Gold Price Prediction: ధంతేరస్ వేళ పసిడి ధరలు భారీగా దిగిరావడంతో ఊపిరి పీల్చుకున్న కొనుగోలుదారుల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం రూ.1.45 లక్షల శ్రేణిలో ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. వచ్చే 2027 నాటికి ఏ స్థాయికి చేరుతుంది? ఇప్పుడు తగ్గిన ధరల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాలు ఉంటాయా లేక మరింత పడిపోతుందా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'యాక్సిస్ డైరెక్ట్'తో పాటు అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు వెల్లడించిన అంచనాలు ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
వచ్చే ఏడాదికి రూ.1.80 లక్షల మార్కును తాకుతుందా?
సమీప కాలంలో వడ్డీ రేట్ల ఒత్తిడి వల్ల బంగారం ధరల్లో కాస్త ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా చూస్తే పసిడి మళ్లీ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ధంతేరస్ నాటికి (2027 ముంగిట) దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.65 లక్షల నుంచి ఏకంగా రూ.1.80 లక్షల వరకు చేరే అవకాశముందని యాక్సిస్ డైరెక్ట్ నివేదిక వెల్లడించింది. అంటే ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేసిన వారికి ఏడాదిన్నర కాలంలో 20 నుంచి 25 శాతం వరకు బంపర్ రాబడి (రిటర్న్స్) దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
2027 నాటికి పసిడి పరుగులు పెట్టడానికి ప్రధాన కారణాలు ఇవే:
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు డాలర్ డిపెండెన్సీని తగ్గించుకుంటూ ఏటా దాదాపు 1,000 టన్నుల బంగారాన్ని రిజర్వులుగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ నిరంతర డిమాండ్ ధరలను కిందకు దిగజారకుండా నిలబెడుతోంది. ప్రపంచ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల ప్రవాహం వెల్లువలా సాగుతోంది. కేవలం ఇటీవలి నెలల్లోనే దాదాపు 39 బిలియన్ డాలర్ల నిధులు ఈటీఎఫ్‌ల్లోకి చేరడం ఇన్వెస్టర్ల బలమైన నమ్మకానికి నిదర్శనం. ప్రస్తుతం గరిష్ఠంగా ఉన్న యూఎస్ వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో తగ్గించడం ప్రారంభిస్తే.. బాండ్ల రాబడులు పడిపోయి ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం వైపు మళ్లుతారు. ఇది నేరుగా రేట్లకు రెక్కలు తొడుగుతుంది. భారత్ తన బంగారాన్ని విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ధరలు నిలకడగా ఉన్నప్పటికీ, డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ తగ్గే కొద్దీ దేశీయంగా బంగారం ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి.
రాబోయే 2027 నాటికి బంగారం విలువ మరింత పెరుగుతుందని అంచనాలు ఉన్నప్పటికీ.. ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్మును పెట్టడం కంటే విడతల వారీగా ఇన్వెస్ట్ చేసుకోవడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలనుకునే వారికి ప్రస్తుత ధరల తగ్గుదల ఒక మంచి అవకాశంగా మారనుందని విశ్లేషిస్తున్నారు.


