తెలంగాణ

Harish Rao: ప్రభుత్వ భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ-రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

రచన: NK12 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రభుత్వ భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ అంటూ విరుచుకుపడ్డారు. అజామాబాద్‌లో 500 కోట్ల విలువైన ప్రభుత్వ 'ఆయిల్‌ఫెడ్' భూమిని కేవలం రూ.87 కోట్లకే ఒక ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి?

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రభుత్వ భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ అంటూ విరుచుకుపడ్డారు. అజామాబాద్‌లో 500 కోట్ల విలువైన ప్రభుత్వ 'ఆయిల్‌ఫెడ్' భూమిని కేవలం రూ.87 కోట్లకే ఒక ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు హరీశ్ రావు. ఆ డబ్బులు చెల్లించడానికి ఆయిల్‌ ఫెడ్ సంస్థ సిద్ధంగా ఉన్నా కాదని, సుప్రీంకోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కి కారు చౌకగా ప్రైవేట్ పరం చేయడం దారుణం అని విరుచుకుపడ్డారు.

ప్రభుత్వ భూములను పల్లీలు, బటానీల్లా దోచి పెడుతున్నారు

​గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ వందల కోట్ల ఆస్తిని ప్రైవేట్ శక్తుల పాలు కాకుండా మేము చిత్తశుద్ధితో కాపాడాము అని ఆయన గుర్తు చేశారు. నేడు మీరు సామాన్యుల ఆస్తులను 22A పేరుతో లాక్కుంటూ, ప్రభుత్వ భూములను పెద్దలకు పల్లీలు, బటానీల్లా దోచి పెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ పై మండిపడ్డారు. ​వెంటనే ఈ అక్రమ కేటాయింపును రద్దు చేసి.. ఆ 15,984 గజాల భూమిని ఆయిల్‌ఫెడ్‌ సంస్థకే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని సీఎం రేవంత్ ను హరీశ్ రావు డిమాండ్ చేశారు. అప్పటి వరకు బీఆర్ఎస్ పక్షాన మా పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ కి లేఖాస్త్రం సంధించారు హరీశ్ రావు. అందులో ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ వ్యక్తికి రూ.500కోట్ల విలువైన భూమి

''రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న తీరు అత్యంత దారుణం. ఆర్టీసీ క్రాస్ రోడ్ అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ కు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టేందుకు మీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు చూస్తుంటే, తెరవెనుక లాలూచీ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్ధమవుతోంది'' అని హరీశ్ రావు అన్నారు.

''అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న 17,261 (3 ఎకరాల 23 గుంటలు) గజాల భూమి వ్యవహారం ఏడు దశాబ్దాల నాటిది. 1954లో ఆయిల్ మిల్లు నడపడం కోసం ఈ ప్లాటును ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇస్తే.. వారు నిబంధనలను తుంగలో తొక్కి అధిక అద్దెలకు సబ్ లీజ్ చేసుకున్నారు. మొదటి ఏడాదిలోనే మిల్లును మూసేసి సొమ్ము చేసుకున్న ఆ సంస్థ లీజును 1974లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై ఆ ప్రైవేటు సంస్థ కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా వారికి చుక్కెదురైంది. 1987 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ ప్రైవేట్ సంస్థకు మిగిలింది కేవలం 1,277 గజాల భూమి మాత్రమే.

ప్రభుత్వ ఆస్తిని కాపాడుతున్న ఆయిల్ ఫెడ్

మిగిలిన 15,984 గజాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, 1991లో జీవో నంబర్ 93 ద్వారా ఆయిల్ ఫెడ్ కు అప్పగించింది. అప్పటి నుంచి మూడు దశాబ్దాలుగా ఆ భూమిలో ఆయిల్ ఫెడ్ (ప్రస్తుత తెలంగాణ ఆయిల్ ఫెడ్) తన కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఆ ప్రభుత్వ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది'' అని హరీశ్ రావు తెలిపారు.

''అయితే రద్దయిన లీజును 2003లో జీవో నంబర్ 366 ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం జరగ్గా.. ఆ జీవోను ఎందుకు ఉపసంహరించకూడదో చెప్పాలంటూ 2015లో ప్రభుత్వమే షోకాజ్ నోటీసు ఇచ్చింది. 2022లో గౌరవ హైకోర్టు సైతం ఈ నోటీసుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంటే చట్టం, న్యాయస్థానం, రికార్డులు అన్నీ స్పష్టంగా ప్రభుత్వ సంస్థవైపే నిలిచాయి.

బీఆర్ఎస్ పాలనలో వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడాము

గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడాము. కానీ, నేడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులనే తుంగలో తొక్కుతూ అడ్డగోలు నిర్ణయాలకు తెరతీసింది. ఆయిల్ ఫెడ్ ఆధీనంలో ఉన్న 15,984 గజాల భూమిని కాదని, ఆ సంస్థకు కేవలం 1,800 గజాలు మాత్రమే ఇచ్చి, మిగతా అత్యంత విలువైన భూమినంతా అక్రమంగా అదే ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేయాలని చూస్తుండటం వెనకున్న మతలబు ఏమిటో రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి'' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

రూ.500కోట్ల విలువైన భూమి రూ.87కోట్లకే ధారాదత్తం

''దశాబ్దాలుగా న్యాయపోరాటం చేసి దక్కించుకున్న ప్రభుత్వ ఆస్తిని, రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఏమిటో బయటపెట్టాలి. బహిరంగ మార్కెట్లో 500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేవలం 87 కోట్ల రూపాయలకే ఆ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఇంత ఆరాటపడుతోంది? ఇదే భూమికి ఫ్రీహోల్డ్ హక్కుల కోసం ఆ 87 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించడానికి ఆయిల్ ఫెడ్ సంస్థ ఎప్పుడో సిద్ధపడింది. అందుకోసం ఎఫ్ డీలు చేసి డబ్బులు కూడా సిద్ధంగా పెట్టింది. సొమ్ము చెల్లించడానికి సొంత ప్రభుత్వ సంస్థే సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ సంస్థను ఆదుకుని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వమే దాన్ని కాదని ఒక ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం వెనుక దాగి ఉన్న కుంభకోణం ఏమిటి?'' అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సింది పోయి దోచిపెడుతున్నారు

''కోట్ల విలువైన ప్రజా ధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఇలా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం వెంటనే మానుకోవాలి. తక్షణమే ఈ అక్రమ కేటాయింపు ప్రక్రియను ఆపి, ఆ 15,984 గజాల భూమిని ఆయిల్ ఫెడ్ సంస్థకే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలి'' అని హరీశ్ రావు రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు.

''ఇది ఒక్క అజామాబాద్ భూమి కథ మాత్రమే కాదు. కోకాపేట, రాయదుర్గం, కంచ గచ్చిబౌలి.. ఇలా ఒక్కొక్క ప్రభుత్వ భూమిని వేలం పేరుతోనో, కేటాయింపు పేరుతోనో అమ్ముకుంటూ పోతున్న మీ ప్రభుత్వ తీరు యావత్ తెలంగాణను కలవరపెడుతోంది. ప్రభుత్వ సంస్థల ఆస్తులను పెంచాల్సిన ప్రభుత్వమే, వాటిని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం సిగ్గుచేటు.

మీ భూదందాను తెలంగాణ సమాజం క్షమించదు

ఓవైపు ప్రజల ప్రైవేటు ఆస్తులను 22A పేరిట ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ప్రభుత్వ ఆస్తులను అయినవారికి కారు చౌకగా కట్టబెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ కపట నాటకానికి, కుటిల నీతికి నిదర్శనం. పేదల పొట్టగొట్టి పెద్దలకు పల్లీ, బఠానీల్లా భూములు పందేరం చేస్తున్న మీ వైఖరిని తెలంగాణ సమాజం క్షమించదు గాక క్షమించదు'' అని హరీశ్ రావు హెచ్చరించారు.

గుడికి, బడికి, చివరికి స్మశానానికి కూడా భూమి మిగలదు

ప్రభుత్వ ఆస్తులను కూడబెట్టి భావితరాలకు అందించాల్సింది పోయి, మీ స్వార్థం కోసం ఇలా ఇష్టారాజ్యంగా భూములు అమ్ముకుంటూ పోతే.. భవిష్యత్తులో తెలంగాణలో ఒక గుడికి, బడికి, చివరికి స్మశానానికి కూడా భూమి లేని దయనీయ పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. మీ కమీషన్లకు కక్కుర్తి కోసం ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గం అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

రూ.500కోట్ల విలువైన భూమిని ఆయిల్ ఫెడ్ ఆధీనంలోనే కొనసాగించాలి

ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు హరీశ్. నగరం నడిబొడ్డున ఉన్న 500 వందల కోట్ల విలువచేసే అజామాబాద్ భూమిని తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధీనంలోనే కొనసాగించి, ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని కోరారు. ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

#Harish Rao#Brs#Govt Lands#Cm Revanth Reddy#Congress Govt#Azamabad Land Row#Oilfed Property#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి