే పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరగడం కొంత ఊరట కలిగించే అంశం. పప్పుధాన్యాల సాధారణ విస్తీర్ణం 6,49,397 ఎకరాలు కాగా, ఈసారి 7,97,772 ఎకరాలలో సాగయ్యాయి. ఇందులో పెసర సాగు గతేడాది 61,836 ఎకరాల నుండి 1,60,676 ఎకరాలకు, మినుము 31,142 ఎకరాల నుండి 73,834 ఎకరాలకు గణనీయంగా పెరిగాయి. మరోవైపు వాణిజ్య పంట అయిన పత్తి సాగు 48,33,112 ఎకరాల్లో నమోదైంది.

రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో వరి వంటి నీటిని ఎక్కువగా కోరే పంటలను సాగు చేయడం తీవ్ర ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి లభ్యతను బట్టి డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా తక్కువ నీటితో పండే జొన్న, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాలు, శనగ, పెసర వంటి పప్పుధాన్యాలు, ఆముదం, వేరుశనగ వంటి నూనెగింజల ఆరుతడి పంటలను మాత్రమే వేయాలని సూచిస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వం శాస్త్రీయ అవగాహన లేకుండా ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఒక ఆయిల్ పామ్ చెట్టుకు రోజుకు 250 నుండి 300 లీటర్ల నీరు, ఏటా 1500 నుండి 1800 మి.మీ వర్షపాతం అవసరం. కరువు సమయంలో కొత్తగా ఆయిల్ పామ్ నాటితే 90 శాతానికి పైగా లేత మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఉన్న తోటలను కాపాడుకోవడానికి మల్చింగ్ చేయడం, రాత్రి వేళల్లో మాత్రమే నీరందించడం, పొటాషియం పిచికారీ చేయడం వంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి.

ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణ సహాయ చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి, కేంద్రానికి నివేదికలు పంపి ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులతో పాటు రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు కేటాయించాలి. ఇతర మౌలిక వసతుల కాంట్రాక్టర్లకు ఇచ్చే నిధులను కరువు పీడిత గ్రామాలకు మళ్లించాలి. అలాగే రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని వెంటనే అమలులోకి తేవాలి. ఖరీఫ్ లో సగటు దిగుబడులు పడిపోయిన రైతులందరికీ బీమా పథకం క్రింద, పత్తి, టమాటా, మిరప, బత్తాయి రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం క్రింద నష్ట పరిహారం అందించాలి. గత 6 సీజన్ లుగా పంటల బీమా పథకం లేక రైతులు తీవ్రంగా నష్ట పోయారు.

పంటల బీమా పథకం ప్రయోజనాలను పొందడానికి వీలుగా కూడా కౌలు రైతులను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి. ఈ సీజన్ లో పంటల సగటు దిగుబడులు బాగా తగ్గిన రైతులతో పాటు కూరగాయల రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి. కౌలు రైతులతో సహా , పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. వరి, పత్తి లాంటి ప్రధాన పంటలకు 2026 లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిర్ణయించిన ఋణ పరిమితిలో 50 శాతం రైతులకు పరిహారంగా అందించాలి.

కౌలు రైతుల గుర్తింపు కోసం 2011 అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలి. వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా రైతులను గుర్తించడానికి మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక చట్టాన్ని తేవాలి. పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనెగింజలకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. యాసంగి కి ఆరుతడి విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడడంతో పాటు పశువుల మేతను సరఫరా చేయాలి.

వలసలను నివారించడానికి ఉపాధి హామీ పనులను తక్షణమే విస్తృతంగా ప్రారంభించాలి.ఎక్కువమందికి పనులు కల్పించడానికి వీలుగా, సన్న, చిన్నకారు రైతులకు, గ్రామీణ మౌలిక వసతులైన గిడ్డంగులు, డ్రయ్యింగ్ యార్డులు, స్కూల్ భవనాలు, లాంటి మౌలిక వసతుల మేలు జరిగేలా ఈ సీజన్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా కొత్త పనులను ఉపాధి హామీ పథకానికి జోడించాలి. రైతులు, స్వయం సహాయక బృందాల బ్యాంకు అప్పుల వాయిదాలను ఒక ఏడాది పాటు వాయిదా వేసి, వడ్డీలను మాఫీ చేయాలి.

ఇప్పటికీ మిషన్ భగీరథ పథకం గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. చాలా చోట్ల గ్రామీణ , ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు మంచి నీరు అందడం లేదు. మిషన్ భగీరథ పథకం పూర్తి స్థాయి మంచి నీటి పథకం. ఈ పథకం అమలులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, తగిన స్థాయిలో మంచి నీటిని ప్రజలకు సరఫరా చేయడానికి ప్రభుత్వం పూనుకోకపోవడం వల్ల, ప్రజలు ప్రైవేట్ నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆయా కుటుంబాలపై ఆర్ధిక భారాన్ని మోపుతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా, ప్రాజెక్టులలో నీటి కొరత ఉన్నందున మిషన్ భగీరథ నీటిని ఇథనాల్, కోకాకోలా, డాటా సెంటర్లు వంటి పరిశ్రమలకు మళ్లించకుండా, కేవలం ప్రజల తాగునీటికి, ఆరుతడి పంటలకు మాత్రమే వినియోగించాలి..

#Telangana Drought 2026#El Nino Impact on Agriculture#Telangana Farmers Crisis#Crop Loss Compensation#Groundwater Depletion#Telangana Rainfall Deficit#Agricultural Insurance Scheme#Rabi Season Crop Planning#Farmer Loan Waiver#Telangana Water Crisis
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి