కైలాస యాత్రలో ఊహించని విషాదం..
ఇంకా ఆచూకీ లేని 77 మంది
తల్లడిల్లిపోతున్న సద్గురు
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరద తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి విపత్తు ధాటికి అనేక ప్రాంతాలు అతలాకుతలమవ్వగా.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఇషా ఫౌండేషన్ బృందంలోని 77 మంది యాత్రికులు గల్లంతవ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తమవాళ్లు ఎక్కడున్నారో తెలియక 77 కుటుంబాలు క్షణక్షణం భయాందోళనతో ఎదురుచూస్తున్నాయి. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగినా.. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో గల్లంతైన వారి నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు.
ఈ ఘటనపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్జీ వాసుదేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఒక్క మాట ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
అరగంట ఆలస్యంగా వెళ్లి ఉంటే బాగుండేది..సద్గురు
సద్గురు చెప్పిన వివరాల ప్రకారం.. ఆయన కైలాస యాత్ర బృందం టిబెట్ వైపు నుంచి నేపాల్‌కు తిరిగి వస్తోంది. ఈ సమయంలో గ్యిరోంగ్ ప్రాంతంలోని ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి బృందం చేరుకుంది. సరిహద్దు ప్రాంతంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియకు భారీ సమయం పట్టే అవకాశం ఉండటంతో.. తమ బృందం ఎప్పుడూ ముందుగానే అక్కడికి చేరుకుంటుందని సద్గురు తెలిపారు. ఆ రోజు కూడా అదే జరిగింది.
టీమ్ లీడర్ ప్రవీణ్ ఉదయం 9:05 గంటలకు అందరూ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి చేరుకున్నారని సద్గురుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. “మొదటి బృందంగా ఉండాలని మేము ఎప్పుడూ ప్రయత్నిస్తాం. అక్కడ గందరగోళం, రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఆలస్యంగా వెళ్తే గంటల తరబడి వేచి ఉండాల్సి రావచ్చు” అని సద్గురు వివరించారు. కానీ.. ఆ రోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది.
అరగంట ఆలస్యంగా వెళ్లి ఉంటే బాగుండేది...
ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి బృందం చేరుకున్న కొద్దిసేపటికే భారీ వరద విరుచుకుపడింది. నీటితో పాటు బురద, శిథిలాలు భారీగా ప్రవహించాయి. ఈ విషయం తెలిసిన సమయంలో సద్గురు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే తన బృందం మొత్తం ఇమ్మిగ్రేషన్ కేంద్రం లోపలే ఉందని ఆయనకు తెలుసు.
భవనం వరదలో మునిగిపోయినా పర్వాలేదు. పాస్‌పోర్టులు పోయినా పర్వాలేదు. బట్టలు పోయినా పర్వాలేదు. కానీ వాళ్లు ప్రాణాలతో ఉంటే చాలు అని అనుకున్నానని సద్గురు తెలిపారు. అయితే.. ఆ తర్వాత బయటకు వచ్చిన దృశ్యాలు పరిస్థితి ఎంత భయానకంగా ఉందో చూపించాయి. తాము కేవలం వారం రోజుల క్రితమే ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసిన అదే భవనం.. వరద ఉద్ధృతికి పూర్తిగా కొట్టుకుపోయిందని సద్గురు చెప్పారు.
ఈ పరిస్థితిని గుర్తుచేసుకుంటూ.. మాకు అంత క్రమశిక్షణ లేకపోయి ఉంటే.. ఇంకో అరగంట ఆలస్యంగా వెళ్లి ఉంటే బాగుండేది అనే భావన తనను వెంటాడుతోందని సద్గురు పదే పదే చెప్పడం విషాద తీవ్రతను తెలియజేస్తోంది.
19 దేశాలకు చెందిన యాత్రికులు
గల్లంతైన వారిలో ఒక్క దేశానికి చెందినవారే లేరు. మొత్తం 19 దేశాలకు చెందిన యాత్రికులు ఈ బృందంలో ఉన్నారు. అమెరికాకు చెందిన 22 మంది, కెనడాకు చెందిన 12 మంది, ఆస్ట్రేలియాకు చెందిన 11 మంది, బ్రిటన్‌కు చెందిన 9 మంది ఉన్నారు. అలాగే జర్మనీకి చెందిన నలుగురు, ఫ్రాన్స్, నేపాల్ దేశాలకు చెందిన ముగ్గురేసి, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, స్పెయిన్ దేశాలకు చెందిన ఇద్దరేసి యాత్రికులు ఉన్నారు.
ఫిన్లాండ్, హంగేరీ, ఇజ్రాయెల్, లిథువేనియా, ఫిలిప్పీన్స్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ఒక్కొక్కరు కూడా ఈ బృందంలో ఉన్నారు. దీంతో ఈ ఘటన అంతర్జాతీయంగా కూడా తీవ్ర ఆందోళనకు కారణమైంది.
గ్యిరోంగ్ వైపు వెళ్లేందుకు సద్గురు ప్రయత్నం
పరిస్థితి తీవ్రత తెలుసుకున్న తర్వాత సద్గురు స్వయంగా గ్యిరోంగ్ వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే రోడ్లు బ్లాక్ అయ్యాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫోన్లు పనిచేయకపోవడంతో ఘటనాస్థలానికి చేరుకోవడం సాధ్యం కాలేదు.
తన బృందం సహా ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు సహాయం చేసేందుకు భారత, చైనా, అమెరికా దౌత్య కార్యాలయాలతో కలిసి ప్రయత్నిస్తున్నట్లు సద్గురు తెలిపారు. నేపాల్ వైపు టిమురే ప్రాంతంలో కూడా ఇషా ఫౌండేషన్‌కు చెందిన ముగ్గురు వాలంటీర్లు చిక్కుకుపోయినట్లు ఆయన తెలిపారు.
ఎన్నో కలలతో కైలాస యాత్రకు వెళ్లిన ఈషా బృందం వరదల్లో గల్లంతవడం.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎప్పటికైనా తమవారు తిరిగి రాకపోతారా అని వారంతా ఎదురుచూస్తుండడం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.







