ACB: మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి (DYSO) రాజశేఖర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఉమేశ్ పట్టుబడ్డారు. యువజన, క్రీడల నిర్వహణ సమయంలో సరఫరా చేసిన క్యాటరింగ్ బిల్లులను మంజూరు చేయాలని సంబంధిత నిర్వాహకులు డీవైఎస్‌వోను సంప్రందించారు. అయితే, క్యాటరింగ్ బిల్లులు మంజూరు చేయడానికి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో క్యాటరింగ్ నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు. లంచం తీసుకుంటుండగా రాజశేఖర్ రెడ్డి, ఉమేశ్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బిల్లుల మంజూరుకు రూ.లక్ష డిమాండ్
మహబూబ్‌నగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ వాలీబాల్ హాస్టల్‌లో క్రీడాకారులకు ఆగస్టు నెలలో అందించిన క్యాటరింగ్ బిల్లులు (రూ.3.10 లక్షలు) మంజూరు చేసేందుకు లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు డీవైఎస్ఓ రాజశేఖర్ రెడ్డి. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో మహబూబ్ నగర్ రేంజ్ ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. లంచం తీసుకుంటూ ఉండగా డీవైఎస్ఓతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ను పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. వారిపై కేసు నమోదు చేసిన దర్యాఫ్తు చేపట్టారు.
అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం
ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు చేసి పెట్టేందుకు అధికారి లంచం అడగటం చట్టరీత్యా నేరం. అవినీతికి పాల్పడే వారికి జైలు శిక్ష ఖాయం. రూల్స్ గురించి తెలిసినా కొందరు ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. లంచాలకు బాగా రుచి మరిగారు. ఏ పని చేయాలన్నా చేతులు తడపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. లంచం డిమాండ్ చేసే ఆఫీసర్స్ పై నిఘా ఉంచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అనేకమంది అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఇంత జరుగుతున్నా ఇంకా కొందరు ప్రభుత్వ అధికారులు మారడం లేదు.
లంచం అడిగితే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి..
లంచం అడగడమే కాదు.. ఇవ్వడం కూడా నేరమే అని గుర్తుంచుకోవాలి. ఇక, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ఎవరైనా లంచం అడిగితే మౌనంగా ఉండకుండా తమకు ఫిర్యాదు చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. పనులు చేసి పెట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్ 1064 ఫిర్యాదు చేయాలని సూచించారు. అవినీతిని కట్టడి చేయాలంటే ప్రజల్లో అవగాహన రావాలన్నారు. అవినీతిరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కాగా, ఫిర్యాదు చేసిన వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.


