కాంగ్రెస్ అంటే సంచలనాలకు, అసంతృప్తులకు, వివాదాలకు నిలయం అని దశాబ్దాలుగా భారత రాజకీయ ముఖచిత్రంపై ఆ పార్టీ గురించి బలంగా వినిపించే అభిప్రాయం ఇది. శతాధిక వసంతాల చరిత్ర ఉన్న ఆ మహా వృక్షం మీద చిగురించే ప్రతి ఆకూ ఒక సంచలనం అయితే, రాలే ప్రతి పండూ ఒక వివాదమే!.. ఇక కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది జన్మతః వచ్చిన సహజ లక్షణంగా మారిపోయిందనేది ఒక బహిరంగ రహస్యం.
అధిష్టానం నిర్ణయాలకు ఎదురుతిరిగే నాయకులు, పదవుల కోసం సాగే అంతర్గత ఆధిపత్య పోరు ఆ పార్టీలో నిత్యకృత్యం. ఒకరికి పదవి ఇస్తే పది మందిలో అసంతృప్తి అనేది కాంగ్రెస్ రాజకీయాల్లో సర్వసాధారణమైన దృశ్యం.. గ్రూపు రాజకీయాలు, స్వంత గూటిలోని నాయకులే రాజేసే అసమ్మతి సెగలు.. ఆ పార్టీ పునాదులను ఎన్నోసార్లు కుదిపేశాయి. అలాగే పార్టీలో నాయకులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు తరచూ రచ్చకెక్కుతుంటాయి.
వారసత్వ రాజకీయాలు, నిర్ణయాల్లో జాప్యం, ఢిల్లీ కేంద్రంగా సాగే హైకమాండ్ సంస్కృతి కాంగ్రెస్ చుట్టూ వివాదాల ఉచ్చును బిగించాయి. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం నాయకులు పడే ఆరాటం ఎన్నోసార్లు పార్టీని వివాదాల సుడిగుండంలోకి నెట్టేసింది.. ఈ మధ్య కాలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ చిన్నారెడ్డిల వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే..
ముఖ్యంగా కొండా సురేఖ, చిన్నారెడ్డిల తీరు పై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ హైకమాండ్‌కు సిఫారసు చేసింది.. ఈ క్రమంలో ఎన్నో ఊహాగానాలు వీరిపై ప్రచారంలోకి వస్తున్నాయి.. ఇక తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు, నేతల అసంతృప్తులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అనుకున్న సమయానికి మంత్రి పదవి ఇవ్వలేకపోయామని తెలిపారు..
రాజకీయాల్లో ఓపిక అవసరమని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్.. ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న పలు సమస్యలకు సెప్టెంబర్ నెలలోనే పూర్తి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలోని విభేదాలను సరిదిద్ది, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
అదేవిధంగా రాబోయే సెప్టెంబర్‌లో కేబినెట్ విస్తరణ ఉంటుందా? రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కబోతోందా? అనే చర్చలు కూడా మొదలైయ్యాయి.. గాంధీ భవన్ వేదికగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్! ఇక విస్తరణపై అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో, పదవులను ఆశిస్తున్న నాయకుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి.. ముఖ్యంగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమనే ప్రచారం జోరందుకుంది. పాత, కొత్త కలయికతో సమీకరణాలను కుదర్చడానికి అధిష్టానం కసరత్తు చేస్తోందా?.. లేదా సామాజిక న్యాయం ప్రాతిపదికన తుది జాబితా మారబోతోందా?.. అనేది చర్చంశనీయంగా మారింది..









