తెలంగాణ

Congress Govt: సంక్షేమం నుంచి ప్రపంచ స్థాయి తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయి

రచన: NK21 నిమిషాల పఠనం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం పాలనలో విజయవంతంగా వెయ్యి రోజుల మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 1 నాటికి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్ నిర్మించడం, సంక్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, రైతులు-మహిళలు-యువతకు భరోసా కల్పించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడం, భవిష్యత్ తెలంగాణకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో ఈ వెయ్యి రోజుల పాలన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది.

Congress Govt: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం పాలనలో విజయవంతంగా వెయ్యి రోజుల మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 1 నాటికి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్ నిర్మించడం, సంక్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, రైతులు-మహిళలు-యువతకు భరోసా కల్పించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడం, భవిష్యత్ తెలంగాణకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో ఈ వెయ్యి రోజుల పాలన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. ఈ వెయ్యి రోజుల పాలనలో రంగాల వారీగా తాము సాధించిన విజయాలను, తెచ్చిన మార్పులను, చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తెలియచేసింది.

ఆర్థిక ప్రగతి-బలపడుతున్న తెలంగాణ

2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే పెట్టుబడులు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల విస్తరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో సమష్టి ప్రగతి సాధించామంది.

రైతన్నకు అండ-వ్యవసాయంలో తెలంగాణ నెంబర్ 1

ఈ వెయ్యి రోజుల పాలనలో అన్నదాతలకు అండగా నిలిచామని ప్రభుత్వం తెలిపింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశామని, 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి కల్పించామని రేవంత్ సర్కార్ వెల్లడించింది. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం అందించామని, ఒకే విడతలో 9 రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్ల జమ చేశామని పేర్కొంది. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇచ్చామంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బీమాతో నిరంతర భరోసా కల్పించామంది. గడిచిన 32 నెలల కాలానికి వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.68 లక్షల కోట్ల వ్యయం చేశామని వివరించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వరి సాగు, ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి దేశంలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని తెలిపింది. గత యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి కొత్త రికార్డ్ సృష్టించామంది.

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం చేశామని ప్రభుత్వం తెలిపింది. యూరియా కొరత వంటి క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించిన రైతన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం

* మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు. మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం ఆదా.

* గృహజ్యోతి కింద 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.

* రాష్ట్రంలోని 4.54 లక్షల మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల రుణాలు. రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ.

* స్కూల్ యూనిఫాంలు, చీరల తయారీ నుంచి పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వరకు మహిళా సంఘాలకు కొత్త వ్యాపార అవకాశాలు.

* కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళలను తెలంగాణ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం.

ఆహార భద్రత-ప్రతి పేద కుటుంబానికి భరోసా

* ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 15 లక్షలకుపైగా కొత్త రేషన్‌ కార్డుల జారీ.

* దాదాపు 3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత.

* రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీతో దేశానికి కొత్త నమూనాగా తెలంగాణ.

* ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ.

* సామాజిక భద్రతను మరింత విస్తరిస్తూ కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు.

* మొత్తం 43 లక్షలకుపైగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు.

ఇందిరమ్మ ఇళ్లు-పేదల సొంతింటి కలకు భరోసా

* తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. అర్హమైన ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం.

* గిరిజనులు, చెంచులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం.

* హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భారీ ప్రణాళిక.

సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు

* రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించి కులాల వారీ సామాజిక స్థితిగతుల వెల్లడి.

* సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ.

* బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం.

* 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణతో దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం.

* గిగ్‌ కార్మికులకు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సామాజిక భద్రత కల్పించే ప్రత్యేక చట్టం.

విద్యలో సంస్కరణలు.. ప్రభుత్వ బడులకు కొత్త రూపం

* కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి.

* ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌. 105 స్కూళ్ల మంజూరు.

* ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లతో ప్రభుత్వ విద్యకు కొత్త రూపం.

* ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు 22 లక్షలకుపైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషకాహారం. రూ.720 కోట్ల కేటాయింపు.

* సంక్షేమ హాస్టళ్లలో డైట్‌ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్‌ ఛార్జీలు 212 శాతం పెంపు.

* మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయుల నియామకం.

* దాదాపు 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్ల కేటాయింపు.

యువతకు ఉద్యోగాలు-నైపుణ్యాలకు కొత్త వేదిక

* ప్రజా ప్రభుత్వ తొలి వెయ్యి రోజుల్లో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. గ్రూప్‌-1 నుంచి డీఎస్సీ వరకు కీలక నియామకాల పూర్తి.

* టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టులు, పోలీసు నియామక బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.

* యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో 1,190 మంది శిక్షణ పూర్తి చేయగా 838 మందికి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు.

* 65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్‌ కాలేజీలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడం.

* యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌తో క్రీడా రంగానికి కొత్త దిశ.

వైద్య రంగంలో భారీ విస్తరణ-సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు అండ

* రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.

* గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.

* సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌లో మూడు టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు.

* తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు. మరో 17 కాలేజీల నిర్మాణం.

* నిమ్స్‌లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయి.

* 2023 డిసెంబర్‌ 7 నుంచి 2026 ఆగస్టు 12 వరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5,18,186 మందికి రూ.2,526.12 కోట్ల సాయం.

* సీఎంఆర్‌ఎఫ్‌ వైద్య రీయింబర్స్‌మెంట్‌ ద్వారా 4,78,789 మంది పేద రోగులకు రూ.1,635.34 కోట్లు. 39,712 మందికి రూ.798.41 కోట్ల ఎల్‌ఓసీలు.

ఆహార కల్తీపై ఉక్కుపాదం-కొత్తగా టీజీ సేఫ్‌

* ఆహార కల్తీపై తనిఖీలు, శాంపిల్‌ పరీక్షలు, కఠిన చర్యలు.

* ఆహార కల్తీ, డ్రగ్స్‌ ముప్పును సమగ్రంగా ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్‌ సంస్థ ఏర్పాటు.

* ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్‌ నియంత్రణను ఒకే వ్యవస్థ కిందకు తెచ్చి లీగల్‌, ల్యాబొరేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలతో బలోపేతం.

* ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై విస్తృత దాడులు, కఠిన చట్టపరమైన చర్యలు.

డ్రగ్స్‌పై రాజీలేని పోరాటం-విద్యా సంస్థలకూ బాధ్యత

* డ్రగ్స్‌పై ఈగల్‌ వ్యవస్థ ద్వారా ప్రత్యేక పోరాటం. సైబర్‌ నేరాలు, మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక పోలీసింగ్‌.

* పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో యాంటీ డ్రగ్‌ అండ్‌ సేఫ్టీ కమిటీలు తప్పనిసరి చేసే దిశగా చర్యలు.

* ప్రతి విద్యాసంస్థలో క్యాంపస్‌ కోఆర్డినేటర్లు, స్పాటర్ల ఏర్పాటు. విద్యార్థుల్లో అనుమానాస్పద ప్రవర్తనా మార్పులను గుర్తించి విద్యాశాఖ, పోలీసులకు సమాచారం.

* విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసే విద్యాసంస్థలపై గుర్తింపు సస్పెన్షన్‌ చర్యలు.

ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు ప్రత్యేక వ్యవస్థ

* పట్టణాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, హైవేలు-ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాలను తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో.

* పట్టణ ట్రాఫిక్‌ నిర్వహణ, హైవే పెట్రోలింగ్‌, ప్రమాదాల నివారణకు అవసరమైన నిధులు, ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక వ్యవస్థ.

* ప్రజలకు సాఫీగా, సురక్షితంగా ప్రయాణం అందించడం ప్రధాన లక్ష్యం.

ప్రజల వద్దకే పాలన-మండల స్థాయికి ప్రజావాణి

* రాష్ట్ర, జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి విజయవంతమైన నేపథ్యంలో ప్రజల సమస్యలను వారి మండలంలోనే పరిష్కరించేలా అన్ని ఎంపీడీవో కార్యాలయాలకు మండల ప్రజావాణి విస్తరణ.

* ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులంతా ఒకేచోట అందుబాటులో ఉండి అర్జీల పరిష్కారం. చిన్న సమస్యల కోసం ప్రజలు జిల్లా, రాష్ట్ర స్థాయికి వెళ్లాల్సిన అవసరం తగ్గింపు.

* త్వరలో ఆన్‌లైన్‌ ప్రజావాణి పోర్టల్‌. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఆన్‌లైన్‌లో అర్జీల నమోదు.

* అర్జీల పరిష్కార పురోగతిపై ప్రత్యేక డాష్‌బోర్డు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిరంతర పర్యవేక్షణ.

* 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో 12,758 గ్రామసభలు, 3,175 వార్డుసభల నిర్వహణ.

భూ పరిపాలన-ఉద్యోగులకు భరోసా-డిజిటల్‌ గవర్నెన్స్‌

* భూ భారతి చట్టం, భూధార్‌, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు. 3.76 లక్షల కొత్త పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ జారీ.

* ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందించేలా ఆర్థిక క్రమశిక్షణ.

* కొన్నేళ్లుగా పేరుకుపోయిన రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల్లో వంద రోజుల్లో రూ.600 కోట్ల చెల్లింపు.

* ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌.

* ప్రభుత్వ ఆదాయం పెంచడం నుంచి సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక అభినందనలు.

* 36 సచివాలయ శాఖల్లో 100 శాతం ఈ-ఆఫీస్‌.

* దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్‌ కేబినెట్‌. వాట్సాప్‌లో 581కిపైగా ప్రభుత్వ సేవలు.

ఆదాయ లీకేజీలకు చెక్‌-ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు

* ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టకుండా విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖల్లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల ఏర్పాటు.

* పౌరసరఫరాలు, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌, జీఎస్టీ తదితర రంగాల్లో ఆదాయ నష్టాలు, ఎగవేతలను గుర్తించి అరికట్టే ప్రత్యేక చర్యలు.

* రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అదే వనరులను ప్రజా సంక్షేమం, అభివృద్ధికి వినియోగించాలన్న ప్రభుత్వ లక్ష్యం.

ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు

* హైదరాబాద్‌ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డు.

* రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్‌ రోడ్ల ప్రణాళిక.

* హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో 7 కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణ.

* మామునూరు విమానాశ్రయం, ఆదిలాబాద్‌ ఎయిర్‌ఫీల్డ్‌ అభివృద్ధి.

* మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల సమగ్ర అభివృద్ధి. 39 కొత్త ఎస్టీపీలు.

* గోదావరి నుంచి 2.5 టీఎంసీల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళిక.

పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ

* బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌లో కీలక రంగాల్లో తెలంగాణ టాప్‌ అచీవర్‌.

* టీజీ-ఐపాస్‌ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు.

* తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు.

* టీజీఐఐసీ భూముల్లో రూ.92,281 కోట్ల పెట్టుబడులు. 78 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలకు మార్గం.

* నెక్స్ట్‌-జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీతో రూ.73,360 కోట్ల పెట్టుబడులు. 3.5 లక్షల ఉద్యోగ అవకాశాల లక్ష్యం.

* తెలంగాణపై విశ్వాసంతో పెట్టుబడులు పెడుతున్న దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కృతజ్ఞతలు.

ఐటీ-ఏఐ-గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లలో దూసుకెళ్తున్న తెలంగాణ

* 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97లక్షల కోట్లు. 12.14 లక్షల ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు.

* హైదరాబాద్‌లో 355కిపైగా గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు. 2026లోనే మరో 40 కొత్త కేంద్రాలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం.

* డేటా సెంటర్లు, క్లౌడ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో తెలంగాణ.

* అమెజాన్‌ నుంచి తెలంగాణకు అదనంగా 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి.

* దేశంలో తొలి స్టేట్‌ ఏఐ డేటా ఎక్స్ చేంజ్-టీజీడెక్స్‌ ఏర్పాటు.

పర్యాటకం-తెలంగాణ సంస్కృతికి కొత్త గుర్తింపు

* రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం పాలసీ–2025.

* ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం పెట్టుకోగా తొలి ఏడాదిలోనే రూ.23,174 కోట్ల పెట్టుబడులు.

* యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో నెంబర్ 1

*‘జయ జయహే తెలంగాణ’ గీతానికి అధికారిక గౌరవం. తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.

* తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సముచిత గౌరవం కల్పించేందుకు ప్రత్యేక కమిటీ.

తెలంగాణ రైజింగ్‌-2047.. వెయ్యి రోజుల తర్వాత మరింత పెద్ద లక్ష్యం

* వెయ్యి రోజుల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి వేసిన పునాదులపై భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం.

* 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం.

* క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ అభివృద్ధి వలయాలతో హైదరాబాద్‌ నుంచి గ్రామీణ తెలంగాణ వరకు సమగ్ర అభివృద్ధి.

* భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దేశంలో తొలి నెట్‌-జీరో స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళిక.

* ఏఐ సిటీ, డేటా సెంటర్లు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో భవిష్యత్తు తెలంగాణకు బలమైన పునాదులు.

#Congress Govt#Telangana Congress Government#Cm Revanth Reddy#Congress Govt Administration#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి