Tummidihatti: తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంచి తెలంగాణకు పుష్కలంగా నీళ్లు తేవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహానికి ముంబై గడ్డపై ఊహించని బ్రేక్ పడింది. ఎంతో నమ్మకంతో మహారాష్ట్రకు వెళ్లిన రేవంత్ బృందానికి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన షాక్‌తో ప్లాన్ మొత్తం తలకిందులైంది. అనుమతులు సాధించి విజయవంతంగా తిరిగొద్దామనుకున్న రేవంత్ సర్కార్‌కు ఉత్త కమిటీ ప్రతిపాదన మాత్రమే మిగిలింది.
అసలు రేవంత్ ప్లాన్ ఏంటి?
2016లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం ప్రకారం తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 148 మీటర్లుగా నిర్ణయించారు. అయితే ఈ ఎత్తుతో తెలంగాణకు సరిపడా నీరు అందదని భావించిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్, బ్యారేజీ ఎత్తును కనీసం 150 లేదా 152 మీటర్ల వరకు పెంచాలని పట్టుబట్టింది. ఇదే అజెండాతో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ముంబై వెళ్లి ఫడ్నవీస్‌తో కీలక మంతనాలు జరిపారు. ఎలాగైనా ఒప్పించి ప్రాజెక్టును పరుగులు పెట్టించాలన్నది వారి వ్యూహం.
ఫడ్నవీస్ చెక్.. సీన్ రివర్స్!
కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వేసిన ఎత్తుగడతో రేవంత్ ప్లాన్ పూర్తిగా రివర్స్ అయింది. బ్యారేజీ ఎత్తును పెంచే ప్రసక్తే లేదన్నట్లుగా ఆయన కుండబద్దలు కొట్టారు. 152 మీటర్ల ఎత్తుకు అనుమతిస్తే మహారాష్ట్ర పరిధిలోని చాప్రాల్ అభయారణ్యంతో పాటు సుమారు 2,300 ఎకరాల అటవీ, వ్యవసాయ భూమి పూర్తిగా మునిగిపోతుందని లెక్కలు చూపించారు. తమ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఒక్క అంగుళం కూడా ఎత్తు పెంచేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. తమకు ఎలాంటి నష్టం కలగదని స్పష్టత వస్తేనే పాత అగ్రిమెంట్‌ను కూడా పరిశీలిస్తామని మెలిక పెట్టారు.
అనుమతులు రాకపోగా కమిటీ మెలిక
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపునకు గ్రీన్ సిగ్నల్ రాకపోగా.. బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, నీటి లభ్యతను పరిశీలించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేద్దామంటూ ఫడ్నవీస్ చేతులు దులిపేసుకున్నారు. ప్రభుత్వాల మధ్య కమిటీల అధ్యయనాలు అంటే ఏళ్ల తరబడి సాగే తతంగమే. దీంతో రేవంత్ రెడ్డి ఆశించినట్లుగా సత్వర అనుమతులు దక్కకపోగా, ప్రాజెక్ట్ వ్యవహారం మళ్లీ కాలయాపన గూటికి చేరిందన్న విమర్శలు మొదలయ్యాయి.


