తెలంగాణ

Kothagudem: నల్ల బజార్ లో రేషన్ బియ్యం.. పర్యవేక్షణ లోపమా!? అధికారుల నిర్లక్ష్యమా!?..

రచన: Venu5 నిమిషాల పఠనం

పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం కొందరు అక్రమార్కుల వల్ల పక్కదారి పడుతోంది.. రెక్కాడితే గానీ డొక్కాడని పేదల కడుపు నింపాల్సిన బియ్యం.. కమీషన్ల కక్కుర్తికి, నల్లబజారు దందాకు బలవుతోంది.

పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం కొందరు అక్రమార్కుల వల్ల పక్కదారి పడుతోంది.. రెక్కాడితే గానీ డొక్కాడని పేదల కడుపు నింపాల్సిన బియ్యం... కమీషన్ల కక్కుర్తికి, నల్లబజారు దందాకు బలవుతోంది. బియ్యాన్ని తక్కువ ధరలకు కాజేస్తూ, సరిహద్దు దాటించి కొందరు వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతున్న ఈ బియ్యం మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.. అక్కడక్కడ అధికారులు తనిఖీలు చేపడుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా మాత్రం ఆగడం లేదు..

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు ఉత్తర్వులు, ఇల్లందు డీఎస్‌పీ వి. వెంకన్న బాబు ఆదేశాల మేరకు, ఇల్లందు రూరల్ సీఐ బి. సత్యనారాయణ పర్యవేక్షణలో టేకులపల్లి ఎస్ఐ డి. తిరుపతి తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా వస్తున్న అశోక్ లేల్యాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు.. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ రేషన్ బియ్యం దందా గురించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి..

కాకినాడకు చెందిన అనిశెట్టి శ్రీనివాస్ ప్రోద్బలంతో, పాల్వంచకు చెందిన పిట్టల సంపత్ కుమార్, బోయిన నాగేంద్ర బాబు, కొప్పురాయి గ్రామానికి చెందిన గొగ్గల కళ్యాణ్ కుమార్ లు గత కొన్ని రోజులుగా టేకులపల్లి మండల పరిసర గ్రామాల నుండి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి అక్రమంగా నిల్వ చేశారు.

కాకినాడకు బియ్యాన్ని తరలిస్తే ఎక్కువ కిరాయి ఇస్తామని చెప్పడంతో మొగిల్ల శివ ప్రసాద్ తన వాహనంలో సుమారు 40 క్వింటాళ్ల బియ్యాన్ని లోడ్ చేసుకుని బయలుదేరాడు. మార్గమధ్యలో అప్రమత్తంగా వ్యవహరించిన టేకులపల్లి పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న 40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం విలువ మార్కెట్‌లో సుమారు రూ.1,01,250 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న అశోక్‌ లేల్యాండ్‌ వాహనంతో పాటు రేషన్‌ బియ్యాన్ని సీజ్ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ దందాలో భాగస్వాములైన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిరుపతి తెలిపారు.

మరోవైపు పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్‌ రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినా, నిల్వ చేసినా, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్‌ఐ హెచ్చరించారు. అక్రమ రేషన్‌ బియ్యం దందాకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

#Telangana#Bhadradri#Kothagudem#Kakinada#Ration rice#illegal transport#Tekulapalli Police
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి