Farmhouse: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. బీటెక్ చదువుతున్న కృష్ణ కౌండిన్య (21) స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి విగతజీవిగా మారాడు. ఉప్పల్ బగాయత్ కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కుమారుడు కౌండిన్య తన ఫ్రెండ్ రిషబ్ తో కలిసి పుట్టిన రోజు వేడుకల కోసం ఏదులాబాద్ లోని ఒక ఫామ్‌హౌస్‌కి వెళ్లాడు. కాగా, అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయాడు అంటూ అతడి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. కౌండిన్యను స్నేహితులు ఘట్ కేసర్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కౌండిన్య తండ్రి ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఇంట్లో చదువుకుంటున్న తన కుమారుడిని పార్టీ పేరుతో తీసుకెళ్లి చంపేశారని కౌండిన్య తండ్రి కంటతడి పెట్టారు.
పార్టీ అని తీసుకెళ్లి బాడీని పంపించారు
బర్త్ డే పార్టీ అని తీసుకెళ్లి నా కొడుకు బాడీని పంపించారు అంటూ విలపించారు. రాత్రి ఘటన జరిగితే పొద్దున వరకు తమకు విషయం చెప్పలేదని వాపోయారు. ఎవరో బయటి వ్యక్తులతో ఉదయం 10.30 గంటలకు కాల్ చేయించారని తెలిపారు. తన కుమారుడి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఆ 11మంది చావకుండా నా బిడ్డనే చంపేశారు అంటూ కౌండిన్య తండ్రి కన్నీటిపర్యంతం అయ్యారు.
ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది?
''అసలు ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది? అనేది కౌండిన్య ఫ్రెండ్ రిషబ్ ఇంకా చెప్పడం లేదు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దాంతో అతడిని అనుమానించాల్సి వస్తోంది. అసలు ఆ ఫామ్ హౌస్ లో పార్టీకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? అక్కడ ఏమైనా ఘర్షణ జరిగిందా? దీనిపై పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేయాలి'' అని కౌండిన్య బంధువులు డిమాండ్ చేశారు.


