Kolkata: ప్రియురాలిని ముద్దుపెట్టుకున్నాడన్న కారణంతో ఓ యువకుడితో పాటు అతడి తండ్రి, స్నేహితుడి బట్టలు విప్పించి, తుపాకీతో బెదిరిస్తూ వీధుల్లో నగ్నంగా ఊరేగించిన అత్యంత అమానుష ఘటన కోల్కతాలో తీవ్ర కలకలం రేపింది. నాగరిక సమాజం తలదించుకునేలా సాగిన ఈ దాష్టీకం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందంటే.. కోల్కతాలోని బెహాలా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు తన స్నేహితుడితో కలిసి ప్రియురాలైన మైనర్ బాలికను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఆ యువకుడు ఆమెకు ముద్దు పెట్టాడు. అయితే, దీన్ని బాలిక బంధువుల్లో ఒకరు దూరం నుంచి చూసి వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని యువకుడితో పాటు అతడి ఫ్రెండ్ను బలవంతంగా లాక్కెళ్లారు. ఖుదిరాంపల్లిలోని తమ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించి ఇద్దరినీ చితకబాదారు. అంతటితో ఆగకుండా యువకుడి తండ్రిని కూడా అక్కడికి పిలిపించారు.
తుపాకీ గురిపెట్టి నగ్నంగా వీధుల్లో..
అక్కడికి చేరుకున్న యువకుడి తండ్రిపైనా బాలిక బంధువులు విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం ఆ ముగ్గురి బట్టలు బలవంతంగా విప్పించి నగ్నంగా మార్చారు. బట్టలు లేకుండా వీధిలో నడవాలని, ఎదురుతిరిగితే కాల్చి చంపేస్తామంటూ తుపాకీతో ప్రాణభయం కల్పించారు. ఆ ముగ్గురినీ అలాగే నగ్నంగా రోడ్డుపై కొంతదూరం వరకు నడిపిస్తూ ఊరేగించి క్రూరంగా అవమానించారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. బాలిక తండ్రితో సహా ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


